AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్‌ నుంచి స్వదేశానికి చేరిన సీతారామలక్ష్మణ కాంస్య విగ్రహాలు

పోగొట్టుకున్న తన రామచంద్రుని పూజా విగ్రహాలు కావేరి నదిలో దొరికినప్పుడు త్యాగరాజు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు భారతీయులు కూడా అంతగా సంబరపడుతున్నారు.

లండన్‌ నుంచి స్వదేశానికి చేరిన సీతారామలక్ష్మణ కాంస్య విగ్రహాలు
Balu
|

Updated on: Nov 19, 2020 | 12:17 PM

Share

పోగొట్టుకున్న తన రామచంద్రుని పూజా విగ్రహాలు కావేరి నదిలో దొరికినప్పుడు త్యాగరాజు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు భారతీయులు కూడా అంతగా సంబరపడుతున్నారు. 40 ఏళ్ల కిందట దొంగలెత్తుకెళ్లి బ్రిటన్‌కు చేరిన రామ,లక్ష్మణ, సీత కాంస్య విగ్రహాలు మళ్లీ స్వదేశానికి వచ్చాయి.. ఇంతకంటే మహదానందం మరేముంటుంది? ఈ విగ్రహాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ నిన్న తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.. ఢిల్లీలోని భారత పురావస్తు శాఖ ప్రధాన కార్యక్రమంలో ఈ అప్పగింతలు జరిగాయి. 13వ శతాబ్దంనాటి ఈ విగ్రహాలు తమిళనాడులోని నాగపట్టణం జిల్లా ఆనందమంగళంలో విజయనగర రాజుల కాలంలో రూపుదిద్దుకున్నాయి.. శ్రీరాజగోపాల్‌ విష్ణు ఆలయంలో ఈ విగ్రహాలను ప్రతిష్టించారు.. ఆ గుడి నుంచే దొంగలు 1978లో వీటిని ఎత్తుకెళ్లారు.

ఆ విగ్రహాలు కచ్చితంగా బ్రిటన్‌కు తరలించి ఉంటారని ఇండియా ప్రైడ్‌ ప్రాజెక్టు అధికారులు గట్టిగా నమ్మి లండన్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయానికి గత ఏడాది ఆగస్టులో తెలిపారు.. వారు కూడా అన్వేషణ మొదలుపెట్టారు.. అదృష్టమేమిటంటే 1958లో తీసిన ఆ విగ్రహాల ఫోటోలు భద్రంగా ఉండటం.. ఆ ఫోటోలు ఉండటం వల్లే విగ్రహాలను కనిపెట్టగలిగారు. తమిళనాడు పోలీసు శాఖలోని విగ్రహాల విభాగం పాత రికార్డులను తిరగేసి ఆ కాంస్య విగ్రహాలు 1978 నవంబరు 23-24 తేదీల్లో చోరీ అయినట్లు తేల్చేశారు.. దీంతోపాటు ఆ నేరానికి పాల్పడిన దొంగలనూ పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఆధారాలన్నింటినీ లండన్‌ పోలీసులకు అందచేయడంతో విగ్రహాల ఆచూకి కనిపెట్టడం సులువయ్యింది.. ఆ విగ్రహాలను సొంతం చేసుకున్న యజమానిని పట్టుకుని ఆయన నుంచి విగ్రహాలను రాబట్టారు.. సెప్టెంబరు 15న అక్కడి భారత హైకమిషన్‌ కార్యాలయంలో విగ్రహాలను అప్పగించారు. అయితే 1976 నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోయిన పురాతన శిల్పాలు, విగ్రహాలలో 50కి పైగా పురావస్తు శాఖ కృషితో తిరిగి రప్పించగలిగామన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌. వీటిల్లో దాదాపు 40 విగ్రహాలను 2014 తర్వాతే స్వదేశానికి తీసుకురాగలిగామని ప్రహ్లాద్‌ గొప్పగా చెప్పుకున్నారు.