IRCTC: కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే!
IRCTC Holy Uttar Pradesh Tour: కాశీ విశ్వనాథుడు, అయోధ్య రాముడి దర్శనంతో పాటు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమాన్ని సందర్శించాలనుకుంటున్నారా? అయితే IRCTC అందిస్తున్న Holy Uttar Pradesh టూర్ ప్యాకేజీ మంచి అవకాశం. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ 6 రోజుల యాత్రలో ప్రయాణ సౌకర్యాలు, హోటల్ వసతి, ప్యాకేజీ ధరలు, పూర్తి షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి.

IRCTC Holy Uttar Pradesh Tour: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. Holy Uttar Pradesh (SHR050) పేరుతో అందుబాటులో ఉన్న ఈ ప్యాకేజీలో కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ టూర్‌లో రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణా వంటి సౌకర్యాలు కల్పిస్తారు.
టూర్ ప్యాకేజీ వివరాలు
ఈ ప్యాకేజీని 3AC కేటగిరీలో అందిస్తున్నారు. ప్రతి ఆదివారం, శుక్రవారం యాత్ర ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9:25 గంటలకు 12791 దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం మొదలవుతుంది. మొత్తం 3ACలో 6 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
- ప్యాకేజీ పేరు: Holy Uttar Pradesh
- ప్యాకేజీ కోడ్: SHR050
- ప్రయాణ వ్యవధి: 5 రాత్రులు, 6 రోజులు
- సందర్శించే ప్రాంతాలు: వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్
- ప్రయాణ ప్రారంభం: సికింద్రాబాద్
- రైలు ప్రయాణం: 3AC
- యాత్ర ప్రారంభ సమయం: ఉదయం 9:25 గంటలు
- ప్రయాణ రోజులు: ప్రతి ఆదివారం, శుక్రవారం
ఆరు రోజుల యాత్ర షెడ్యూల్ ఇదే!
- మొదటి రోజు: యాత్రికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఉదయం 9:25 గంటలకు 12791 దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వారణాసికి బయలుదేరాలి. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు: మధ్యాహ్నం 1:25 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్లి గదులు కేటాయిస్తారు. అనంతరం కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటారు. సాయంత్రం పవిత్ర గంగా హారతిని వీక్షిస్తారు. రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
- మూడో రోజు: హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత వారణాసిలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. కాశీ విశ్వనాథ మందిరం, కాలభైరవ మందిరం, బిర్లా మందిరం దర్శించుకుంటారు. అనంతరం షాపింగ్, వ్యక్తిగత కార్యక్రమాలకు కొంత సమయం కేటాయిస్తారు. రాత్రి వారణాసిలోనే బస చేస్తారు.
- నాలుగో రోజు: ఉదయం అల్పాహారం తర్వాత హోటల్ నుంచి బయలుదేరి సుమారు 220 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్‌ఇన్ అయిన తర్వాత అయోధ్య రామ మందిరం, హనుమాన్ గఢీ, దశరథ మహల్ సందర్శిస్తారు. సాయంత్రం సరయూ నది ఘాట్‌ను సందర్శిస్తారు. రాత్రి అయోధ్యలో బస ఉంటుంది.
- ఐదో రోజు: ఉదయం అల్పాహారం తర్వాత అయోధ్య నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలోని ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరుతారు. అక్కడ త్రివేణి సంగమం, అలోపీ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో 12792 సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కుతారు. రాత్రి రైలు ప్రయాణం ఉంటుంది.
- ఆరో రోజు: రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఎంతంటే?
ఈ టూర్‌లో వ్యక్తుల సంఖ్య, గది షేరింగ్ విధానాన్ని బట్టి ధరలు మారుతాయి.
1 నుంచి 3 మంది ప్రయాణిస్తే:
- ఇద్దరు షేరింగ్ (Twin Sharing): రూ.22,860
- ముగ్గురు షేరింగ్ (Triple Sharing): రూ.18,170
- పిల్లలు (బెడ్‌తో): రూ.15,260
- పిల్లలు (బెడ్ లేకుండా): రూ.13,640
4 నుంచి 6 మంది ప్రయాణిస్తే:
- ఇద్దరు షేరింగ్ (Twin Sharing): రూ.19,650
- ముగ్గురు షేరింగ్ (Triple Sharing): రూ.16,930
- పిల్లలు (బెడ్‌తో): రూ.15,260
- పిల్లలు (బెడ్ లేకుండా): రూ.13,640
గమనిక: ఈ ధరలు ఒక్కొక్కరికి వర్తిస్తాయి.
ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
3AC రైలు ప్రయాణం, ఏసీ హోటల్ గదుల్లో వసతి, షెడ్యూల్ ప్రకారం ఏసీ వాహనంలో స్థానిక రవాణా, మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, మూడు డిన్నర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, పర్యాటక ప్రాంతాల సందర్శన, వర్తించే పన్నులు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. అయితే రైలు ప్రయాణంలో ఆహారం, మధ్యాహ్న భోజనం, అదనపు ఆహారం, దర్శనం టికెట్లు, ప్రవేశ రుసుములు, టూర్ గైడ్ సేవలు, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో ఉండవు.
హోటల్ వసతి వివరాలు
వారణాసిలో హోటల్ జియాన్ ఇన్, దరోహర్, ఫోర్ లీఫ్ లేదా ఇలాంటి హోటళ్లలో వసతి కల్పిస్తారు. అయోధ్యలో తరాజీ రిసార్ట్, షాన్-ఎ-అవధ్ లేదా సమానమైన హోటళ్లలో బస ఏర్పాటు చేస్తారు. హోటళ్లలో చెక్‌ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటలు. ముందుగా గది కావాలంటే అందుబాటును బట్టి కేటాయిస్తారు.
(Disclaimer: ప్రయాణానికి నాలుగు రోజుల ముందు ఆన్‌లైన్ రైలు టికెట్లు జారీ చేస్తారు. బెర్త్ ప్రాధాన్యతలు లేదా టికెట్ జారీ తర్వాత మార్పులు సాధ్యం కావు. కాబట్టి కాశీ విశ్వనాథుడు, అయోధ్య రాముడి దర్శనంతో పాటు త్రివేణి సంగమాన్ని సందర్శించాలనుకునే వారు ఈ ప్యాకేజీ వివరాలను పరిశీలించవచ్చు.)
హోలీ ఉత్తరప్రదేశ్ టూర్ పూర్తి వివరాలు, టికెట్ బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
