Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: ఇక తగ్గేదే లే.. దూసుకుపోతున్న భారత్.. విద్యారంగంలో AI చమకులు..!

కేంద్రం చేసిన ఈ ప్రకటనపై టెక్ ఎక్స్‌పర్ట్‌లు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ సెంటర్‌ల ద్వారా ఆవిష్కరణలు పెరగడంతో పాటు క్రిటికల్ థింకింగ్‌, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలు విద్యార్థి దశలోనే అలవాటవుతాయని చెబుతున్నారు. విద్యావ్యవస్థను ఆధునీకరించడంలో ఇది తొలి అడుగు అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

Budget 2025: ఇక తగ్గేదే లే.. దూసుకుపోతున్న భారత్.. విద్యారంగంలో AI చమకులు..!
Artificial Intelligence
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 01, 2025 | 10:28 PM

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇంతగా సెన్సేషన్‌ క్రియేట్ చేస్తుంటే.. ఇంకా భారత్ వెనకబడి ఉందేంటి..? నిన్న మొన్నటి వరకూ ఈ ప్రశ్నే వినిపించింది. ముఖ్యంగా ఎప్పుడైతే చైనా డీప్‌సీక్‌ AI మోడల్ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ డిస్కషన్ ఇంకాస్త ఎక్కువైంది. ఇప్పటికే అమెరికా నుంచి ఛాట్‌జీపీటీ వచ్చి.. మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. దానికి పోటీగా డీప్‌సీక్‌ని తీసుకొచ్చింది చైనా. మరి భారత్ పరిస్థితేంటి అన్న చర్చ జరుగుతుండగానే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ప్రకటన చేశారు. భారత్ కూడా సొంతగా AI మోడల్‌ని తయారు చేసుకుంటుందని వెల్లడించారు. బహుశా మరో 8-10 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముందనీ చెప్పారు. కాకపోతే..ఎవరు డెవలప్ చేస్తున్నారు..? ఇందుకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారు..? తదితర వివరాలేమీ చెప్పలేదు. కానీ బడ్జెట్‌లో మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రస్తావించారు. అంతే కాదు. AI విషయంలో భారత్ ఎంత ఫోకస్డ్‌గా ఉందో కేటాయింపులతోనే క్లియర్‌గా చెప్పారు.

విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని ఎక్కువగా వినియోగించేలా చర్యలు చేపట్టనుంది కేంద్రం. ఆ మేరకు నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. AIకి సంబంధించి సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఇందు కోసం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అగ్రికల్చర్, హెల్త్ సెక్టార్‌ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కి సంబంధించిన ఎక్స్‌లెన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని 2023లో ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఇప్పుడు ఇదే AI కి సంబంధించి ఈసారి పూర్తిగా విద్యారంగంపైనే ఫోకస్ పెట్టారు. దీనికి పార్లల్‌గా దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకూ ప్లాన్ చేసింది కేంద్రం. AI మోడల్ తయారు చేసుకోవాలన్నా.. ఈ సెక్టార్‌పై ఎక్కువగా ఫోకస్ చేయాలన్నా.. సెమీకండక్టర్లు భారీగా అందుబాటులో ఉండాలి. కానీ.. ప్రస్తుతానికి భారత్ సెమీ కండక్టర్‌ల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే…ఈ మధ్య కాలంలో వీటిని దేశీయంగా తయారు చేసేందుకూ అడుగులు పడుతున్నాయి. అందుకే.. ఇండస్ట్రీ 4.0 పేరుతో నిపుణులైన వారికి ప్రోత్సాహకాలు అందిస్తూనే…పరిశ్రమలకు ఊతం ఇచ్చే విధంగా…తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు నిర్మలా సీతారామన్.

మేక్ ఫర్ భారత్‌ ప్రధానంగా దృష్టి పెట్టింది ఈ బడ్జెట్. డిజైనింగ్ నుంచి ట్రైనింగ్, స్కిల్ సర్టిఫికేషన్ వరకూ యువత తమ స్కిల్‌ని అప్‌గ్రేడ్ చేసుకునేలా అవకాశం కల్పించనుంది కేంద్రం. ఈ చర్యలన్నీ పరోక్షంగా AI కి భారీగా ఊతం అందించనున్నాయి. పైగా ఈ సెక్టార్‌లో ఉద్యోగాలనూ సృష్టించనున్నాయి. అయితే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో భారత్‌లో ఇంకా స్కిల్స్‌ తక్కువగానే ఉన్నాయని, వాటిని పెంచుకోవాల్సిన అవసరముందని ఎకనామిక్ సర్వే వెల్లడించింది. విద్యా సంస్థల నుంచే మార్పు మొదలైతే.. AI రంగంలో భారత్ పోటీ పడేందుకు అవకాశముంటుందని సూచించింది. ఈ సూచనను దృష్టిలో పెట్టుకుని కేంద్రం.. AI కోసం ప్రత్యేకంగా ఎక్స్‌లెన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

కేంద్రం చేసిన ఈ ప్రకటనపై టెక్ ఎక్స్‌పర్ట్‌లు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ సెంటర్‌ల ద్వారా ఆవిష్కరణలు పెరగడంతో పాటు క్రిటికల్ థింకింగ్‌, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలు విద్యార్థి దశలోనే అలవాటవుతాయని చెబుతున్నారు. విద్యావ్యవస్థను ఆధునీకరించడంలో ఇది తొలి అడుగు అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతీ యువకులు నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు పెరిగి.. అది పరోక్షంగా ఎంప్లాయ్‌మెంట్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇదంతా ఆలోచించే.. కేంద్రం ముందు చూపుతో బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత కల్పించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..