AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలే..! బంగ్లా బోర్డర్‌లో కేంద్రం కీలక నిర్ణయం..!

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల రవాణా, విదేశీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో 40 కొత్త సబ్‌సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలే..! బంగ్లా బోర్డర్‌లో కేంద్రం కీలక నిర్ణయం..!
Bangladesh Border Security
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 10:46 AM

Share

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల రవాణా, విదేశీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో 40 కొత్త సబ్‌సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ యూనిట్ల ఏర్పాటుతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ మరింత బలపడటంతో పాటు, అక్రమ చొరబాట్లను ముందుగానే గుర్తించి అడ్డుకునే సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు అమలు కోసం సుమారు 50 ఎకరాల భూమిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. ప్రతి ఎస్‌ఐబీ యూనిట్ ఏర్పాటుకు సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం భూమి అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అవసరమైతే భూమిని కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ యాజమాన్యంలోని స్థలాలను కేటాయించే అవకాశాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారుల మధ్య కీలక సమావేశం కూడా జరిగినట్లు సమాచారం.

ప్రస్తుతం కోల్‌కతా మినహా పశ్చిమ బెంగాల్‌లోని చాలా ఎస్‌ఐబీ యూనిట్లు అద్దె భవనాల్లోనే పనిచేస్తున్నాయి. దీంతో నిఘా కార్యకలాపాల నిర్వహణలో పలు పరిమితులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా నిర్మించనున్న శాశ్వత కార్యాలయాలు, నివాస సముదాయాలు, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలతో కూడిన క్యాంపస్‌లు ఏర్పాటైతే ఇంటెలిజెన్స్ సేకరణ, విశ్లేషణ, గోప్య సమాచార భద్రత మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న పెన్సింగ్

భారత్ – బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు మొత్తం సుమారు 2,217 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, ఇందులో అత్యధిక భాగం పశ్చిమ బెంగాల్ గుండా వెళ్తుంది. ఈ ప్రాంతం ద్వారా అక్రమ వలసలు, పశువుల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ చలామణి వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయడం జాతీయ భద్రత దృష్ట్యా అత్యంత కీలకమని కేంద్రం భావిస్తోంది.

ఇప్పటికే సరిహద్దు వెంట ఫెన్సింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కు అవసరమైన భూమిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బదలాయిస్తూ ఫెన్సింగ్, కొత్త అవుట్‌పోస్టుల నిర్మాణానికి సహకరిస్తోంది. భౌతిక భద్రతతో పాటు ఆధునిక నిఘా వ్యవస్థలను కూడా విస్తరించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ ఎస్‌ఐబీ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది.

సరిహద్దు భద్రతలో కీలక పాత్ర పోషించే ఎస్‌ఐబీ

సబ్‌సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో పనిచేసే ప్రాంతీయ నిఘా విభాగం. దేశ అంతర్గత భద్రత, సరిహద్దు ప్రాంతాల నిఘాలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. క్షేత్రస్థాయిలో మానవ వనరులు, సాంకేతిక సాధనాల ద్వారా సమాచారాన్ని సేకరించి, అనుమానాస్పద కదలికలు, అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తు హెచ్చరికలు అందిస్తాయి.

ఎస్‌ఐబీ యూనిట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తాయి. విదేశీ గూఢచర్య సంస్థల కదలికలు, స్లీపర్ సెల్స్, తీవ్రవాద సంస్థల నెట్‌వర్క్‌లు, రాడికల్ గ్రూపుల కార్యకలాపాలను పర్యవేక్షించి అవసరమైన సమాచారాన్ని భద్రతా సంస్థలకు చేరవేస్తాయి. అలాగే కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసు, బీఎస్‌ఎఫ్ తదితర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఇంటెలిజెన్స్ విశ్లేషణ, భద్రతా చర్యల్లో కీలక పాత్ర పోషిస్తాయి.

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ చొరబాట్లు, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, భద్రతాపరమైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిఘా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ 40 కొత్త ఎస్‌ఐబీ యూనిట్ల ఏర్పాటు పూర్తయితే సరిహద్దు జిల్లాల్లో రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్ సేకరణ మరింత సమర్థవంతంగా మారడంతో పాటు, దేశ భద్రతను బలోపేతం చేసే కీలక అడుగుగా ఇది నిలవనుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us