Delhi Pollution: ఢిల్లీలో మళ్లీ వాయు కాలుష్యం తీవ్రతరం.. ఈ వాహనాలకు మాత్రమే అనుమతి!

దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం పరిస్థితి మరోసారి తీవ్రంగా మారింది.

Delhi Pollution: ఢిల్లీలో మళ్లీ వాయు కాలుష్యం తీవ్రతరం.. ఈ వాహనాలకు మాత్రమే అనుమతి!
Delhi Pollution
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 27, 2021 | 10:53 AM

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం పరిస్థితి మరోసారి తీవ్రంగా మారింది. తక్కువ ఉష్ణోగ్రతలు, నెమ్మదైన గాలుల కారణంగా ఏర్పడిన అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 386గా నమోదవడంతో ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి శనివారం ‘తీవ్ర’ కేటగిరీలోనే కొనసాగింది. గాలి వేగం పెరగడం వల్ల నవంబర్ 29 నుంచి గాలి నాణ్యత (ఏక్యూఐ) మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ఉపరితల గాలుల ద్వారా కాలుష్య కారకాలను తగ్గించే ప్రక్రియలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఇది వాయు కాలుష్యంలో స్వల్ప మెరుగవుతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతించనున్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా డిసెంబర్ 3వతేదీ వరకు అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాల రవాణాపై నిషేధం విధించారు.‘‘ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది.వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఢిల్లీ వెలుపల నుంచి అత్యవసరమైన సేవల ట్రక్కులు మినహా ఇతర వాహనాల ప్రవేశం నిలిపివేశాం’’ అని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.అంతకు ముందు నవంబరు 18వతేదీన నిత్యావసర వస్తువులు తీసుకువచ్చేవి మినహా ఇతర రాష్ట్రాల ట్రక్కులను రాజధానిలో ప్రవేశించడాన్ని ఢిల్లీ సర్కారు నిషేధించింది.

మరోవైపు, ఢిల్లీలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు నవంబర్ 29 నుంచి తిరిగి తెరవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఢిల్లీ, ఎన్సీఆర్ లలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించారు. అయితే ప్లంబింగ్ వర్క్, ఇంటీరియర్ డెకరేషన్, విద్యుత్, వడ్రంగి లాంటి కాలుష్య రహిత పనులు చేసుకోవచ్చు. ఢిల్లీలో శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 368 నమోదైందని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది.

అయితే, గాలి వేగం పెరగడం వల్ల నవంబర్ 29 నుంచి ఏక్యూఐ గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఏజెన్సీ ‘సాఫర్’ తెలిపింది. పొరుగున ఉన్న ఫరీదాబాద్ (423), ఘజియాబాద్ (378), గ్రేటర్ నోయిడా (386), గుర్గావ్ (379), నోయిడా (394)లలో గాలి నాణ్యత శనివారం నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం వరకు ఎలాంటి ఉపశమనాన్ని ఆశించడం లేదని గతంలో ‘సాఫర్’ తెలిపింది. స్థానిక ఉద్గారాలు, వాతావరణ పరిస్థితులు గాలి నాణ్యతను నియంత్రించే కీలక కారకాలుగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలావుంటే, AQI సున్నా నుంచి 50 మధ్య ‘మంచిది’, 51 నుంచి 100 మధ్య ‘సంతృప్తికరంగా’, 101 నుంచి 200 మధ్య ‘మితమైన’, 201 నుంచి 300 మధ్య గాలి నాణ్యత ఉంటే ‘కాలుష్యం మించినట్లు కగా, 301 నుంచి 400 మధ్య ఉంటే ‘అతి ఎక్కువగా’, 401 నుంచి 500 మధ్య ‘తీవ్రమైన వాయు కాలుష్యంగా’ పరిగణిస్తారు.

మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం మళ్లీ నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను నిషేధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లో నిర్మాణ కార్యకలాపాలను పునరుద్ధరించాలని కోర్టు బుధవారం ఆదేశించింది. అయతే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం మాట్లాడుతూ దేశ రాజధానిలో నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం కారణంగా నష్టపోయిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 5,000 సహాయం అందిస్తామని ప్రకటించారు. కనీస వేతనాల నష్టాన్ని కూడా తమ ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పారు.

అంతకుముందు, గాలి నాణ్యత మెరుగుపడితే, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం సోమవారం ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గాలి నాణ్యతలో మెరుగుదల దృష్ట్యా నవంబర్ 29 నుండి పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులను పునఃప్రారంభించాలని, ప్రభుత్వ కార్యాలయాలు తెరవాలని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. అత్యవసరమైన సేవలు తప్ప మిగిలిన ట్రక్కుల ప్రవేశంపై నిషేధం డిసెంబర్ 3 వరకు కొనసాగుతుంది. అయితే నవంబర్ 27 నుండి CNG మరియు ఎలక్ట్రిక్ ట్రక్కులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతించబడతాయి. నవంబర్ 13 న, ఢిల్లీ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను నిషేధించింది. దీనితో పాటు, వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మరియు ఆరోగ్యంపై దాని ప్రభావాలను నివారించడానికి ఇంటి నుండి పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వం తన ఉద్యోగులను కోరింది.

Read Also… Hindu Marriage Systems: హిందూ వివాహ వ్యవస్థలో ఎన్నిరకాల పెళ్లిళ్లు ఉన్నాయో తెలుసా? వీటిలో కట్నం ప్రసక్తి ఉందేమో చూడండి..