బస్టాప్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు
గుళ్లనే కాదు గుళ్లో లింగాలను మింగేస్తున్నారనేది నానుడి! ఇప్పుడు సామెతను కొద్దిగా మార్చేసి బస్సులనే కాదు, బస్టాప్‌లను ఎత్తుకెళుతున్నారని అంటే బాగుంటుందేమో! పోదురూ...! బస్టాండ్‌లను ఎవరైనా ఎత్తుకెళతారా?
గుళ్లనే కాదు గుళ్లో లింగాలను మింగేస్తున్నారనేది నానుడి! ఇప్పుడు సామెతను కొద్దిగా మార్చేసి బస్సులనే కాదు, బస్టాప్‌లను ఎత్తుకెళుతున్నారని అంటే బాగుంటుందేమో! పోదురూ…! బస్టాండ్‌లను ఎవరైనా ఎత్తుకెళతారా? అని అడక్కండి.. మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటి దొంగలు కూడా ఉన్నారు.. అక్కడి దొంగలు ఎంచక్కా బస్టాప్‌ను దొంగతనం చేశారు.. బస్టాండునే ఎత్తుకెళ్లారంటే వారు మామూలు దొంగలయి ఉండరు కదా! అందుకే వారిని పట్టించిన వారికి అయిదు వేల రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటించారు స్థానిక నేతలు! పూణె మహానగర్ పరివహాన్ ప్రజల కోసమని దేవాకి ప్యాలెస్ ముందు బీటీ కవాడే దగ్గర ఓ బస్టాప్‌ను ఏర్పాటు చేశారు.. దాన్నే దొంగలు ఎత్తుకెళ్లారు.. వారిని పట్టిస్తే అయిదు వేల రూపాయలు ఇస్తానంటున్నారు పూణె మహానగర్ పరివహాన్ మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ మాస్కే.. ఈయన ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే దొంగతనం విషయం పదిమందికి తెలిసొచ్చింది.. అసలు అక్కడ బస్టాపే లేదంటున్నారు కొందరు నెటిజన్లు.. కొందరేమో ఎవరో కావాలనే చేసి ఉంటారని చెబుతున్నారు.. ముక్కలు ముక్కలు చేసి పాత ఇనుప సామానుల వాడికి అమ్మేసుకుని ఉంటారంటున్నారు ఇంకొందరు.. మొత్తం మీద బస్టాప్ చోరీకి గురయ్యిందన్నది మాత్రం వాస్తవం!! ఔరా కలికాలం…!!