కదల్లేకపోతున్నా.. ఆరోగ్యం క్షీణిస్తోంది.. ఫించన్ ఇవ్వండి మహాప్రభు.. వేడుకున్న పద్మవిభూషణ్ తీజన్ బాయి
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు పొందిన అంతర్జాతీయ కళాకారిణి తీజాన్ బాయి గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పక్షవాతం, మధుమేహం కారణంగా మంచానికే పరిమితమయ్యారు.
‘నేను పాండవని జానపద గాయని తిజాన్ బాయిని..’ అంటూ ధీనంగా రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు పొందిన అంతర్జాతీయ కళాకారిణి తిజాన్ బాయి, మహాభారత ఇతిహాసంలోని పాండవుల కథలను సాంప్రదాయక గాన శైలిలో పాడారు. పాండవని శక్తివంతమైన మనోహరమైన ప్రదర్శనలకు పేరుగాంచిన తీజన్ బాయి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రోజు రోజుకీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి అందాల్సిన పింఛన్ గత 9 నెలలుగా రావడం లేదు. దీంతో ఆమె చికిత్సపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు జానపద గాయని తీజన్ బాయి స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశారు.
తీజాన్ బాయి గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తీజన్ బాయి కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి ఆమెకు బీపీ కూడా పెరిగింది. అయితే చికిత్స చేయించేందుకు ఆర్థిక స్తోమత లేక కుటుంబసభ్యులు నానావస్థలు పడుతున్నారు. దీనికి తోడు గత మార్చి నుంచి రూ.5వేలు పింఛను అందలేదు. ఇన్ని నెలలుగా పింఛన్ రాకపోవడంతో సరైన వైద్యం చేయించలేకపోతున్నామని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే తీజాన్ బాయి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాయ్‌పూర్‌లోని సాంస్కృతిక శాఖకు లేఖ ఇంకా చేరలేదు. ఆమెకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించామని, అయితే వారు కూడా సక్రమంగా రావడం లేదని, అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి కలెక్టర్‌కు ఇచ్చిన దరఖాస్తులో, “నేను పాండ్వానీ జానపద గాయని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ శ్రీమతి తీజన్ బాయి, వయస్సు 78 సంవత్సరాలు, ఛత్తీస్‌గఢ్‌లోని గనియారి, జిల్లా దుర్గ్‌కు చెందిన వారు. గత రెండు సంవత్సరాలుగా పక్షవాతం కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. మధుమేహం, ఇతర వ్యాధుల కారణంగా నడవలేకపోతున్నాను. దినచర్యను బెడ్‌పై మాత్రమే చేయవలసి వస్తుంది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల స్టేజ్ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నాను. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాను. కుటుంబం, ఢిల్లీ సంగీత నాటక అకాడమీ కళాకారుల మద్దతుతో చికిత్స కష్టంగా జరుగుతోంది. ప్రస్తుతం, నా కొడుకు చనిపోవడంతో కుమార్తె భర్త అల్లుడు మీద ఆధారపడి ఉన్నాను. అతని పొదుపు కూడా చికిత్స కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మందులు కొనుక్కోలేక వైద్యం చేయించుకోలేకపోతున్నాను. కావున, దయచేసి నా జీవనం, చికిత్స కోసం కళాకారులకు ఇచ్చే పెన్షన్, నెలవారీ సహాయం మొత్తాన్ని ఆమోదించవలసిందిగా వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను.” అంటూ పాండ్వానీ జానపద గాయని తీజన్ బాయి లేఖలో పేర్కొన్నారు.
డిసెంబర్ 10వ తేదీన తన నివాసానికి వచ్చిన రాయ్‌పూర్‌లోని సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ గ్రేడ్-2 రాబర్ట్‌సన్ దాస్‌కు తీజన్ బాయి ఈ దరఖాస్తును అందించారు. తీజాన్‌బాయి తన పాండ్వానీ గానంతో ప్రపంచాన్ని మైమరిపిచారు. సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ తోపాటు భారతదేశానికి కీర్తి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం గత రెండేళ్లుగా పక్షవాతం రావడంతో మంచంపై నుంచి లేచి నడవలేకపోతున్నారు. కనీస మాట్లాడలేకపోతున్నారు. తన కోడలు వేణు చేతిరాతతో రాసిన దరఖాస్తుపై బొటన వేలి ముద్ర వేసి అధికారికి విజ్ఞప్తి చేశారు.
ఈ లేఖ తర్వాత, సాంస్కృతిక శాఖ ప్రతినిధులు కోడలు వేణు నుండి ఇప్పటివరకు తీజన్ చికిత్సకు అయిన ఖర్చుల గురించి సమాచారం తీసుకున్నారు. చికిత్సకు సంబంధించిన పత్రాలు, మందుల కొనుగోలుకు సంబంధించిన ఒరిజినల్ బిల్లులను కూడా అధికారులు అడిగారు. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, అఫిడవిట్, ఇతర ముఖ్యమైన పత్రాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.. ఇక ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రిచా ప్రకాష్ చౌదరి స్పందించారు. తీజాన్ బాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని, ఆమెకు గత 9 నెలలుగా పింఛను అందడం లేదని తెలిపారు. ఇప్పుడు అది కూడా అందుబాటులోకి రానుంది. వీరికి ప్రభుత్వం నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఆమె ఆరోగ్యంపై శ్రద్ద వహించేందుకు హెల్త్ టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. రోజూ వెళ్లి ప్రత్యేక వైద్యునితో ఫిజియోథెరపీ చేయిస్తామన్నారు. తీజాన్ బాయికి పింఛను వస్తోందని, మధ్యలో ఆమె ఖాతాలో ఏదో సమస్య ఉందని, ఇది పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..