AAP: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. ఆ రెండు రాష్ట్రాలపై కేజ్రీవాల్ పార్టీ ఫోకస్..

Aam Aadmi Party: దేశంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికలు బీజేపీలో ఉత్సాహాన్ని నింపగా.. ఆమ్ ఆద్మీ పార్టీని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

AAP: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. ఆ రెండు రాష్ట్రాలపై కేజ్రీవాల్ పార్టీ ఫోకస్..
Aap
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 12, 2022 | 8:39 PM

Aam Aadmi Party: దేశంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికలు బీజేపీలో ఉత్సాహాన్ని నింపగా.. ఆమ్ ఆద్మీ పార్టీని మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ.. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే.. ఆమ్ ఆద్మీ మాత్రం సైలెంట్‌గా.. ఎవరూ ఊహించని రీతిలో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టి అధికారాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పాలనను గద్దె దింపి.. 92 స్థానాలను కైవసం చేసుకోని అతిపెద్ద పార్టీగా.. దేశంలో ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన పార్టీగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అవతరించింది. అయితే.. ఇదే గెలుపుతో ఆమ్ ఆద్మీ మరో రెండు రాష్ట్రాలపై కన్నేసింది. ఈ ఏడాది చివరన జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలపై ఆప్ దృష్టిసారించింది. బీజేపీ, కాంగ్రెస్ ఆధిపత్య రాష్ట్రాల్లో.. విద్యా, వైద్యం, అభివృద్ధి అనే నినాదంతో పార్టీ మరింత విస్తరించేందుకు ఆప్ ప్రణాళిక రచిస్తోంది.

పంజాబ్ గెలుపుతో జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కేజ్రీవాల్ పార్టీ ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో తన బలాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. సిద్ధాంతపరమైన పార్టీలకు చెక్ పెట్టి.. హిమాచల్‌లో కూడా పంజాబ్‌ను పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే.. ఇది సాధ్యమా..? అసాధ్యమా అనే అంచనాలకన్నా.. తన గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లాలని తహతహలాడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ.. మార్చి 9 వరకు ఇది దేశంలోని అనేక ప్రతిపక్ష పార్టీలలో ఒకటిగా ఉంది. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత భారత ప్రతిపక్ష పార్టీలలో ముందువరుసలో ఉంది. పంజాబ్ గెలుపొందిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కలిగి ఉన్న అతిపెద్ద పార్టీగా ఆప్‌ అవతరించిందని రాజకీయ విశ్లేషకులు హిమాన్షు జోషి పేర్కొన్నారు.

ఈ ఏడాది చివరిలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో జరిగే ఎన్నికల్లో ఆప్ తన బలాన్ని పరీక్షించుకోనుంది. గుజరాత్‌లో AAP 2017 అసెంబ్లీ ఎన్నికల నుంచి క్రియాశీలకంగా ఉంది. అయితే ఆప్ మొదటిసారిగా హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనుంది. (ఇది 2014 లోక్‌సభ ఎన్నికలలో కొంతమంది అభ్యర్థులను నిలబెట్టింది కానీ అంతగా రాణించలేకపోయింది). ఆప్ పంజాబ్‌ను కైవసం చేసుకున్న తర్వాత.. దేశ సరిహద్దు రాష్ట్రమైన హిమాచల్ లో పార్టీ దృష్టి పెట్టడం.. పంజాబ్ మాదిరిగానే ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది ఆసక్తికరంగా ఉంది.

పంజాబ్ ఫలితాల తర్వాత పరిశీలిస్తే.. ఆప్ కూడా కీలక పార్టీలతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీలు తలపడిన రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 3 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అక్కడ ఖాతా తెరువకపోయినా పంజాబ్ గాలి ఖచ్చితంగా ఓట్ల శాతాన్ని పెంచుతుందని అర్ధమవుతుంది. అయితే.. హిమాచల్‌లో AAP ప్రాబల్యం పెరుగుతుందని ప్రస్తుతం అర్ధమవుతోంది. ఇక్కడ కూడా ఓటర్లు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని సమచారం. పంజాబ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కొండ ప్రాంత జిల్లాలైన కాంగ్రా, ఉనా, హమీర్‌పూర్, బిలాస్‌పూర్‌లలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పార్టీ దానిని ఎంతవరకు కాపాడుకుంటుందనేది.. నాయకత్వంపై ఆధారపడి ఉండనుంది. అక్కడ ప్రస్తుతానికి ఆప్‌లో పెద్దగా ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఎవరూ లేరు. ఇటీవలి కాలంలో చేరిన వారు బీజేపీ లేదా కాంగ్రెస్‌లో నుంచి వెళ్లిన కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. 2014 పార్లమెంటరీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేసిన ఇద్దరు ప్రముఖ అభ్యర్థులు మాజీ బిజెపి ఎంపి రాజన్ సుశాంత్, కార్గిల్ అమరవీరుడు విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంత్ బాత్రా ఇద్దరూ పార్టీ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేసి ఆ తర్వాత పార్టీ వెళ్లిపోయారు.

పంజాబ్ ఫలితం ఆప్‌కు మరింత శక్తిగా మార్చింది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 2021 జనవరిలో హిమాచల్ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి.. పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ‘ఢిల్లీ మోడల్’ను ఉదహరణగా పేర్కొంటూ.. సిమ్లాలో హోర్డింగ్‌లు, వార్తాపత్రికల్లో కరపత్రాలు ఉంచి రాష్ట్రంలో సంచలనం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. AAP ప్రచారం సృష్టించడంలో.. BJP తరహాలో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీల నుంచి కొందరు అసంతృప్త నేతలు ఆప్‌లో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలా చేస్తే పార్టీ ఎంతమేర బలపడుతుందోనన్న సందేహాలు కూడా కనిపిస్తున్నాయి.

ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నప్పుడు ఆప్ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, హిమాచల్‌లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారి ప్రధాన సమస్య ఏంటంటే బదిలీలు. రెండు.. పంజాబ్, ఢిల్లీలో మాదిరిగా హిమాచల్‌లోని ప్రజలు వ్యవస్థపై అంతగా అసంతృప్తిగా లేరు. మూడు, అక్షరాస్యత పరంగా హిమాచల్ అగ్రస్థానంలో ఉంది. కావున AAP విద్యారంగాన్ని ఇక్కడ కొంచెం సర్దుబాటు చేయాలి. సిమ్లా మునిసిపల్ ఎన్నికలు జరగనున్న కొద్ది నెలల్లోనే హిమాచల్‌లో AAPకి మొదటి పరీక్ష జరగనుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ విజయాల తర్వాత అధికారంలో ఉన్న బిజెపి కూడా మంచిగా బలపడింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఇటీవల రాష్ట్రంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో గెలిచింది. ఆప్‌కి ఇంత తక్కువ సమయంలో హిమాచల్‌లో ఏలా దూసుకెళ్తుందన్నది ప్రశ్నగా మారింది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి సవాలుగా మారనుంది. దీంతోపాటు రాబోయే రోజుల్లో పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వ పనితీరు కూడా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన అస్త్రంగా మారనుంది.

ఈ విశ్లేషణకు తగినట్లుగానే ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కీలక ప్రకటన చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత.. ఆయన చేసిన ప్రకటన ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ శనివారం తెలిపారు. పంజాబ్ తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వంతు వచ్చిందని.. రాష్ట్రంలో వైద్య, విద్యా వ్యవస్థలు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు జైన్ సిమ్లాలో రోడ్‌షో కూడా నిర్వహించారు.

( పాత్రికేయులు హిమాన్షు జోషి.. )

Also Read:

Uttar Pradesh Elections: అభివృద్ధికే పట్టం కట్టిన యూపీ ఓటర్లు.. సైలెంట్‌గా పని పూర్తి చేసేశారు..!

PUNJ’AAP’: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. కేజ్రీవాల్ పార్టీకి కలిసొచ్చిన ఆరు కీలక అంశాలివే..