AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్సార్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. బ్యాన్ ఎత్తివేత..

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఊహించని షాక్ ఇచ్చింది. 2026 బ్యాచ్‌కి చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లు ఎవరూ అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేకుండా వారి ఎన్‌రోల్‌మెంట్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నల్సార్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. బ్యాన్ ఎత్తివేత..
Bci Halts Enrolment Of Nalsar 2026 Graduates
Krishna S
|

Updated on: Aug 13, 2026 | 10:04 PM

Share

హైదరాబాద్‌లోని ప్రముఖ న్యాయ విద్యాసంస్థ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 2026 గ్రాడ్యుయేషన్ బ్యాచ్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. నల్సార్ విద్యార్థులు అడ్వకేట్లుగా నమోదు కాకుండా గతంలో విధించిన నిషేధాన్ని బీసీఐ కౌన్సిల్ ఉపసంహరించుకుంది. విద్యార్థుల్లో అధికులు నిర్దోషులని, కాన్వొకేషన్ వివాదంతో వారికి ఎలాంటి సంబంధం లేదని తేలడంతో బిసిఐ ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో నల్సార్ 2026 బ్యాచ్ పాస్‌అవుట్ విద్యార్థులంతా తాము కోరుకున్న ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనైనా న్యాయవాదులుగా ఉచితంగా ఎన్‌రోల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

అసలు ఆర్డర్ సవరణ.. బీసీఐ కౌన్సిల్ ఏమందంటే?

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనల నేపథ్యంలో.. BCI ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా గురువారం ఉదయమే ఎన్‌రోల్‌మెంట్‌పై నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే బీసీఐ కౌన్సిల్ సభ్యులు ఈ అంశంపై అత్యవసరంగా సమావేశమై చర్చించారు. ఎలాంటి తప్పు చేయని మెజారిటీ విద్యార్థులు నష్టపోకూడదని కౌన్సిల్ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఈ మేరకు ఛైర్మన్ ఇచ్చిన పాత ఆదేశాలను సవరిస్తూ నూతన ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘తాజా సమాచారం, నివేదికల ప్రకారం నల్సార్ 2026 బ్యాచ్‌లోని అత్యధిక శాతం విద్యార్థులు అత్యంత అమాయకులు. గౌరవనీయ సీజేఐని అవమానించే లేదా నిరసన తెలిపే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి వారు ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకే ఎలాంటి తప్పులేని విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎన్‌రోల్‌మెంట్ నిషేధాన్ని సవరిస్తున్నాం. విద్యార్థులంతా తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్లుగా నమోదు చేసుకోవచ్చు’’ అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది.

నిరసన వెనుక అధ్యాపకులు, బయటి వ్యక్తుల హస్తం?

ఈ వివాదంపై స్పందించిన బీసీఐ, విశ్వవిద్యాలయంలోని కొందరు అధ్యాపకులు, బయటి వ్యక్తులే అమాయకులైన విద్యార్థులను రెచ్చగొట్టి ఈ నిరసనకు పురికొల్పినట్లు నమ్మదగిన వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని లేఖలో పేర్కొంది. కాన్వొకేషన్ వివాదానికి, విద్యార్థుల నిరసనలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను పంపాల్సిందిగా నల్సార్ వైస్-ఛాన్సలర్‌ను బీసీఐ కోరింది. సీజేఐ రాకను వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు, పిటిషన్లు మరియు వాటిపై సంతకాలు చేసిన వారి పూర్తి జాబితాను అందజేయాలని ఆదేశించింది. ఈ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఎవరు సమీకరించారనేది గుర్తించాల్సిందిగా విసిని ఆదేశించింది. వీసీ నివేదిక అందిన తర్వాత ఆగస్టు 19న బీసీఐ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

వివాదానికి అసలు కారణం ఏమిటి?

నల్సార్ యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు 450 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. సీజేఐని ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ వీసీ, రిజిస్ట్రార్, ఇతర లెక్చరర్లకు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల ఈ ప్రవర్తన, నిరసనను క్రమశిక్షణా రాహిత్యంగా భావించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తక్షణ చర్యలకు దిగింది. అయితే ఈ నిషేధాన్ని బీసీఐ కౌన్సిల్ సభ్యులే తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి విచారణ లేకుండా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడం అత్యంత ఏకపక్షం అని బీసీఐ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఛైర్మన్ నిర్ణయాన్ని సవరిస్తూ కౌన్సిల్ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వందలాది మంది న్యాయ విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమైంది.

Follow Us