అమెరికా సైనికులను పట్టిస్తే లకాధికారుల్ని చేస్తాం! పౌరులకు ఇరాన్ బంపర్ ఆఫర్!
అమెరికా సైనికులను బంధించినా లేదా వారి ప్రాణాలు తీసిన వారికి ఇరాన్ ఆర్మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశ పౌరులకి ఏకంగా 30,000 డాలర్లు అంటే ఇరాన్ కరెన్సీలో 5 బిలియన్ తోమన్లు నజరానాగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సంచలన ఆఫర్‌లో మరో ట్విస్ట్ కూడా ఉంది .

అమెరికా సైనికులను బంధించినా లేదా వారి ప్రాణాలు తీసిన వారికి ఇరాన్ ఆర్మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశ పౌరులకి ఏకంగా 30,000 డాలర్లు అంటే ఇరాన్ కరెన్సీలో 5 బిలియన్ తోమన్లు నజరానాగా ఇస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ సంచలన ఆఫర్‌లో మరో ట్విస్ట్ ఏంటంటే… ఒకవేళ ఈ సాహసాన్ని ఇరాన్ మహిళలు పూర్తి చేస్తే, వారికి అందే బహుమతి మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే ఏకంగా $60,000 డాలర్లు వారి సొంతమవుతాయి!
ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) ప్రకారం… ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించారు. తాము కూడా యుద్ధంలో పాల్గొంటామని దేశప్రజల నుంచి వచ్చిన “విజ్ఞప్తుల” మేరకు ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. ” ఇరాన్ భూభాగంలోకి అడుగుపెట్టే ఆక్రమణదారులైన అమెరికన్ సైనికులను పట్టుకుని అప్పగించినా లేదా అంతమొందించినా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆర్మీ తరఫున ఈ భారీ పారితోషికం అందుతుంది” అని హతామీ ప్రకటించారు. అయితే ఈ చర్యలు ఎప్పుడు, ఎక్కడ చేపట్టాలనే దానిపై ఎలాంటి స్పష్టమైన వివరాలను ఆయన వెల్లడించలేదు.
మధ్యప్రాచ్యంలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒక అమెరికన్ ఎయిర్‌మ్యాన్ విమానం కూలిపోయిన ఘటన మినహా… ఇరాన్ నేలపై నేరుగా అమెరికా బలగాలు అడుగుపెట్టిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. అయినప్పటికీ “ఈ సాహసోపేతమైన చర్యకు దిగే వీర మహిళలకు రెట్టింపు బహుమతి లభిస్తుంది” అని హతామీ పిలుపునిచ్చారు.
ఆయుధానికి కూడా జైత్రయాత్ర!
‘ది జెరూసలేం పోస్ట్’ కథనం ప్రకారం… ఈ ఆఫర్ కేవలం నగదు బహుమతితోనే ఆగిపోదు. దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా ఇరాన్ ప్రభుత్వం రెట్టింపు ధరకు కొనుగోలు చేయడంతో పాటు, సదరు వ్యక్తికి సరికొత్త ఆయుధాన్ని బహుమతిగా ఇస్తుంది. అంతేకాకుండా, ఆ సైనికుడిని అంతమొందించిన ఆయుధాన్ని రాబోయే రోజుల్లో నిర్మించబోయే ఒక ప్రత్యేక ‘మ్యూజియం’లో జ్ఞాపకంగా భద్రపరుస్తామని హతామీ పేర్కొనడం విశేషం. ఇరాన్‌తో జరుగుతున్న పోరాటంలో అమెరికా సైనిక శక్తికి సంబంధించిన లోపాలు బట్టబయలయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన హతామీ… “పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ లేదా హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే అర్హతను అమెరికా పూర్తిగా కోల్పోయింది” అని స్పష్టం చేశారు.
ముగింపుకు అమెరికా- ఇరాన్ సీజ్‌ఫైర్ .. యుద్ధ జ్వాలలు తప్పవా?
జూన్ 17న కుదిరిన చారిత్రాత్మక “యుఎస్-ఇరాన్ ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం” (MoU) 60 రోజుల గడువు ముగింపు దశకు చేరుకోవడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమై ఏకధాటిగా 40 రోజుల పాటు యుద్ధం సాగిన తర్వాత, రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్)కు, శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు ఈ ఒప్పందం కుదిరింది. అయితే సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఏమాత్రం ముందుకు సాగలేదు. దానికి బదులుగా, పరస్పరం జరుపుకున్న కాల్పులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తంగా మారింది.
యుఎస్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య 17. గమనించాల్సిన విషయమేమిటంటే—ఈ 17 మంది సైనికులు కూడా ఇరాన్ సరిహద్దులకు వెలుపల, ఇరాక్ ఇంకా జోర్డాన్ వంటి పొరుగు దేశాలలో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 60 రోజుల కాల్పుల విరమణ గడువు సమీపిస్తుండటంతో, ఇరు దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకుంటాయా లేదా పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతాయా ? ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.