Chhangur Baba: హాజీ అలీ నుంచి దుబాయ్ వరకు.. ఈడీ రాడార్‌లో ఛాంగూర్ బాబా చీకటి సామ్రాజ్యం
ఛాంగూర్ బాబా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాబా చీకటి సామ్రాజ్యం రాష్ట్రాలు దాటి విస్తరించిందని ఈడీ గుర్తించింది. బలరాంపూర్, లక్నో, ముంబైలోని 15 ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించిన విస్తృత దాడుల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ డాక్యుమెంట్లలో ఏముందంటే..?..

ఛాంగూర్ బాబా వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రలోభాలు, లవ్ జిహాద్‌లతో మతమార్పిళ్లకు పాల్పడుతున్న ఛాంగూర్ బాబా కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనను తాను దేవుని భక్తుడిగా చెప్పుకునే జమాలుద్దీన్ షా అలియాస్ ఛాంగూర్ బాబా, అతని సహచరులు 22 బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 60 కోట్లకు పైగా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది. బాబా చీకటి సామ్రాజ్యం రాష్ట్రాలు దాటి విస్తరించిందని ఈడీ గుర్తించింది.
బలరాపూర్ నుంచి మొదలై..
ఛాంగూర్ బాబా వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ బలరాంపూర్ నుంచి ముంబై వరకు సోదాలు జరిపింది. బలరాంపూర్, లక్నో, ముంబైలోని 15 ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించిన విస్తృత దాడుల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నేరపూరితంగా ఆర్జించిన నల్ల ధనాన్ని వివిధ వ్యక్తుల ద్వారా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేయడానికి, నిర్మాణ పనులకు ఉపయోగించినట్లు వెల్లడైంది. ఛాంగూర్ బాబాకు సంబంధించిన ఆస్తులన్నీ అతనికి అత్యంత నమ్మకనమైన సహచరులు నవీన్ రోహ్రా, నీతూ రోహ్రా పేరిట రిజిస్టర్ చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ ఇద్దరినీ బినామీలుగా పెట్టుకోవడం ద్వారా తన అక్రమార్జన వివరాలు బయటకు రాకుండా చూడాలన్నదే ఛాంగూర్ బాబా వ్యూహంగా కనిపిస్తోంది.
దుబాయ్ వరకు విస్తరించిన బ్లాక్ మనీ జాడలు
ఛాంగూర్ బాబాకు సంబంధించిన విదేశీ ఆర్థిక లావాదేవీలు, ఖరీదైన ఆస్తుల కొనుగోలు వివరాలు ఈడీకి లభించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించిన ఆఫ్‌షోర్ కంపెనీలు, అనుమానాస్పద ఆస్తి ఒప్పందాలు, బినామీ లావాదేవీలు, పవర్ ఆఫ్ అటార్నీ వ్యవస్థ, అనుమానాస్పద పెట్టుబడులతో కూడిన సంక్లిష్ట ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ సేకరించింది. అధికారిక రికార్డుల ప్రకారం..13 ప్రధాన డాక్యుమెంట్లు, ఒప్పందాలు ఉన్నాయి.
దర్యాప్తులో దుబాయ్‌లోని రెండు కంపెనీలు.. M/s కృష్ణా ఇంటర్నేషనల్ FZE, M/s యునైటెడ్ మెరైన్ FZE కీలకమైన అంశాలుగా తేలాయి. ఈ కంపెనీల 2012, 2018, 2020 ఆర్థిక సంవత్సరాల లావాదేవీలు, ఆర్థిక వివరాలను ఈడీ లోతుగా పరిశీలించింది. ఇవన్నీ కూడా మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్‌కు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది. అదనంగా దాడుల సమయంలో లభించిన స్లిప్‌లలో దేశంలోని ఎస్బీఐ ఖాతాలు, స్విట్జర్లాండ్ ఆధారిత హబీబ్ బ్యాంక్ ఏజీ జ్యూరిచ్, యూఏఈలోని రాస్ అల్ ఖైమాహ్‌లోని RAK ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ద్వారా జరిగిన లావాదేవీల వివరాలు ఉన్నాయి. ఇవి సరిహద్దులు దాటిన ఆర్థిక అక్రమాలను మరింత బలపరిచాయి. లక్నోలోని ఇంటీగ్రల్ యూనివర్శిటీ నుంచి లభించిన ఒక టెస్ట్ రిపోర్ట్ డాసియర్‌లో కనిపించింది. ఇందులో బలరాంపూర్‌లోని M/s ఆస్వీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ అంచనాలున్నాయి. బ్లాక్ మనీని వైట్‌గా మార్చడం కోసమే ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్టుగా ఈడీ గుర్తించింది.
ముంబై వసైలో కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలు
ముంబైలోని వసైలో అనేక ఆస్తి సంబంధిత లావాదేవీలను ఈడీ స్కాన్ చేసింది. ఇవన్నీ కూడా బినామీల పేర్లతో రిజిస్టర్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీటిలో వసైలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన సేల్ డీడ్ నంబర్ 111/2012, ఘనశ్యామ్ కన్హైయాలాల్ రోహ్రా, ఇతరుల పేరిట నమోదైన సేల్ డీడ్ నంబర్ 389/2014, అలాగే ముంబై కుర్లా-IIలోని SROలో ఛాంగూర్ బాబా పేరిట నమోదైన సేల్ డీడ్ నంబర్ 7212/2016 ఉన్నాయి. ముంబైలోని రన్వాల్ గ్రీన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక డ్రాఫ్ట్ సేల్ డీడ్ కూడా దర్యాప్తు పరిధిలో ఉంది.
షెహజాద్ షేక్ ఖాతాలో 2 కోట్లు:
ముంబైలో ఛాంగూర్ బాబా, నవీన్ రోహ్రా సన్నిహిత సహచరుడైన షెహజాద్ షేక్ కి చెందిన బాంద్రా నివాసం నుంచి ఒక ముఖ్యమైన ఆధారం లభించింది. ఈడీ వర్గాల ప్రకారం షేక్ బ్యాంకు ఖాతాలో రూ. 2 కోట్ల ఆర్థిక లావాదేవీలు కనిపించాయి. ఇవి నవీన్ రోహ్రా అలియాస్ జమాలుద్దీన్ ఖాతా నుంచి బదిలీ చేసినట్టుగా ఉన్నాయి. ఈ డబ్బు రియల్ ఎస్టేట్ కొనుగోలుకు ఉపయోగించారని, కొంత భాగం ఇతర ఖాతాలకు బదిలీ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. షేక్ తన భార్య నజరీన్ షేక్ పేరిట 7 జనవరి 2021న బాంద్రా (ఈస్ట్)లోని కనకియా పారిస్‌లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. మహిమ్‌లో షేక్ పేరిట మరో ఆస్తి ఉంది. ఇది ప్రస్తుతం అతని సోదరి ఆధీనంలో ఉంది. బాంద్రా, మహిమ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. షేక్‌ను మరింత విచారణ కోసం వచ్చే వారం ఈడీ లక్నో జోనల్ కార్యాలయానికి పిలిపించారు.
మతమార్పిడి రాకెట్:
దర్యాప్తు అధికారుల ప్రకారం ఛాంగూర్ బాబా, అతని సహచరులు బలరాంపూర్‌లోని చాంద్ ఔలియా దర్గా నుంచి విస్తృత మతమార్పిడి నెట్‌వర్క్‌ను నడిపారు. ఈ దర్గాకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాదు విదేశాల నుంచి తరచూ ప్రజలు వచ్చి వెళ్తుండేవారు. హిందువుల్లో నిమ్నవర్గాలకు చెందినవారు, ఆర్థికంగా బలహీన వర్గాలైన హిందూ సమాజ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఆధ్యాత్మిక చికిత్స, సామాజిక సంక్షేమం పేరుతో మతమార్పిడికి ప్రేరేపించినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఛాంగూర్ బాబా మతం పేరుతో అమాయకులను మోసం చేసి, విదేశీ నిధులతో ఆస్తుల సేకరణ, మతమార్పిడి కార్యకలాపాలను నడిపిన చీకటి సామ్రాజాన్ని దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆధారాలు సేకరించడంతో పాటు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




