Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!
కీలకమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. ఈసారి బడ్జెట్‌లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ పేరిట వరుసగా ఏడు బడ్జెట్‌లు సమర్పించిన రికార్డు నమోదు కానుంది. ఇప్పటి వరకు ఈ రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలోని వేర్వేరు వాటాదారులతో చాలా సార్లు చర్చలు జరిపింది. విద్య, ఆరోగ్య రంగం, క్యాపిటల్ మార్కెట్, ఉపాధి, నైపుణ్యాలతో పాటు MSME రంగాలకు చెందిన అధికారులు, ప్రతినిధులతో చర్చలు జరిపారు. పలువురు ఆర్థికవేత్తలతోనూ ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. రానున్న బడ్జెట్‌లో ద్రవ్యలోటు తగ్గింపుపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు కేంద్రానికి సూచించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని రైతు సంఘాలు ఆర్థిక మంత్రిని కోరాయి.
బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో.. రాష్ట్రానికి గతానికంటే ఎక్కువ లబ్ది చేకూరేలా నిర్ణయాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
మొబైల్ యాప్‌లో అందుబాటులో బడ్జెట్ పత్రాలు
గతంలో లాగానే బడ్జెట్ 2024 కూడా పేపర్‌లెస్ ఫార్మాట్‌లో ఉండనుంది. బడ్జెట్ పత్రాలు హిందీ, ఇంగ్లీష్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన అన్ని పత్రాలు ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో అందుబాటులో ఉంటాయి. దీంతో పార్లమెంట్ సభ్యులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బడ్జెట్ పత్రాలు అందుతాయి. అలాగే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బడ్జెట్‌ను సమర్పించిన కొద్దిసేపటికే అన్ని పత్రాలు ఈ యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..