ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే ఆఫర్.. ఖరీదైన ల్యాప్‌టాప్‌లు ఉచితంగా సొంతం చేసుకోవచ్చు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! ఇకపై ప్రభుత్వ కార్యాలయాల నుంచి అధికారిక విధుల కోసం అందించే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను నాలుగేళ్ల వినియోగం తర్వాత ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండానే తమ వద్ద ఉంచుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! ఇకపై ప్రభుత్వ కార్యాలయాల నుంచి అధికారిక విధుల కోసం అందించే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను నాలుగేళ్ల వినియోగం తర్వాత ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండానే తమ వద్ద ఉంచుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, ప్రభుత్వ అధికారులు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు ధర పరిమితిని కూడా పెంచింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 10, 2026న కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం (Department of Expenditure) జారీ చేసిన సవరించిన మార్గదర్శకాల్లో పేర్కొంది.
రూ.1.8 లక్షల వరకు ఖరీదైన ల్యాప్‌టాప్‌లు!
కొత్త మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ విభాగాలు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, నోట్‌ప్యాడ్‌లు, అల్ట్రాబుక్‌లు, నోట్‌బుక్‌లు వంటి పరికరాలను కొనుగోలు చేయవచ్చు. సాధారణ పరికరాల కొనుగోలుకు రూ.1.50 లక్షలు, అదనంగా పన్నులు వరకు పరిమితి విధించారు. అయితే, 40 శాతానికి పైగా మేక్ ఇన్ ఇండియా (MII) భాగాలు కలిగిన పరికరాలకు ఈ పరిమితిని రూ.1.80 లక్షలకు పెంచారు. ఈ ధరలో ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్, ఎంఎస్ ఆఫీస్ వంటి ప్రామాణిక సాఫ్ట్‌వేర్ ఖర్చులు కూడా ఉంటాయి.
ఏ ఉద్యోగులకు ఈ అవకాశం?
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఈ సదుపాయం వర్తించదు. ఏడో వేతన సంఘం ప్రకారం పే లెవల్ 12, అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న అధికారులందరికీ వారి విభాగంలోని మంజూరైన పోస్టుల సంఖ్య మేరకు పరికరాలు అందించవచ్చు. పే లెవల్ 8 నుంచి 11 వరకు ఉన్న అధికారుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రాథమికంగా అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి, ఆర్థిక సలహాదారుతో సంప్రదించి సంబంధిత శాఖ కార్యదర్శి ఈ పరిమితిని 75 శాతానికి పెంచవచ్చు.
నాలుగేళ్ల తర్వాత ల్యాప్‌టాప్ మీదే!
కొత్త నిబంధనల్లో అత్యంత ముఖ్యమైన అంశం పరికరాల యాజమాన్యానికి సంబంధించినది. పరికరం కొనుగోలు చేసిన తేదీ నుంచి నాలుగేళ్ల వరకు అది ప్రభుత్వ ఆస్తిగా ఉంటుంది. నాలుగేళ్లు పూర్తయిన తర్వాత ఉద్యోగి దానిని తన వద్దే ఉంచుకోవచ్చు. అయితే, అప్పగించే ముందు అందులోని ప్రభుత్వ సమాచారాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. నాలుగేళ్లలోపే పదవీ విరమణ చేసినా, ఉద్యోగాన్ని విడిచిపెట్టినా పరికరాన్ని ఉంచుకోవాలంటే అప్పటి పుస్తక విలువను చెల్లించాలి. ఇందుకోసం ఏటా 25 శాతం చొప్పున తరుగుదల (Depreciation) లెక్కిస్తారు.
అలాగే, నాలుగేళ్లలోపు మరో కొత్త పరికరం పొందాలంటే పాతది మరమ్మతులకు ఆర్థికంగా అనుకూలంగా లేనట్లు ధ్రువీకరణ అవసరం. ఈ కొత్త మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, కన్సల్టెంట్లు వీటి పరిధిలోకి రావు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
