డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ తరపున పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, జేడీఎస్ నుంచి ఎంపీ దౌవెగౌడ హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్గాని భరత్, తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మంగళవారం సాయంత్రం బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగే బిజినెస్ అడ్వైజరీ మీటింగ్ లో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో చర్చించాల్సిన అంశాలు, కీలక బిల్లులకు సమయం కేటాయింపు వంటి కీలక అంశాలపై బిజినెస్ అడ్వైజరీ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల సెషన్‌లో 17 రోజులు సభ సమావేశం కానుంది. శీతాకాల సమావేశాలు పార్లమెంటు పాత భవనంలో జరగనున్నాయి. ఇది 17వ లోక్‌సభకు 10వ సెషన్ కాగా, ఎగువ సభ అంటే రాజ్యసభకు ఇది 258వ సెషన్.
ఈ సమావేశాల్లో అత్యధికంగా శాసన సభ పనులు జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీంతో పాటు ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై అర్థవంతమైన చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా మాట్లాడుతూ, సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాల సహకారం కోరుకుంటున్నదని, ఈ సమావేశాల నిర్వహణలో ప్రతిపక్షాలు కూడా సానుకూల పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..