AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్

సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కంది ఎక్స్ రోడ్డు వద్ద స్పెషల్ నార్కోటిక్స్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరిని, రవాణాకు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేశారు. సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
Sangareddy Ganja Seizure
P Shivteja
| Edited By: |

Updated on: Oct 13, 2026 | 6:42 PM

Share

సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, కంది ఎక్స్ రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో పాటు, రెండు కార్లను సీజ్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు స్పెషల్ నార్కోటిక్స్, యాంటీ సోషల్ బిహేవియర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా కంది ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పటాన్‌చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న హ్యుందాయ్ ఎక్సెంట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లను ఆపి తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో హ్యుందాయ్ ఎక్సెంట్ కారులో అనుమానాస్పదంగా ఉన్న 35 ప్యాకెట్ల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన రోషన్ కర్జీ (26), బిబుధ రాజా (22)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అరెస్ట్ చేసిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి రెండు కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 588/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

మాదకద్రవ్యాల సాగు, అక్రమ రవాణా లేదా సరఫరాకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసైనా సరే, వెంటనే ఎస్‌-నాబ్ (S-NAB) నంబర్ 8712656777కు కాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని వారు భరోసా కల్పించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us