AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో డీప్‌స్పేషియల్ కీలక ఒప్పందాలు

ఏఐ, జియోస్పేషియల్ టెక్నాలజీ రంగాల్లో సరికొత్త విప్లవానికి తెరలేచింది. అత్యాధునిక సాంకేతికతను విద్యార్థులు, యువ పరిశోధకులకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రముఖ కెనడియన్ సంస్థ డీప్‌స్పేషియల్.. ప్రతిష్టాత్మక ఐఐటీ తిరుపతితో పాటు ప్రముఖ డిజిటల్ మీడియా వన్ ఇండియా నిర్వాహణ సంస్థ గ్రేనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్‌తో కీలక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో డీప్‌స్పేషియల్ కీలక ఒప్పందాలు
Deepspatial Partners With Iit Tirupati And Oneindia
Krishna S
|

Updated on: Oct 18, 2026 | 6:16 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోస్పేషియల్ టెక్నాలజీ రంగాల్లో భారత్-కెనడా భాగస్వామ్యం సరికొత్త మైలురాయిని చేరింది. ప్రముఖ కెనడియన్ జియో-ఏఐ సంస్థ డీప్‌స్పేషియల్.. భారత్‌లో రెండు కీలక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఐఐటీ తిరుపతి ఇన్నోవేషన్ హబ్ ఐఐటీటీఎన్ఐఎఫ్, ప్రముఖ డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్ నిర్వహణ సంస్థ గ్రేనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్‌తో ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధు నేతృత్వంలో దాదాపు 300 మంది ప్రతినిధులతో భారత్ వచ్చిన టీమ్ కెనడా వాణిజ్య పర్యటనలో భాగంగా, బెంగళూరు వేదికగా ఈ ఒప్పందాలు జరిగాయి.

ఐఐటీ తిరుపతితో జియో-ఏఐ పరిశోధనలు..

ఐఐటీ తిరుపతికి చెందిన నవావిష్కార్ ఐ-హబ్ ఫౌండేషన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, పొజిషనింగ్ సిస్టమ్స్, స్పేషియల్ ఏఐ రంగాల్లో ఉమ్మడి పరిశోధనలు జరగనున్నాయి. అలాగే స్టార్టప్ సంస్థల ఇంక్యుబేషన్, నూతన ఆవిష్కరణల వాణిజ్యీకరణపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా స్పిన్ ల్యాబ్స్ నెట్‌వర్క్ ద్వారా ఎక్స్‌ప్లోర్ పేరుతో అంతర్జాతీయ జియో-ఏఐ మెంటార్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు, యువ పరిశోధకులకు లొకేషన్-ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏఐ రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభించనుంది. ఈ ఒప్పందంపై ఐఐటీటీఎన్ఐఎఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రోషన్ కె. శ్రీవాస్తవ్, డీప్‌స్పేషియల్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ రాహుల్ కుష్వా సంతకాలు చేశారు.

క్లాస్‌రూమ్‌లకు విశ్వసనీయ జర్నలిజం

మరో ఒప్పందంలో భాగంగా.. డిజిటల్ మీడియా దిగ్గజం వన్ ఇండియా డీప్‌స్పేషియల్‌కు చెందిన విద్యార్థుల లెర్నింగ్ వేదిక ఎడ్‌స్క్ ఎక్స్‌ప్రెస్‌తో చేతులు కలిపింది. విద్యార్థుల్లో కరెంట్ అఫైర్స్ పట్ల ఆసక్తిని పెంచడం, మీడియా అక్షరాస్యతను అలవర్చడం, లోతైన ఆలోచనా ధోరణిని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విశ్వసనీయ వార్తలు అందించడంతో పాటు, వార్తలను అర్థం చేసుకుని విశ్లేషించే సామర్థ్యాన్ని ఈ వేదిక కల్పిస్తుంది. ఈ ఒప్పందంపై వన్ ఇండియా సీఈవో రవణన్ ఎన్, డాక్టర్ రాహుల్ కుష్వా సంతకాలు చేశారు. ‘‘పాజిటివ్ న్యూస్ అంటే కేవలం సాధారణ వార్త కాదు.. సమాజంలో మార్పు ఎలా సాధ్యమో చూపించే సాధనం. విశ్వసనీయ వార్తా సమాచారం న్యూస్‌రూమ్‌లకే పరిమితం కాకుండా క్లాస్‌రూమ్‌లకు చేరాలి’’ అని రవణన్ పేర్కొన్నారు.

భారత్-కెనడా మధ్య రూ.1,800 కోట్ల వాణిజ్య ఒప్పందాలు

గత 30 ఏళ్లలో భారత్‌లో పర్యటించిన అతిపెద్ద టీమ్ కెనడా వాణిజ్య బృందం ఇదేనని గ్లోబల్ అఫైర్స్ కెనడా వెల్లడించింది. ఈ పర్యటనలో ముంబై, బెంగళూరు నగరాల్లో కలిపి భారత, కెనడా సంస్థల మధ్య దాదాపు 300 మిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు రూ.1,800 కోట్లు) విలువైన 34 వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఏరోస్పేస్, క్లీన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య, మౌలిక వసతులు తదితర రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇందులో టాటా ప్రాజెక్ట్స్, జీఎంఆర్ ఏరో టెక్నిక్, అదానీ పోర్ట్స్, కేపీఎండీ, అపోలో హెల్త్ రిసోర్సెస్‌తో పాటు ఐఐటీ తిరుపతి, ఐఐటీ రూర్కీ వంటి ఉన్నత విద్యా సంస్థలు భాగస్వామ్యం పంచుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థతో తమ దీర్ఘకాలిక భాగస్వామ్యం మరింత పటిష్టం కావడానికి ఈ ఒప్పందాలు నిదర్శనమని కెనడా మంత్రి మణీందర్ సిద్ధు స్పష్టం చేశారు.

Follow Us