UP Lockdown News: లక్నో సహా 5 నగరాల్లో లాక్‌డౌన్‌కు హైకోర్టు ఆదేశం..యూపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. యూపీ రాజధాని లక్నో సహా మరో నాలుగు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. యూపీ రాజధాని లక్నో సహా మరో నాలుగు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రజల ప్రాణాలు, ఉపాధిని దృష్టిని ఉంచుకుని హైకోర్టు ఆదేశాలను అమలుచేయలేమని యూపీ ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఏప్రిల్ 26 వరకు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలను మూసివేయాలని యూపీ ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్‌పూర్‌లో ఈ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. అయితే లాక్‌డౌన్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టంచేసింది. ఆ మేరకు బ్యాంకులు, ఆస్పత్రులు, ఫార్మసీలు తదితర అత్యవసర సేవలను పనిచేయనున్నాయి.
ముగ్గురి ఉద్యోగుల కంటే ఎక్కువ మంది పనిచేసే అన్ని నిత్యవసర సరకుల దుకాణాలు, వాణిజ్య దుకాణాలను కూడా ఏప్రిల్ 26 వరకు మూసివేయనున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నారు. అన్ని మతపరమైన కార్యక్రమాలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే నిర్ణయించిన వివాహ కార్యక్రమాలను జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో నిర్వహించుకునేందుకు హైకోర్టు వీలు కల్పించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు వివాహ కార్యక్రమాల్లో 25 మంది వరకు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. కోర్టు ఆదేశాల మేరకు వైద్యం, ఎమర్జెన్సీ సేవలు మినహా రోడ్లపై ప్రజల సంచారాన్ని అనుమతించొద్దని హైకోర్టు ఆదేశించింది.
అయితే ప్రజల ప్రాణాలు, ఉపాధిని దృష్టిలో ఉంచుకుని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేమని యూపీ ప్రభుత్వం స్పష్టంచేసింది.