సరదాగా గడపాలని వెళ్లి.. శవాలై తేలి.. నలుగురి ప్రాణాలను బలి తీసుకున్న సముద్రం
ఎక్కడికైనా సరదాగా గడపడానికి వెళ్లినప్పుడు లేదా ఏదైనా ప్రాంతాన్ని ఇష్టంగా చూద్దామని వెళ్లినప్పుడు అనుకోని సంఘటనలు జరిగితే ఆ విషాదాన్ని మాటల్లో చెప్పలేం. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు రాసి పెట్టి ఉంటే తప్పదు అన్నట్లు ఇక్కడ కూడా అదే జరిగింది. చూడడానికి ఎంతో అందంగా కనిపించే సముద్రం నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. సరదాగా గడుపుదామని వచ్చిన ఆ అమాయకులు అలల ఉద్ధృతికి తమ ప్రాణాలను నీటిలోనే విడిచారు. ఆ విషాదకర సంఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.

మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతం రత్నగిరి జిల్లాలో ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. రత్నగిరి పర్యాటక ప్రదేశమైన ఆరే-వేర్ బీచ్‌లో శనివారం సాయంత్రం ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రం వద్ద సరదాగా గడపాలని వచ్చిన నలుగురు పర్యాటకులు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయి నీటిలో మునిగి మరణించారు. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ పర్యాటకులు బీచ్‌లో స్నానం చేస్తుండగా బలమైన అలలలో చిక్కుకుని ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులు ఉజ్మా షేక్ (18), ఉమేరా షేక్ (29), జైనాబ్ ఖాజీ (26), జునైద్ ఖాజీ (30)లు థానే-ముంబ్రా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతి చెందిన ఈ నలుగురు పర్యాటకులు తమ బంధువులను కలవడానికి రత్నగిరికి వచ్చారు. ఈ క్రమంలోనే శనివారం రోజు సరదాగా బీచ్‌లో నడకకు వెళ్లారు. ఆ సమయంలో సముద్రంలో స్నానం చేద్దామని వెళ్లినవారు పెద్ద పెద్ద అలల తాకిడికి భయాందోళనకు గురై బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గమనించిన స్థానికులు, మత్స్యకారులు వెంటనే వారిని రక్షించడానికి సముద్రంలోకి దూకారు. కానీ, అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఆ నలుగురు సముద్రపు నీటిలో మునిగిపోయారని, దాదాపు 30 నిమిషాల తర్వాత వారి మృతదేహాలను వెలికితీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇదంతా ఇలా ఉండగా.. వాతావరణ శాఖ హెచ్చరికలు, మత్స్యకారుల సూచనలు ఉన్నప్పటికీ పర్యాటకులు సముద్రం దగ్గరికి వచ్చి గడుపుతున్నారని, ఫలితంగా ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రత్నగిరి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర యాదవ్ తన టీమ్‌తో ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రత్నగిరి సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆరే-వేర్ బీచ్‌లో ‘నో స్విమ్మింగ్’, ‘డేంజరస్ సీ’ వంటి హెచ్చరిక బోర్డులు ఇదివరకే ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అయినప్పటికీ ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా సముద్ర నీటిలో ఆడడం, స్నానాలు చేయడం చేస్తున్నారు. తద్వారా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలం సమయంలో సముద్రంలోకి వెళ్లరాదని స్థానిక అధికార యంత్రాంగం, కోస్ట్ గార్డ్ పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. తాజా ప్రమాద ఘటన తర్వాత.. ఆరే-వేర్ బీచ్ వంటి ప్రమాదకర ప్రాంతాలలో గార్డులను నియమించాలని, వర్షాకాలంలో పర్యాటకాన్ని పూర్తిగా నిషేధించాలని స్థానికులు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




