ORANGE ALERT: అదిరే ఎండలు.. ఆపై వేడిగాలులు.. ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాతావరణ పరిస్థితులు
నడి వేసవిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాదిన వర్షాలతో ఉపశమనం లభిస్తే, ఉత్తర భారతదేశంలో వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అత్యధిక ఉష్ణోగ్రతలతో మంటెక్కిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 46 - 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరం సైతం సగటున 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తోంది.
నడి వేసవిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాదిన వర్షాలతో ఉపశమనం లభిస్తే, ఉత్తర భారతదేశంలో వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అత్యధిక ఉష్ణోగ్రతలతో మంటెక్కిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 46 – 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరం సైతం సగటున 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తోంది. రానున్న 4-5 రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీలు మించి నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
పశ్చిమ రాజస్థాన్ ఉపరితలంపై యాంటీ-సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని, ఈ కారణంగా గాలి వ్యతిరేక దిశలో వీస్తుందని వాతావరణ శాఖ వివరిస్తోంది. ఫలితంగా భూ వాతావరణం పై ఉన్న పొరల్లో పై పొరల నుంచి కింది పొరల్లోకి గాలి సర్క్యులేషన్ జరక్కుండా నిలిచిపోయిందని, దాంతో భూ వాతావరణం మరింత వేడెక్కుతోందని సూత్రీకరించింది. దీనికితోడు పశ్చిమ దిశ నుంచి పాకిస్తాన్‌లో పొడి వేడి నేలల మీదుగా వీస్తున్న వేడిగాలులు కూడా తోడయ్యాయని పేర్కొంది. ఈ వారంతం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46-47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.
మే 21 వరకు ఉపశమనం లేనట్టే..!
రాజస్థాన్‌లో ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల కారణంగా మే 21 వరకు అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి ఎలాంటి ఉపశమనం లభించదని వాతావరణ శాఖ వెల్లడించింది. జోధ్‌పూర్, బికనీర్ ప్రాంతాల్లో మిగతా రాష్ట్రం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2 – 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించింది. రాజస్థాన్‌లో వడగాలుల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగాయి. ఢిల్లీలో గత రెండు రోజులుగా సగటున 44 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రానున్న మరికొద్ది రోజుల పాటు వాతావరణం పొడిగా, వేడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హీట్ వేవ్ ప్రభావం దక్షిణ రాజస్థాన్‌తో పాటు పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, గుజరాత్ రాష్ట్రాల్లో రానున్న 5-8 రోజుల పాటు ఉంటుందని, మిగతా రాజస్థాన్‌తో పాటు తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్‌లోని గంగా తీరం, ఝార్ఖండ్, బిహార్, ఉత్తర్ కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలతో పాటు ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రానున్న 2-3 రోజుల పాటు హీట్ వేవ్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అసలు హీట్ వేవ్ అంటే ఏంటి?
హీట్ వేవ్ అంటే పేరులోనే వేడి గాలి అని అర్థమవుతోంది. దీర్ఘకాల సగటు ఉష్ణోగ్రతలతో పోల్చినప్పుడు 4.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ పరిస్థితిని ‘హీట్ వేవ్’గా పరిగణిస్తారు. ఇది ఎలా ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తే.. భూ వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులకు తోడు కొన్ని మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం వంటివి భూవాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇవి వాతావరణంలో పెను మార్పులకు కారణమవుతున్నాయి. ఫలితంగా కొద్ది రోజులకు పరిమితం కావాల్సిన హీట్ వేవ్ పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగుతూ జీవరాశి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
భారత్ సహా ఆసియా దేశాల్లో ఏప్రిల్ నెలలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వెనుక కారణం ఇదేనని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్ (WWA) గ్రూపునకు చెందిన 13 మంది శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం దక్షిణాసియా దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అందుకే 2024 ఏప్రిల్ నెల చరిత్రలోనే అత్యంత వేడి నెలగా రికార్డుల్లోకి ఎక్కింది. ఎల్-నినో వంటి సహజసిద్ధ వాతావరణ పరిస్థితులకు తోడు భూతాపం పెరగడం వల్ల భూగోళం మండిపోతోందని శాస్త్రవేత్తలు విశదీకరిస్తున్నారు.
హీట్ వేవ్‌తో కలిగే నష్టాలేంటి..?
హీట్ వేవ్ పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయం కూడా తలెత్తుతుంది. అత్యధిక ఉష్ణోగ్రతల్లో బయట తిరిగినప్పుడు డీహైడ్రేషన్, హీట్ క్రాంప్స్, వడ దెబ్బ (సన్ స్ట్రోక్)కు గురవుతారు. నీరసం, నిస్సత్తువ, కళ్లుతిరగడంతో పాటు తలనొప్పి, వికారం, వాంతులు, కండరాలు పట్టివేయడం వంటి లక్షణాలతో పాటు 102 డిగ్రీల ఫారిన్‌హీట్ జ్వరం కూడా వస్తుంది. ఒకవేళ వడదెబ్బకు గురైతే శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారిన్‌హీట్‌కు చేరుకుంటుంది. అప్పుడు మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనుషులకే ఇలాంటి ప్రమాదం పొంచి ఉంటే.. హీట్ వేవ్ ఇతర జీవరాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.
జీవరాశితో పాటు వ్యవసాయంపై హీట్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పంటలకు తగిన నీరు అందక ఎండిపోతాయి. వ్యవసాయ దిగుబడి తగ్గిపోతుంది. అది ఆహార సంక్షోభానికి దారి తీస్తుంది. మరోవైపు హీట్ వేవ్ పరిస్థితుల్లో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాల్సి వస్తుంది. లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులపై దీని ప్రభావం ఉంటుంది. హీట్ వేవ్ ప్రభావానికి గురయ్యేవారిలో నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, రైతులు, మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. వేడి గాలులతో వారికి ఆరోగ్యపరంగానే కాదు, ఉపాధి సైతం దెబ్బతీస్తూ రెండు రకాలుగా నష్టం చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..