Rahul Gandhi: బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచారు.. కేంద్రంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

|

Jul 29, 2024 | 9:30 PM

కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ,అంబానీ కోసమే బడ్జెట్‌ను పెట్టారన్నారు. చిన్న,మధ్యతరగతి పరిశ్రమలకు అన్యాయం చేశారన్నారు రాహుల్‌. విపక్ష నేతగా రాహుల్‌కు సభ నియమాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని కౌంటరిచ్చారు కేంద్రమంత్రి కిరణ్‌రిజుజు..

Rahul Gandhi: బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచారు.. కేంద్రంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
Rahul Gandhi
Follow us on

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌గాంధీ. క్యాపిట్‌ గెయిన్‌ ట్యాక్స్‌ పెంచి, ఇండెక్షన్‌ తీసేసి మధ్యతరగతి ప్రజలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచారని మండిపడ్డారు. బడ్జెట్‌తో అదానీ,అంబానీలకు మాత్రమే మేలు చేశారన్నారు . నిన్నమొన్నటి దాకా బీజేపీ వైపు ఉన్న మధ్యతరగతి ప్రజలు బడ్జెట్‌ తరువాత ఇండియా కూటమికి మద్దతిస్తున్నారని అన్నారు.

నోట్లరద్దు , జీఎస్జీతో చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు తీరని నష్టం జరిగిందన్నారు రాహుల్‌గాంధీ. ట్యాక్స్‌ టెర్రరిజంతో ఆ కంపెనీ యాజమానులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరగడానికి ఇదే కారణమన్నారు రాహుల్‌గాంధీ.

‘‘చక్రవ్యూహంలో భాగంగా కోట్లాది ఉద్యోగాలు ఇచ్చే చిన్న,మధ్యతరహా పరిశ్రమలను టార్గెట్‌ చేశారు. నోట్లరద్దు , జీఎస్టీ , ట్యాక్స్‌ టెర్రరిజంతో బెదిరించారు. చిన్న వ్యాపారులకు అర్ధరాత్రి ఫోన్‌కాల్స్‌ వస్తాయి.. ఐటీ , జీఎస్టీ అధికారులతో వాళ్లను బెదిరించి ట్యాక్స్‌ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. ట్యాక్స్‌ టెర్రరిజానికి ఆపడానికి బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ట్యాక్స్‌ టెర్రరిజంతో బడా వ్యాపారులకు లాభం చేశారు. చిన్నవ్యాపారులను బెదరించారు’’.. -రాహుల్ గాంధీ

రాహుల్‌ వ్యాఖ్యలకు బీజేపీ సభ్యులు నిరసన తెలిపారు. రాహుల్‌ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు.

‘‘మీరు స్పీకర్‌ను అవమానిస్తున్నారు. సభను పక్కదోవ పట్టిస్తున్నారు. మీకు రూల్స్‌ తెలియదు. మీరు సభ నియమాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విపక్ష నేతకు నియమాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ’’ -కిరణ్‌ రిజుజు

బడ్జెట్‌ హల్వా కార్యక్రమంలో ఒక్క దళిత , ఓబీసీ అధికారికి కూడా పాల్గొనడానికి అవకాశం ఇవ్వలేదని రాహుల్‌ విమర్శించారు . హల్వా సెర్మనీ ఫోటోను రాహుల్‌ సభలో ప్రదర్శించారు. కేంద్రం వెంటనే కులగణన చేపట్టాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై మరోసారి బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..