Justice nv ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ కలసి వస్తే ఆయన త్వరలోనే చీఫ్ జస్టిస్ కానున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయవాదుల్లో సీనియర్ గా ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. కాగా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆయన పేరును ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాశారు.
ఇదిలావుంటే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ బాబ్డేకు లేఖ రాసింది. ప్రస్తుతమున్న చీఫ్ జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి చీఫ్ జస్టిస్ పేరును సిఫార్సుచేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. నిజానికి ఇప్పుడున్న వారిలో సీనియర్ జస్టిస్ ఎన్వీ రమణ మాత్రమే. సీనియారిటీ ప్రకారం చీఫ్ జస్టిస్ పదవి ఆయనకే దక్కాల్సి ఉంది. సీజే ప్రతిపాదించిన పేరును కేంద్ర ప్రభుత్వం కొలిజియానికి పంపితే ఫైనల్ అయినట్లే.
సుప్రీంకోర్టు 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరు ప్రతిపాదించారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే. దీనికి సంబంధించి న్యాయశాఖకు లేఖ రాశారు. ఏప్రిల్ 23న రిటైర్డ్ కానున్నారు బోబ్డే. కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగస్టు 27న జన్మించారు జస్టిస్ రమణ. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా 16 నెలలు పదవీ కాలం అంటే, 2022 ఆగస్టు 26 వరకూ ఆయనకు సర్వీసు ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.
2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.