BJP: టార్గెట్‌ 400 సీట్లు.. 300 మార్క్‌ దాటని పరిస్థితి.. కారణాలు ఇవే

400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ 300సీట్లు కూడా సాధించలేకపోయింది. 370 నుంచి 400లకు పైగా సీట్లు వస్తాయని చెప్పిన బీజేపీ.. కనీసం గత ఎన్నికల్లో వచ్చిన 303 మార్క్‌ను కూడా క్రాస్‌ చేయలేకపోయింది. దాంతో.. బీజేపీకి సీట్లు ఎందుకు తగ్గాయనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.. ఇంతకీ.. అనుకున్న టార్గెట్‌ను బీజేపీ ఎందుకు రీచ్‌ కాలేకపోయింది?.. ముస్లిం రిజర్వేషన్ల రద్దు నివాదం బీజేపీని దెబ్బ కొట్టిందా?..

BJP: టార్గెట్‌ 400 సీట్లు.. 300 మార్క్‌ దాటని పరిస్థితి.. కారణాలు ఇవే
Prime Minister Modi
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 05, 2024 | 8:00 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని ఖావడం ఖాయమైంది. తద్వారా ఆయన తొలి ప్రధాని నెహ్రూ రికార్డు సమం చేయనున్నారు. అయితే ఎన్​డీఏకు 400స్థానాలకుపైగా వస్తాయని సాధిస్తుందని బీజేపీ వేసుకున్న అంచనాలు తప్పాయి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్​డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షాలు కీలకం కానున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు మించి ఇండి కూటమి సత్తా చాటింది. ప్రధానంగా యూపీ, మహారాష్ట్ర, బంగాల్‌లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది. ఈ మూడు రాష్ట్రాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ బీజేపీపై అనేక అంశాలు ప్రభావం చూపినప్పటికీ.. ప్రధానంగా రిజర్వేషన్ల అంశం వెంటాడింది. దేశంలో ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువ కాగా.. గత రెండు ఎన్నికల్లోనూ ఆ రెండు సామాజిక వర్గాలు బీజేపీకి మద్దతు ఇచ్చాయి. కానీ.. ఈ దఫా ఎన్నికలకు ముందు కొంతమంది బీజేపీ నేతలు రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్‌ విపక్షాలకు ప్రాణం పోశాయి. రాజ్యాంగాన్ని మార్చివేస్తామన్న బీజేపీ నేతల మాటలను ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు అంశాలన్ని ఇండి కూటమి మారుమూల ప్రాంతాల్లోకి బలంగా తీసుకెళ్లింది. దాంతో.. తమ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనతో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్‌ విమర్శలను ప్రధాని మోదీతోపాటు అగ్రనేతలు తిప్పికొట్టినా పార్టీ యంత్రాంగం ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది.

ఇదిలావుంటే.. ముస్లిం రిజర్వేషన్ల రద్దు నినాదంతోనూ బీజేపీ భారీ మూల్యం చెల్లించుకున్నట్లే తెలుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా పలువురు బీజేపీ అగ్ర నేతలంతా తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక.. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ పెద్దయెత్తున ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్లినా.. ఏ సభలో మాట్లాడిన.. బీజేపీ అగ్ర నేతలంతా ముస్లిం రిజర్వేషన్ల రద్దు చేస్తామని ఘంటాపథంగా చెప్పడంతో ఆయా వర్గాల్లో భయాందోళన నెలకొంది. దాంతో.. ముస్లిం వర్గాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్‌ చేసినట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దానికి.. యూపీ, మహారాష్ట్ర, బంగాల్‌లో సీట్లు తగ్గడమే నిదర్శనమని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు నినాదంతో బీజేపీకి మేలుకంటే కీడే ఎక్కువ జరిగిందని చెప్పుకొస్తున్నారు. రిజర్వేషన్లకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని భావించిన ఆయా వర్గాలు.. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం.. కాంగ్రెస్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది. ఇంకా చెప్పాలంటే.. యూపీలో కాస్త ముస్లిం ఓటర్లు ఎక్కువ. గత ఎన్నికల్లో యూపీలోని మెజార్టీ ముస్లింలు బీజేపీని ఆదరించారు. గంపగుత్తగా కమలం పార్టీ ఖాతాలో ఓట్లు వేశారు ముస్లింలు. కానీ.. ఈ ఎన్నికల్లో ఎప్పుడైతే.. ముస్లిం రిజర్వేషన్ల రద్దు నినాదాన్ని బీజేపీ భుజానకెత్తుకుందో అప్పటినుంచి ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో.. గతంలో బీజేపీకి ఓట్లు వేసిన ముస్లిం వర్గాలు.. ఈ సారి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని.. ఇండి కూటమి వైపునకు మళ్లారు. దాంతో.. టార్గెట్‌ 400 సీట్లు అని ప్రచారం చేసిన బీజేపీ.. కనీసం 300 మార్క్‌ను కూడా దాటలేకపోయిందని చెప్పొచ్చు. యూపీ, బెంగాల్‌, మహారాష్ట్రలో ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండగా.. అయా రాష్ట్రాల్లో బీజేపీ అనుకున్న రేంజ్‌లో సీట్లు సాధించలేకపోయింది. మొత్తంగా.. బీజేపీ నేతల రిజర్వేషన్ల రద్దు కామెంట్స్‌.. ఓ వైపు ఓబీసీ, దళిత ఓటర్లను ఎన్డీయేకి దూరం చేయగా.. మరోవైపు ముస్లిం రిజర్వేషన్ల రద్దు నినాదమూ ఆ సామాజిక వర్గం ఓటర్లు షాకిచ్చేలా చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…