AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone Medicine: దేశంలో తొలిసారి అకాశమార్గా మందులు సరఫరా.. డ్రోన్‌ల ద్వారా మెడిసిన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం

దేశంలోనే తొలిసారి మెడిసిన్‌ డ్రోన్ల ద్వారా పంపే కార్యక్రమం మొదలైంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లా అందుకు వేదికైంది.

Drone Medicine: దేశంలో తొలిసారి అకాశమార్గా మందులు సరఫరా.. డ్రోన్‌ల ద్వారా మెడిసిన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం
Telangana Drone Medicine
Balaraju Goud
|

Updated on: Sep 11, 2021 | 4:47 PM

Share

Telangana medicine via drones: దేశంలోనే తొలిసారి మెడిసిన్‌ డ్రోన్ల ద్వారా పంపే కార్యక్రమం మొదలైంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లా అందుకు వేదికైంది. వికారాబాద్‌ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంగా ఉన్న PHCకి మందులను డ్రోన్‌ ద్వారా పంపారు. సరిగ్గా రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, తండాలకు డ్రోన్‌ల (Drones) ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మారుమూల గ్రామాలకు వేగంగా, ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా మందులను, వ్యాక్సిన్లను పంపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సమయాల్లోనూ ఈ డ్రోన్లను వాడొచ్చని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలన్నారు. వికారాబాద్‌లో డ్రోన్‌ సాయంతో మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి సింధియా ప్రారంభించారు. డ్రోన్‌ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందన్నారు. గ్రహంబెల్‌ టెలిఫోన్‌, రైట్‌ బ్రదర్స్‌ విమానం లాగే డ్రోన్‌ టెక్నాలజీ ఓ సంచలనమని చెప్పుకొచ్చారు. డ్రోన్ల ద్వారా మారుమూల పల్లెలకు ఔషధాలు సరఫరా చేస్తున్నందుకు యువతను అభినందించారు మంత్రి సింధియా.

ఇలాంటి సాంకేతికతను అందించడమే ప్రధాని మోడీ స్వప్నమని తెలిపారు. డ్రోన్‌ పాలసీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవడం అభినందనీనయమన్నారు. సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. స్టార్టప్‌లను తేలిగ్గా చూడద్దని సూచించారు. చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోందని వెల్లడించారు. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. అన్నదాతలు, జ్ఞానదాతలు ముఖ్యమని చెప్పారు. ఏరోస్పేస్‌ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి గ్రీన్‌జోన్లు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తారన్నారు. సామాన్యుడికి ఉపయోగం లేని సాంకేతికత వ్యర్థమని సీఎం తరచూ చెప్తుంటారని కేటీఆర్‌‌ గుర్తు చేశారు. తెలంగాణలో ఎమర్జింగ్‌ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అధునాతన టెక్నాలజీతో నిరుపేదలకు మారుమూల పల్లెలకు మందులు సరఫరా చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా రక్తం, మందులు సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు. ఆరోగ్య రంగంతో పాట అనేక రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చని సూచించారు.

అలాగే, తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లు వినియోగిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్‌ చప్పుళ్లకే హడలెత్తిపోతున్నారన్నారు. మైనింగ్‌ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా వాటిని కట్టడి చేయొచ్చని చెప్పారు.

Read Also…. Manike Mage Hithe Song: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాణికే మాగే హితే సాంగ్.. అర్థంకాకపోయిన రికార్డ్స్ సృష్టిస్తోందిగా..