Bengal SSC Scam: నోట్ల కట్టలన్నీ మంత్రివే.. ED దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడించిన అర్పిత
బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో దాదాపు రూ.120 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.50 కోట్ల నగదు పట్టుబడగా.. మిగిలిన నగదును ఎక్కడ దాచారో గుర్తించేందుకు ఈడీ అధికారులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Bengal SSC Scam: బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) రెండు ఇళ్ల నుంచి ఈడీ అధికారులు ఇప్పటి వరకు దాదాపు రూ.50 కోట్ల నగదు, భారీగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో దాదాపు రూ.120 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.50 కోట్ల నగదు పట్టుబడగా.. మిగిలిన నగదును ఎక్కడ దాచారో గుర్తించేందుకు ఈడీ అధికారులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అర్పితను అరెస్ట్ చేసినప్పుడు ఆమెకు చెందిన ఓ మెర్సిడెస్ కారును మాత్రమే ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఆమె వాడుతున్న మరో నాలుగు లగ్జరీ కార్లు సోదాలు జరిగినప్పటి నుంచి కనిపించకుండాపోయాయి. ఇందులో భారీగా నగదు, బంగారు ఆభరణాలను నింపి ఉంచినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. కనిపించకుండా పోయిన మిగిలిన నాలుగు లగ్జరీ కార్ల కోసం గాలిస్తున్నారు. వీటి ఆచూకీని గుర్తిస్తే భారీగా నగదు పట్టుబడుతుందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫూటేజీ ఆధారంగా పలు ప్రాంతాల్లో ఈ కార్ల కోసం ఈడీ అధికారులు గాలిస్తున్నారు.

Arpita Mukherjee
అర్పిత ఇంట్లో ఐదో రోజుల క్రితం దాడులు జరిపిన ఈడీ అధికారులు రూ.21 కోట్ల నగదును సీజ్ చేయగా.. బుధవారంనాడు మరో ఇంట్లో రూ.28 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్ రూమ్, వాష్ రూమ్‌లలో నగదుతో పాటు భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. ఇదిలా ఉండగా ఈడీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము పార్థ ఛటర్జీదేనని ఈడీ అధికారులకు అర్పిత వెల్లడించినట్లు తెలుస్తోంది. పార్థ ఛటర్జీ, తన సన్నిహితులతో కలిసి ఇక్కడకు వచ్చి నగదును ఉంచి వెళ్లేవారని తెలిపారు. నగదును ఉంచిన గదుల్లోకి వెళ్లేందుకు తనకు అనుమతి ఉండేది కాదని ఆమె దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు సమాచారం.




టీచర్ రిక్రూట్‌మెంట్‌లో భారీగా అవకతవకాలు పాల్పడిన బెంగాల్ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని జులై 23న ఈడీ అదికారులు అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి సీఎం మమతా బెనర్జీ గురువారంనాడు తప్పించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..




