Lok Sabha Elections 2024: బీజేపీకి తిరుగులేదు.. కానీ మిత్రపక్షాలే బలహీనం.. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏం చెబుతున్నాయంటే?

సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. మంగళవారం అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ప్రజానాడిని పూర్తిస్థాయిలో పసిగడతాయా లేదా అన్న చర్చను కాసేపు పక్కనపెడితే.. ఆదివారం అంచనాలు విడుదల చేసిన అన్ని సంస్థలు కేంద్రంలో "భారతీయ జనతా పార్టీ (BJP)" సారథ్యంలోని "నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)" విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న నినాదంతో 400 సీట్లు దాటి గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం.. ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఓ రెండు సర్వే సంస్థలు అంచనా వేశాయి.

Lok Sabha Elections 2024: బీజేపీకి తిరుగులేదు.. కానీ మిత్రపక్షాలే బలహీనం.. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏం చెబుతున్నాయంటే?
Lok Sabha Election 2024
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Srikar T

Updated on: Jun 02, 2024 | 4:05 PM

సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. మంగళవారం అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ప్రజానాడిని పూర్తిస్థాయిలో పసిగడతాయా లేదా అన్న చర్చను కాసేపు పక్కనపెడితే.. ఆదివారం అంచనాలు విడుదల చేసిన అన్ని సంస్థలు కేంద్రంలో “భారతీయ జనతా పార్టీ (BJP)” సారథ్యంలోని “నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)” విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న నినాదంతో 400 సీట్లు దాటి గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం.. ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఓ రెండు సర్వే సంస్థలు అంచనా వేశాయి. 2019లో సొంతంగానే 303 సీట్లు సాధించి, కూటమిగా 352 సీట్ల సంఖ్యను చేరుకోగా.. ఈసారి సగటున కూటమి 350 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల సారాంశం. టీవీ9-పీపుల్స్ ఇన్‌సైట్, పోల్‌స్ట్రాట్ సంస్థతో కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీఏకు దాదాపు 350 సీట్లు వస్తాయని తేలింది. 2019తో పోల్చితే మిత్రపక్షాల సంఖ్యను పెంచుకున్నప్పటికీ వాటిలో కొన్ని ప్రధాన పార్టీలు బలహీనంగా ఉండడం వల్ల అనుకున్న లక్ష్యం చేరుకోవడం కష్టసాధ్యంగా మారిందని అర్థమవుతోంది. ఫలితంగా 400 దాటాలన్న ఎన్డీయే కల నెరవేరేలా కనిపించడం లేదు. నితీష్ కుమార్, ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వంటి మిత్రపక్షాల నేతల ఈసారి ఎన్డీయేకు బలహీనమైన భాగస్వాములుగా మారారు.

TV9-పీపుల్స్ ఇన్‌సైట్, పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ ప్రకారం దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో, BJP నేతృత్వంలోని NDAకి 346 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి (I.N.D.I.A)కి 162 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో ఇతర పార్టీలకు 35 సీట్లు దక్కవచ్చని పేర్కొంది. ఎన్డీయేకు వచ్చే 346 సీట్లలో బీజేపీకి 311 సీట్లు, మిగిలిన మిత్రపక్షాలకు 35 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 2019 కంటే బీజేపీ సీట్లు పెరిగాయి. కానీ మిత్రపక్షాల సీట్లు తగ్గుతున్నాయి. ముఖ్యంగా బీహార్, మహారాష్ట్రల్లో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలిందని స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఎన్డీయేలోకి తిరిగొచ్చిన చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ (TDP), జయంత్ చౌదరి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD), అనుప్రియా పటేల్ సారథ్యంలోని అప్నాదళ్ (ఎస్) మినహా మిగిలిన బీజేపీ మిత్రపక్షాల పనితీరు ఈసారి బలహీనంగా ఉంది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్), మహారాష్ట్రలో షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పనితీరు పేలవంగా ఉంది. తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ కూడా ఈసారి బలహీనంగా ఉందని తేలింది. అలాగే ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన కొడుకును గెలిపించడంలో సఫలీకృతం కావడం లేదని అంచనాలు చెబుతున్నాయి.

బీహార్‌లో మసకబారిన నితీష్ ప్రాభవం..

2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 సీట్లకు గాను ఎన్డీయేకు 39 సీట్లు గెలుపొందింది. కానీ ఈసారి సీట్లు తగ్గుతున్నాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. టీవీ9-పోల్‌స్ట్రాట్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 27 సీట్లు, విపక్ష కూటమికి 12 సీట్లు వస్తాయని తేలింది. మిగిలిన 1 స్థానం ఈ రెండు కూటముల్లో లేని పార్టీకి దక్కవచ్చు. సర్వే ప్రకారం కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీ పోటీ చేస్తున్న మొత్తం 17 స్థానాలు గెలుచుకుంటుందని, కానీ జేడీయూ పోటీ చేస్తున్న 17 సీట్లలో కేవలం 7 మాత్రమే గెలుపొందుతుందని తేలింది. అదే సమయంలో, LJP (R) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తన కోటాలోని 5 సీట్లలో 4 గెలుచుకుంటారని వెల్లడైంది. బీహార్‌లో ఎన్డీయే నష్టపోతుంటే మిత్రపక్షాల పనితీరు లేకపోవడమే అందుకు కారణం. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, 2019 పోటీలో JDU సీట్లు తగ్గుతున్నందున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలహీనమైన లింక్ అని రుజువు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జేడీయూ 16 సీట్లు గెలుచుకోగా, ఈసారి కేవలం 7 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ విధంగా జేడీయూ 9 సీట్లు, చిరాగ్ పాశ్వాన్ ఒక సీటును కోల్పోతుండగా.. కూటమిలో మరో భాగస్వామిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా కూడా తన సీటును గెలుచుకోలేరని తేలింది. అలా మొత్తంగా బిహార్‌లో కూటమి స్కోరులో 11 సీట్లు తగ్గుతుండగా.. బీజేపీ స్కోరులో మాత్రం తేడా రావడం లేదు.

ఇవి కూడా చదవండి

బీహార్‌లో జేడీయూ సీట్లు తగ్గడం వల్ల నితీష్ కుమార్ ప్రస్తుత ఎన్డీయేలో బలహీనమైన భాగస్వామి అని, ఆయనపై ప్రజల్లో ఆగ్రహం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. తరచుగా అటూ ఇటూ కూటములు మారుతున్న నితీష్ కుమార్‌పై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారని అర్థమవుతోంది. ఇది తేజస్వి యాదవ్ విజయానికి దోహదం చేస్తోంది. ఫలితంగా విపక్ష ఇండి కూటమికి కూడా ప్రయోజనం కల్గిస్తోంది. బీజేపీకి రాజకీయ పునాది బలంగా ఉండడం, జాతీయస్థాయిలో మోదీ ప్రాభవం తగ్గకపోవడం వంటివి ఆ పార్టీ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో గెలిపిస్తోంది.

మహారాష్ట్రలో షిండే-అజిత్ పవార్ల వైఫల్యం..

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు రాజకీయంగా అతిపెద్ద దెబ్బ మహారాష్ట్రలో పడింది. టీవీ9-పీపుల్స్ ఇన్‌సైట్, పోల్‌స్ట్రాట్ సర్వే ప్రకారం మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో ఎన్‌డీఏకు 22 సీట్లు, భారత కూటమికి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఒక సీటు ఇతరుల ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఎన్డీయే దాదాపు 19 లోక్‌సభ స్థానాలను కోల్పోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి, BJP పాత మిత్రుడు ఉద్ధవ్ థాకరే ప్రతిపక్ష శిబిరంలో ఉన్నారు. ఆ లోటును భర్తీ చేయడంలో ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చీలిక వర్గం, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలికవర్గం సఫలం కాలేకపోయాయి. ఆ కారణంగా బీజేపీ సైతం ఆశించిన ప్రయోజనం పొందలేకపోయినట్టుగా అర్థమవుతోంది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, కూటమిగా గెలుపొందినప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే విడిపోయి ప్రతిపక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గత ఐదేళ్లుగా మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ వచ్చాయి. రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత మహారాష్ట్రలో జరుగుతున్న మొదటి ఎన్నికలు. చీలిక వర్గాలను తమతో కలుపుకున్న బీజేపీ, శివసేన లేని లోటును భర్తీ చేయాలనుకుంది. కానీ అది సాధ్యపడలేదని అర్థమవుతోంది. ఎన్డీయే హయాంలో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో బీజేపీ 28 స్థానాల్లో, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 15 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 4 స్థానాల్లో, రాష్ట్రీయ సమాజ్ పక్ష్ ఒక స్థానంలో పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం, బీజేపీ తన కోటాలోని 28 సీట్లలో 18 మాత్రమే గెలుచుకోనుంది. షిండే వర్గానికి చెందిన శివసేన తన కోటాలోని 15 సీట్లలో 4 గెలుచుకుంటుంది. అజిత్ పవార్ ఎన్సీపీ ఖాతా తెరుచుకునేలా కనిపించడం లేదు. 2019తో పోలిస్తే, బీజేపీ 5 సీట్లు కోల్పోతోంది. షిండే, అజిత్ పవార్ ఏ విధంగానూ బీజేపీకి ప్రయోజనం చేకూర్చలేకపోయారు.

అదే సమయంలో విపక్ష ఇండి కూటమిలోని ఉద్ధవ్‌ ఠాక్రేకు చెందిన శివసేన (UBT) 21 స్థానాల్లో పోటీ చేసి 14 సీట్లు గెలుచుకోనుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ తన కోటాలోని 17 సీట్లలో 5, శరద్ పవార్ పార్టీ 10 సీట్లకు 6 సీట్లు గెలుచుకుంటున్నాయి. ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీలు రెండూ లాభాల్లో ఉన్నాయి. బీజేపీ ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదాన్ని ఇచ్చినప్పుడు, మహారాష్ట్రలో తమకు 45 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భావించింది. అయితే ఎగ్జిట్ పోల్ గణాంకాలు అంత ప్రోత్సాహకరంగా కనిపించడం లేదు. బీజేపీ ఏకనాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించి, అజిత్ పవార్‌ను డిప్యూటీ సీఎంను కూడా చేసింది, కానీ ఇద్దరు నాయకులు తమ చీలిక వర్గాలను బలోపేతం చేయలేకపోయారు. తమకు అంత పెద్ద పదువులు కట్టబెట్టిన బీజేపీకి ఏమాత్రం ఉపయోగపడలేకపోయారు.

ఉత్తరప్రదేశ్‌లో అసమర్థ భాగస్వాములు..

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 80 పార్లమెంట్ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి రాష్ట్రంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈసారి తన పొత్తుల పరిధిని పెంచుకుంది. ఎన్డీయేలోకి పశ్చిమ యూపీలో జాట్ సామాజికవర్గంలో గట్టి పట్టున్న జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD), పూర్వాంచల్‌లో ఓం ప్రకాష్ రాజ్‌భర్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అప్నాదళ్, నిషాద్ పార్టీలతో బీజేపీకి ముందు నుంచి పొత్తు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్ ప్రకారం యూపీలో ఎన్డీయేకు 66 సీట్లు రాగా, భారత కూటమికి 14 సీట్లు రావచ్చని తేలింది. 2019తో పోల్చితే ఎన్డీయేకు రెండు స్థానాలు పెరుగుతున్నాయి. అప్నాదళ్ కూడా తన రెండు స్థానాల్లో విజయం సాధిస్తుండగా.. RLDకి రెండు సీట్లు గెలవనుంది.

బీజేపీ మిత్రపక్షం ఓం ప్రకాష్ రాజ్‌భర్ పార్టీ యూపీలో ఒక స్థానంలో పోటీ చేస్తుంది. ఘోసీ నియోజకవర్గం నుంచి ఆయన తన కుమారుడు అరవింద్ రాజ్‌భర్‌ను పోటీకి దింపారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, రాజ్‌భర్ తన కొడుకును గెలిపించేలా కనిపించడం లేదు. యూపీలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం అది నెరవేరేలా కనిపించడం లేదు. ఇది మాత్రమే కాదు, ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన ప్రధాన ఓటు బ్యాంకైన రాజ్‌భర్ సామాజికవర్గంపై కూడా బలమైన పట్టును కొనసాగించలేకపోయారని అర్థమవుతోంది.

బీజేపీకి బలంగా మారింది వీరే..

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షం ఏదైనా ప్రయోజనం కల్గిస్తుంది అంటే.. అది ఒక్క చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీయే అని సర్వే అంచనాలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఖాతా తెరుచుకునేలా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం 9, బీజేపీ 2, జనసేన 1 సీటు గెలుపొందుతాయని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. ఈ విధంగా చూస్తే ఎన్డీయేకు మొత్తంగా 12 సీట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 13 సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌లో దేశవ్యాప్తంగా ఎన్‌డీఏలోని ఏ భాగస్వామ్య పార్టీ అయినా బీజేపీ తర్వాత అత్యుత్తమ పనితీరు కనబరిచింది అంటే అది తెలుగుదేశం పార్టీయే. ఆ తర్వాతి స్థానంలో 7 సీట్లతో జేడీ(యూ), 4 సీట్లతో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నిలిచాయి.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 311 సీట్లు గెలుచుకుంటూ తన పాత రికార్డును అధిగమిస్తుంటే.. మిత్రపక్షాలు ఆశించిన రీతిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఒకవేళ బీహార్‌లో జేడీ(యూ), ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ వంటి పార్టీలు బీజేపీ మాదిరిగా పనిచేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. ఎన్డీయే ఇచ్చిన నినాదం నిజమై ఉండేది. ఏదేమైనా జూన్ 4న వెల్లడికానున్న అసలైన ఫలితాలతో ఈ మిత్రపక్షాల అసలు బలమెంత అన్నది తేలనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..