నిరుద్యోగులకు అలర్ట్.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే!
కేంద్ర ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖలో స్పోర్ట్స్ కోటా ద్వారా 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, MTS పోస్టులకు అర్హులైన క్రీడాకారులు అక్టోబరు 17 నుంచి నవంబరు 10, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలతో పాటు నిర్దేశిత క్రీడా ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో అర్హతలు, నిబంధనలను పరిశీలించాలి..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు భారీ శుభవార్త అందించింది. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, విద్యార్హతలు, గుర్తింపు పొందిన క్రీడా విజయాలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 119 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
- ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 44
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టుల సంఖ్య: 9
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల సంఖ్య: 66
ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. నియామక ప్రక్రియలో భాగంగా నిర్దేశించిన స్టెనోగ్రఫీ నైపుణ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి.. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు18 నుంచి 27 ఏళ్లు, MTS పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు వరకు వయసు ఉండాలి. వయోపరిమితికి సంబంధించిన ఇతర సడలింపులు వర్తిస్తాయా లేదా అనే వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 10, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు విద్యార్హతలు, వయోపరిమితి, క్రీడా అర్హతలు, ధ్రువపత్రాలకు సంబంధించిన నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో పూర్తిగా చదవాలి. అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని, చివరి తేదీలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వారి క్రీడా విజయాలు, ప్రదర్శన, విద్యార్హతలు, వయోపరిమితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్థులు సమర్పించే క్రీడా ధ్రువపత్రాలు నోటిఫికేషన్లో గుర్తించిన అధికారుల ద్వారా జారీ అయి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైనవారు నియామకం తర్వాత నిర్దేశించిన నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
ఇన్కం ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




