మూల్యం చెల్లిస్తున్నాం.. ఇంధన ధరలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. దీంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కేంద్రం గత కొద్ది నెలల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచింది. ఈ ఇంధన సంక్షోభంపై కేంద్రమంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. బ్యారెల్‌కు 100 డాలర్లను మించి ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. ఇప్పటికే ప్రైవేట్ ఇంధన సరఫరా సంస్థ నయరా ఎనర్జీ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. దీంతో రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కూడా ఇంధన ధరలను పెంచుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు ధరలు 100 డాలర్లను దాటినప్పుడు పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఇరాన్-అమెరికా మధ్య సంఘర్షణల ప్రభావం వల్లే ఇంధన సంక్షోభం నెలకొందని అన్నారు.
“క్రూడ్ ఆయిల్ ధరలు అస్థిరతతో కొనసాగుతున్నాయి. చమురు ధరలలో భారీ పెరుగుదల మార్కెట్ అనిశ్చితికి ప్రతిబింబంగా చెప్పవచ్చు. కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చాలా దూరంలో ఉంది. బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే ఎక్కువ ముడి చమురు ధరలు సూచిస్తున్నాయి. ధరలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణ ప్రభావాన్ని కేవలం ఆర్థిక కోణంలోనే చూడకూడదు. ఇంధన సరఫరాకు అంతరాయం వల్ల సామాన్య కుటుంబాలు, ఉపాధి, జీవనోపాధిపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. మనకు ఏమాత్రం సంబంధం లేని సంఘర్షణల వల్ల మూల్యం చెల్లిస్తున్నాం. ఇంధనం, వాణిజ్య రాకపోకలను పునరుద్ధరించాలని భారతదేశం కోరుతుంది” అని జైశంకర్ పేర్కొన్నారు.
ఈ పరిస్థితి నుండి వెలువడే ఎలాంటి ఫలితమైనా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉంటుందని జైశంకర్ నొక్కి చెప్పారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యంపై ఇరాన్ సంఘర్షణ విస్తృత ప్రభావంపై ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాగా ఇంధన ధరలపై పెరుగుదలపై వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రోల్, డీజిల్ పెరుగుదల రవాణ రంగంపై పడుతోంది. రవాణ ఖర్చులు పెరగడం వల్ల నిత్యావస సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇది సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
