జాతీయగీతాలాపనలో తత్తరపాటు పడిన విద్యాశాఖ మంత్రి, ఓ ఆటాడేసుకుంటున్న నెటిజన్లు

జనగణమన అంటూ గళమెత్తి ఆ తర్వాత తత్తరబిత్తర అయితే పరువుపోతుంది.. బీహార్‌ మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతను నెత్తినేసుకున్న మంత్రి మేవలాల్‌ చౌదరి ఇలాగే అభాసుపాలయ్యారు..

జాతీయగీతాలాపనలో తత్తరపాటు పడిన విద్యాశాఖ మంత్రి, ఓ ఆటాడేసుకుంటున్న నెటిజన్లు
Follow us
Balu

|

Updated on: Nov 19, 2020 | 11:42 AM

జనగణమన అంటూ గళమెత్తి ఆ తర్వాత తత్తరబిత్తర అయితే పరువుపోతుంది.. బీహార్‌ మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతను నెత్తినేసుకున్న మంత్రి మేవలాల్‌ చౌదరి ఇలాగే అభాసుపాలయ్యారు.. నెటిజనులకు ఈ వీడియో దొరికిందో లేదో తెగ ట్రోల్‌ చేస్తున్నారు.. అయ్యా.. తమరెప్పుడైనా బడికి వెళ్లారా అంటూ ఎకసెక్కాలు చేస్తున్నారు.. వారం కిందట మేవలాల్‌ మంత్రి బాధ్యతలను చేపట్టారు కదా.. ! ఓ బడిలో నిర్వహించిన కార్యక్రమానికి అదే హోదాలో వెళ్లారు.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.. ఆ తర్వాత జనగణమన అంటూ జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టారు.. మధ్యలోనే తడబాటు పడ్డారు.. పంజాబ్‌ సింధ్‌ గుజరాత్‌ మరాఠా అనడానికి బదులుగా పంజాబ్‌ వసంత గుజరాత్‌ మరాఠా అని ఆలపించారు. ఇక చూసుకోండి.. నెటిజన్లు ఓ ఆట ఆడుకోసాగారు.. పోయిపోయి ఈ వీడియో ఆర్‌జేడీ నాయకులకు కూడా దొరికింది.. వాళ్లు ఎందుకు ఊరుకుంటారు? వారూ తమదైన శైలిలో సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.. లెక్కలేనన్ని అవినీతి కేసుల్లో చిక్కుకున్న మేవలాల్‌కు జాతీయ గీతం కూడా తెలియదని, ఇంతకంటే అవమానం మరోటి ఉంటుందా చెప్పండి అంటూ నితీశ్‌ కుమార్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షలమందికి పైగా చూశారు.. ఇలాంటి విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడానికే భయమేస్తుందని కొందరు కామెంట్‌ చేశారు. జాతీయ గీతం రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం నిజంగా సిగ్గు చేటేనని, బడిలో ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం దురదృష్టమని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్‌జేడీ నేతలు ఆరోపిస్తున్నారని కాదు కానీ మేవలాల్‌ చౌదరిపై అవినీతి కేసులు ఉన్నమాట వాస్తవమే! ఆయన అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి హెడ్‌గా ఉన్నప్పుడు జరిగిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో ఈయనగారి హస్తం కూడా ఉందన్నది జనం మాట! జనగణమన రాని వ్యక్తి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ హెడ్‌ ఎలా అయ్యారని ఆశ్చర్యపోకండి.. అలా కొన్ని జరిగిపోతుంటాయి..