ఉచిత వైద్యం ఉన్నా అప్పులపాలు.. 5 లక్షల పథకం గురించి 66శాతం మందికి తెలియదా..?
లక్షల రూపాయల ఆసుపత్రి బిల్లులు.. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు.. చివరకు నిలువనీడ లేని పరిస్థితి.. ఇదంతా ప్రభుత్వం పథకాలు పెట్టకపోవడం వల్ల కాదు.. ఉన్న పథకాలపై కనీస అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న ఘోరం. ఆయుష్మాన్ భారత్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీమ్‌పై తాజా నివేదికలు చెబుతున్న నగ్న సత్యాలు ఏంటి? మీకున్న ఉచిత ఆరోగ్య హక్కులను ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక చిన్న పట్టణంలో నివసించే కుటుంబంలో ఓ వ్యక్తికి ఆకస్మికంగా శస్త్రచికిత్స అవసరమైంది. చేతిలో చిల్లిగవ్వ లేక, తెలిసిన వడ్డీ వ్యాపారి వద్ద భారీ వడ్డీకి అప్పు తెచ్చి లక్షల రూపాయల ఆసుపత్రి బిల్లు చెల్లించారు. కట్ చేస్తే.. కొన్ని నెలల తర్వాత ఆ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత వైద్యం పొందే అర్హత ఎప్పటినుంచో ఉందని పక్కింటి వ్యక్తి ద్వారా తెలిసింది. కానీ ఏం లాభం? జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇది ఏదో ఒక్క కుటుంబం కథ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా నిత్యం వేలాది పేద, మధ్యతరగతి ఇళ్లలో జరుగుతున్న కఠిన వాస్తవం. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ, సరైన అవగాహన లేకపోవడంతో లక్షలాది మంది ఉచిత వైద్యానికి దూరమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
66 శాతం మందికి పథకమే తెలియదు..
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ , బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. దేశంలో ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులైన పేద ప్రజల్లో దాదాపు 66 శాతం మందికి అసలు ఈ పథకం ఉందన్న విషయమే తెలియదు. అర్హత ఉన్నవారిలో కేవలం 25 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు కార్డులు నమోదు చేసుకున్నారు. పైగా ఈ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఉచితం అయినప్పటికీ అవగాహన లోపంతో ప్రజలు ముందుకు రావడం లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 60 శాతం కుటుంబాలకు ఎలాంటి ఆరోగ్య బీమా లేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కాగితాలకే పరిమితమైన రక్షణ కవచం
2018లో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అర్హత ఉన్న కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఉచిత ఆసుపత్రి చికిత్స అందుతుంది. కవరేజీ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల్లో ఇది ఒకటి. కానీ, ఈ రక్షణ కవచం ఆసుపత్రి అత్యవసర గది (ICU) వరకూ చేరడం లేదు. పథకం గురించి సమాచారం గ్రామాల్లోని సామాన్యులకు తెలిసే సరికొత్త వ్యవస్థ లేకపోవడంతో, ఆపద సమయంలో చేతిలో ఉన్న సొంత ఆస్తులు, పొలాలు అమ్ముకోవాల్సి వస్తోంది.
అర్హత ఎలా తెలుసుకోవాలి?
అత్యవసర పరిస్థితి వచ్చే వరకు ఎదురుచూడకుండా, ప్రతి ఒక్కరూ తమకు ప్రభుత్వ ఉచిత వైద్య పథకాల అర్హత ఉందో లేదో ముందే సరిచూసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
ఆన్‌లైన్ ద్వారా: అధికారిక పోర్టల్ (mera.pmjay.gov.in) లోకి వెళ్లి ఆధార్ లేదా రేషన్ కార్డు వివరాలతో నిమిషాల్లో అర్హత చెక్ చేసుకోవచ్చు.
కామన్ సర్వీస్ సెంటర్లు: సమీపంలోని డిజిటల్ సేవా కేంద్రాల్లో విచారించి ఉచితంగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసుపత్రి హెల్ప్ డెస్క్: నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉండే ‘ఆయుష్మాన్ మిత్ర’ కౌంటర్ల వద్ద కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. అది వచ్చినప్పుడు డాక్యుమెంట్ల కోసం వెతుక్కోవడం కంటే ముందే మనకున్న హక్కులను తెలుసుకోవడం ఉత్తమం. ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు భారీ వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతుంటే, సానుభూతి చూపించడంతో పాటు వారికి అందాల్సిన ఉచిత వైద్య పథకాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది.
