సనాతనంపై దాడితో బీజేపీకి ఆయుధమిచ్చిన విపక్షాలు.. 2024 ఎన్నికలను ఇవి ప్రభావితం చేస్తాయా?
ఒక్క మాట.. రాజ్యాల మధ్య యుద్ధానికి కారణమవుతుంది. రాజుల పతనానికి కారణమవుతుంది. భారతీయ పురాణేతిహాసాల్లోనే కాదు ప్రపంచ చరిత్రను తరచి చూస్తే ఇందుకు సంబంధించి ఎన్నో ఉదాహారణలు మనకు కనిపిస్తాయి. నేటి ప్రజాస్వామ్య భారతంలో కూడా ఇలాంటి ఘటనలు, ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఎక్కడో తమిళనాడులో రగిలిన జ్వాల నేడు దేశమంతటా దావానలంలా విస్తరిస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడ్డ సనాతన ధర్మాన్ని..
ఒక్క మాట.. రాజ్యాల మధ్య యుద్ధానికి కారణమవుతుంది. రాజుల పతనానికి కారణమవుతుంది. భారతీయ పురాణేతిహాసాల్లోనే కాదు ప్రపంచ చరిత్రను తరచి చూస్తే ఇందుకు సంబంధించి ఎన్నో ఉదాహారణలు మనకు కనిపిస్తాయి. నేటి ప్రజాస్వామ్య భారతంలో కూడా ఇలాంటి ఘటనలు, ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఎక్కడో తమిళనాడులో రగిలిన జ్వాల నేడు దేశమంతటా దావానలంలా విస్తరిస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడ్డ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వైరస్‌తో పోల్చుతూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారాయి. సనాతన ధర్మం సమాజంలో అసమానతలు, అస్పశ్యతకు కారణమని, సమానత్వం కోరుకునే తాము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పే తమిళనాడులో ద్రవిడ పార్టీలకు అందువల్ల కలిగే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. పైపెచ్చు ప్రయోజనం కూడా పొందొచ్చేమో. కానీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అలా కాదు. సనాతన ధర్మంపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు.. యావత్ విపక్ష కూటమికి అంటుకున్నాయి. కూటమిలో ఒకట్రెండు పార్టీలు పైపైన ఖండించినప్పటికీ, వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఖండన లేకపోవడం, మౌనాన్ని ఆశ్రయించడం ఇప్పుడు కాషాయదళానికి అందివచ్చిన అవకాశంగా మారింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతి, అయోధ్య రామ మందిరం, పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ వంటి అంశాలను ప్రజల భావోద్వేగాలతో ముడిపెట్టడంతో బీజేపీ విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండుసార్లు గెలుపొంది కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇప్పుడు సనాతన ధర్మంపై దాడి చేయడం ద్వారా విపక్ష కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీకి బలమైన ఎజెండాను అందించింది. భావోద్వేగాలు కాదనలేని విధంగా భారతదేశ రాజకీయాల్లో చర్చకు కారణమవుతాయి. అదే స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేస్తాయి. సనాతన ధర్మంపై విమర్శల దాడిని బీజేపీ భావోద్వేగ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది.
సనాతనం.. ప్రచారాస్త్రంగా..
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల తర్వాత జరిగిన మొదటి కేంద్ర కేబినెట్ సమావేశంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంయమనంతో ఎదురుదాడి చేయాలంటూ సూచన చేశారు. తాజాగా గురువారం మధ్యప్రదేశ్‌లోని బినాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ స్వయంగా విపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. సనానత సంస్కృతిని అంతం చేయడానికి I.N.D.I కూటమి ఒక తీర్మానంతో ముందుకొచ్చిందని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, ఈ దాడిని ఇకపై మరింత ముమ్మరం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, ఆచరించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మన దేశాన్ని బానిసత్వం వైపు నడిపించాలనే స్పష్టమైన ఉద్దేశం ఈ శక్తులకు ఉందని, సమిష్టిగా వారి పథకాలను తిప్పికొట్టాలని ఆయన నొక్కి చెప్పారు. అహంకారంతో కూడిన ఈ కూటమికి విధానం అంటూ ఏదీ లేదని, నాయకుడు కూడా లేడని.. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్న రహస్య ఎజెండా మాత్రమే ఉందని ప్రధాని అన్నారు. సనాతన ధర్మం అంశంలో కూటమిపై ఎదురుదాడి చేస్తున్న సమయంలో.. ప్రధాని తన ప్రసంగంలో మహాత్మా గాంధీ, అహల్యాబాయి హోల్కర్, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్‌లను ప్రస్తావించారు.
ఎన్నికల హిందువులు ఎందరో..
కాంగ్రెస్ సహా లౌకికవాద పార్టీలుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ లౌకికవాదం పేరుతో దేశంలో అల్పసంఖ్యాక వర్గాలను ఆకట్టుకోవడం కోసం అధిక సంఖ్యాక హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేయడమే భారతీయ జనతా పార్టీకి ఆయుధంగా మారిందనేది నిర్వివాదాంశం. తమ తప్పిదాన్ని గ్రహించిన ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే తాము కూడా హిందువులం అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. రాహుల్ గాంధీ సైతం తాను జంధ్యం ధరించే బ్రాహ్మణుణ్ణి అంటూ ఓసారి, శివభక్తుడినని మరోసారి చెబుతూ ఆలయాల సందర్శనం చేశారు. కానీ ఈ భక్తిని ఎన్నికల తర్వాత కొనసాగించకపోవడంతో.. బీజేపీ నేతలు ఆయనపై “ఎన్నికల హిందువు” అన్న ముద్ర బలంగా వేయగలిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం ఎన్నికల సమయంలో లక్ష్మీదేవిని కరెన్సీ నోటుపై ముద్రించాలన్న డిమాండ్లు చేస్తూ వచ్చారు. ఏదేమైనా హిందూ సమాజాన్ని ‘మతం’ పేరుతో ఆకట్టుకోలేకపోయాయి. ఆకట్టుకోవడం సంగతెలా ఉన్నా.. కనీసం దూరం చేసుకోకుండా జాగ్రత్తపడడంలో విఫలమవుతున్నాయని చెప్పడానికి సనాతన ధర్మం వివాదమే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. బుధవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన I.N.D.I కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశంలో డీఎంకే నేత వ్యాఖ్యలను ఖండించలేదు. కనీసం సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కూడా వారించలేదు. ఇకపోతే న్యూస్ ఛానెళ్లలో డిబేట్లు నిర్వహించే జర్నలిస్ట్ యాంకర్లను బహిష్కరిస్తూ తీర్మానం మాత్రం చేసింది.
కూటమి మౌనం దేనికి సంకేతం..
సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు ఒకరిద్దరు మాత్రం జూనియర్ స్టాలిన్ ప్రకటనను తప్పుబట్టారు. కానీ అటు సోనియా గాంధీ, ఇటు రాహుల్ లేదా మల్లికార్జున్ ఖర్గే వంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం మౌనాన్ని ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విదేశీ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తప్పుబట్టాలన్న ప్రయత్నంలో తాను హిందూ పురాణేతిహాసాలు చదివానని, మోదీ అనుసరిస్తున్నది హిందుత్వమే కాదని వ్యాఖ్యలు చేశారు. ‘హిందుత్వం’ విషయంలో కమలదళంపై చేసే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి మేలు చేయకపోగా.. అవి అంతిమంగా బీజేపీకే మేలు చేస్తాయని ఆ పార్టీ నేతలు గ్రహించలేకపోతున్నారు. కాంగ్రెస్‌లో కొందరు నేతలు బీజేపీని విమర్శించాలంటే ‘హిందుత్వం’ జోలికి వెళ్లకూడదని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రజాసమస్యలపైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
కానీ కూటమి మౌనం 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీకి ఒక పెద్ద ఎజెండాను అందించినట్టయింది. దేశంలోని మెజారిటీ వర్గాల మనోభావాలతో ఆడుకోవడం ద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని వరుసగా మూడోసారి అధికారంలోకి రాకుండా ఆపలేరన్న విషయాన్ని కాంగ్రెస్‌తో పాటు కూటమి భాగస్వాములు మర్చిపోకూడదు. గణాంకాల ప్రకారం చూస్తే భారత పార్లమెంటులో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల వాటా 129 మంది ఎంపీలు మాత్రమే. ఇందులో కేరళ నుండి 20 మంది, ఆంధ్ర ప్రదేశ్ నుండి 25 మంది, తమిళనాడు నుండి 39 మంది, తెలంగాణ నుండి 17 మంది మరియు కర్ణాటక నుండి 28 మంది ఉన్నారు. హిందీ బెల్ట్‌గా చెప్పుకునే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలన్నీ కలుపుకుంటే 350 మంది ఎంపీలున్నారు. ఈ రాష్ట్రాల్లో ప్రధాని మోదీకి విశేష ప్రజాదరణ ఉంది. దాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని వ్యూహాత్మక ఎత్తుగడ వేశాయి. ఇది కచ్చితంగా బీజేపీకి శరాఘాతమే. కానీ సరిగ్గా ఇదే సమయంలో మెజారిటీ హిందూ ప్రజలందరికీ ఒకవైపు నిలిపి ఉంచేలా సనాతన ధర్మం పేరుతో తిరుగులేని అస్త్రాన్ని బీజేపీకి అందించినట్టయింది. ఫలితంగా I.N.D.I కూటమి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయింది. డీఎంకే చర్యలను ఖండించకుండా సాఫ్ట్ హిందుత్వ రాజకీయాలు చేయడం చాలా కష్టం.
హిందీ బెల్ట్ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లలో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ మెజారిటీ జనాభా ఉందని ప్రతిపక్ష కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ మర్చిపోకూడదు. మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో సనాతన ధర్మం అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రధాని మోదీ చేసిన మాటల దాడి పర్యవసానాలు ఎలా ఉంటాయో కూటమికి అర్థమవుతోంది. ప్రధానమంత్రి మోడీ యావద్దేశం దృష్టిని మతపరమైన కోణం వైపు మళ్లించారు. ఈ సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవడంలో ఎంతో ప్రావీణ్యం కల్గిన బీజేపీని మించి ప్రస్తుతం దేశంలో ఇంకే పార్టీ లేదు. ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సనాతన ధర్మ వివాదం పెద్ద ఎన్నికల ఎజెండాగా మారుతుందనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..