Operation Trinetra: కొనసాగుతోన్న ఆపరేషన్ త్రినేత్ర.. ఉగ్రవాదుల కోసం ఉధృతమైన ఆర్మీ వేట
జమ్ముకశ్మీర్ లోని రాజోరిలో ఐదుగురు జవాన్లను హత్య చేసిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట ఉధృతమయ్యింది. ఇప్పటి వరకూ ఒక ఉగ్రవాది హతం కాగా... మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రమూకల నుంచి ఆయుధాలు, మందుగుండును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి...
జమ్ముకశ్మీర్ లోని రాజోరిలో ఐదుగురు జవాన్లను హత్య చేసిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట ఉధృతమయ్యింది. ఇప్పటి వరకూ ఒక ఉగ్రవాది హతం కాగా… మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రమూకల నుంచి ఆయుధాలు, మందుగుండును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ జవాన్లతో కలిసి ఆర్మీ ఆపరేషన్ త్రినేత్రను చేపట్టిన విషయం తెలిసిందే.
ఇక రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వయంగా రాజోరి చేరుకున్నారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ త్రినేత్రను ఆయన సమీక్షించారు. రాజోరి ఆర్మీ బేస్ క్యాంప్‌లో జవాన్లతో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. వీర జవాన్లకు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హాతో పాటు ఆర్మీ అధికారులు ఘననివాళి అర్పించారు.
సరిహద్దు లోని రాజోరితో పాటు పూంచ్‌లో ఆర్మీతో పాటు బీఎస్‌ఎఫ్ బలగాలు భారీ కూంబింగ్‌ను చేపట్టాయి. గాలింపు చర్యల్లో హెలికాప్టర్లతో పాటు డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే కూడా రాజోరి చేరుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీన కూడా ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు ఐదుగురు జవాన్లను హత్య చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..