Toll Charges: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. నేటి నుంచి టోల్ ఛార్జీల పెంపు
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. పెరిగిన టోల్ ఛార్జీలు నేటి ఆదివారం అర్ధరాత్రి నుంచి (సాంకేతికంగా జూన్ 3 నుంచి) అమలు కానున్నాయి. సాధారణంగా అయితే.. ఏటా ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజులను పెంచుతుంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఎన్నికల సంఘం ఆదేశించింది.
దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచింది NHAI. ప్రతీ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5 శాతం పెంచుతుంటారు. లోక్‌సభ ఎన్నికల వల్ల ధరల పెంపు ఈ సారి తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని NHAI నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ NHAIను ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఇప్పుడు చివరి విడత పోలింగ్ కూడా ముగియడంతో టోల్ ఛార్జీల పెంపునకు అనుమతి ఇస్తూ NHAI ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక రాష్ట్రంలో ఎక్కువగా రాకపోకలు సాగే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జీ రూ.5 పెరగగా.. ఇరువైపులా కలిపి రూ.10, బస్సులు, ట్రక్కులు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికి 35 రూపాయలు, భారీ సరకు రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ. 35, రెండు వైపులా కలిసి రూ.50 వరకు టోల్ ఛార్జీలు పెంచారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు 25 శాతం రాయితీ లభిస్తుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్ రూ.330 నుంచి 340కి పెరిగింది. అయితే ఈ పెంచిన ఛార్జీలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. రహదారుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీలను NHAI పెంచుతూ వస్తుంది.
అయితే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు కారు, వ్యాన్, జీపు, లైట్ మోటర్ వాహనంలో వెళ్లాలంటే.. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో మొత్తంగా ఒకవైపు అయితే 335 రూపాయలు, రెండువైపులా అయితే 500 రూపాయలు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..