Gujarat New CM: గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం.. కొత్త సీఎం కోసం కసరత్తు షురూ.. గాంధీనగర్‌కు అమిత్ షా!
గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి విజయ్ రూపానీ తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
BJP removes CM Vijay Rupani: గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి విజయ్ రూపానీ తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. మరో 15 నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2016లో విజయ్ రూపానీ గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. పటేల్ల రిజర్వేషన్ల ఉద్యమాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.
ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చ మొదలైంది. డిసెంబర్ 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల సమయం ఉండగానే, ముందుగా రూపానీ సీఎం పదవికి రాజీనామా చేశారు. శనివారం నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలుసుకుని రాజీనామా సమర్పించారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న నాలుగో బీజేపీ ముఖ్యమంత్రి ఈయన. అంతకుముందు కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ రావత్, తీరథ్ సింగ్ రావత్ కూడా సీఎం పదవులకు రాజీనామా చేశారు.
పార్టీ కార్యకర్తగా పనిచేస్తాః విజయ రూపానీ రాజీనామా సమర్పించిన అనంతరం రూపానీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పదవి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ‘‘ ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇచ్చిన పర్వాలేదని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేసేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉన్నానన్నారు. అలాగే రాష్ట్రంలో నూతన నాయకత్వంలో కొత్త ఉత్సాహం, కొత్త శక్తితో గుజరాత్ అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్తుందని ఆశిస్తున్నా అన్న ఆయన.. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా. నా లాంటి పార్టీ కార్యకర్తకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు. నా పదవి కాలం మొత్తంలో ప్రధాని మోడీ ఎంతగానో మార్గనిర్దేశం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో గుజరాత్.. అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంది. ఇందులో నా వంతు సహకారం అందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అని రూపానీ వివరించారు.
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.. 2016 ఆగస్టు 7న రూపానీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది పాటు ఉంది. అయితే బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతోనే ఆయన సీఎం కుర్చీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వం నేతృత్వంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. పటేల్ సామాజిక వర్గానికి చెందిన నేతకే తదుపరి సీఎం బాధ్యలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
విజయ్ రూపానీ వారసుడిగా ఎవరు? రూపానీ రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఆదివారం ఉదయం జరిగే శాసనసభ సమావేశానికి గాంధీనగర్ చేరుకోవాలని అధిష్టానం కోరింది. మరోవైపు, కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం అహ్మదాబాద్ చేరుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.త ర్వాత సీఎంను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే మంగళవారం సమావేశం కానున్నట్లు సమచారం. సీఎం రేసులో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, పురుషోత్తం రూపాలా ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వచ్చే ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఐదేళ్లు పూర్తి చేసుకున్న రెండో సీఎం.. ఆనందీబెన్ పటేల్ రాజీనామా తరువాత ఆగష్టు 7, 2016 న విజయ్ రూపానీ గుజరాత్ 16 వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ పాలన కలిగిన రాష్ట్రంలో నాల్గవ ముఖ్యమంత్రి రూపానీ. ఆయన కంటే ముందు మోడీ గుజరాత్‌లో 4,610 రోజుల పాటు పరిపాలించారు. ఇంతకుముందు, హితేంద్ర దేశాయ్ 2,062 రోజులు, మాధవ్‌సింగ్ సోలంకి 2,049 రోజుల పాటు సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆగష్టు 7 2021 న, విజయ్ రూపానీ నరేంద్ర మోడీ తర్వాత గుజరాత్‌లో బీజేపీ ముఖ్యమంత్రిగా అయిదు సంవత్సరాలు పూర్తి చేసిన వ్యక్తిగా ఘనత సాధించారు.