బ్యాంకుల బాదుడు… సర్వీసు చార్జీల పేరుతో భారీగా వడ్డీంపు … ఐదేళ్లలో రూ.300 కోట్లు వసూలు చేసిన ఎస్‌బీఐ
Service Charges: దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. సామాన్య ప్రజానీకం సహా చిన్నా చితకా...
Service Charges: దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. సామాన్య ప్రజానీకం సహా చిన్నా చితకా ఖాతాదారులందరినీ బ్యాంకులు సర్వీసు చార్జీల పేరుతో అడ్డగోలుగా బాదేస్తున్నాయి. ఈ విషయంలో దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికంటే ముందుండటం గమనార్హం. మరో వైపు సర్వీసు చార్జీల విషయంలో ఆర్బీఐ నిబంధనలను సైతం పాటించడం లేదు. ఉదాహరణకు… ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు చేపట్టిన డెబిట్ లావాదేవీలు నెలలో నాలుగు మించినట్లయితే ప్రతి లావాదేవీపై రూ.17.70 చొప్పున సర్వీసు చార్జీ వసూలు చేస్తోంది.
గడిచిన ఐదేళ్లలో (2015-2020)లో ఎస్‌బీఐ తన 12 కోట్ల మంది బీఎస్‌బీడీఏ ఖాతాదాల నుంచి ఏకంగా రూ.300 కోట్లకు పైగా మొత్తాన్ని సర్వీసు చార్జీల రూపంలో వసూలు చేసినట్లు ఐఐటీ బాంబే చేపట్టిన సర్వీ వెల్లడించింది. ఇందులో రూ.172 కోట్లు ఒక్క 2019-20 కాలంలోనే వసూలు చేయడం విశేషం. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా గత ఐదేళ్లలో సర్వీసు చార్జీల పేరుతో రూ.9.9 కోట్ల వరకు వసూలు చేసింది. మిగిలిన బ్యాంకులకు కూడా ఇదే బాటలోనే సాగాయని సర్వీ తెలిపింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం… ఖాతాదారులు ఖాతాల నుంచి నెలకు నాలుగు సార్లు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి తోడు బ్యాంకు ఏవైనా వాల్యూ యాడెడ్ సేవలు అందిస్తుంటే, వాటిపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదు. 2014 సెప్టెంబర్‌లో ఆర్బీఐ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది ఆయా బ్యాంకుల విచక్షణకు లోబడి ఉంటుందని చిన్న మెలిక పెట్టింది. దీనిని అడ్డుపెట్టుకుని బ్యాంకులు సామాన్య ప్రజానీకం ఉపయోగించే బీఎస్‌బీడీఏ, ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలపై సర్వీసు చార్జీల పేరుతో ప్రత్యేక వడ్డింపులు మోపుతున్నాయి.
డిజిటల్ చెల్లింపులకు దెబ్బ..
కాగా, ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీలు తగ్గించి డిజిటల్ చెల్లింపులు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కరోనా తర్వాత సామాన్యులు కూడా డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు. జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలపై బ్యాంకులు విధిస్తున్న ప్రత్యేక వడ్డీ చార్జీలు ఇందుకు పెద్ద అడ్డంకిగా మారాయని ఐఐటీ బాంబే సర్వే తెలిపింది.
ఇవీ చదవండి: మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందా..! అయితే SBI లెక్కలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే కష్టమే..?