Property Dispute: అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం.. 60 యేళ్ల వృద్ధుడిని చావగొట్టిన సోదరుడు
భూవివాదంతో అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు పడ్డారు కూడా. బుధవారం నాడు మరోమారు గొడవపడగా 60 యేళ్ల సోదరుడిని నిందితుడు చావగొట్టాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల సుందర్‌బన్ జిల్లా హరుద్‌పాయింట్ కోస్టల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది...
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: భూవివాదంతో అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు పడ్డారు కూడా. బుధవారం నాడు మరోమారు గొడవపడగా 60 యేళ్ల సోదరుడిని నిందితుడు చావగొట్టాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల సుందర్‌బన్ జిల్లా హరుద్‌పాయింట్ కోస్టల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. మృతుడిని మోతీలాల్ దాస్ (60)గా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు మోహన్‌లాల్ దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, స్థానిక వర్గాల కథనం ప్రకారం..
దాస్ కుటుంబానికి చెందిన భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి. ఇతరుల జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించడంతో గొడవలు సర్దుమనిగేవి. బుధవారం మధ్యాహ్నం మరోమారు ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం ముదిరింది. అయితే ఇరుగుపొరుగు వారు వారి కుటుంబ వివాదమని భావించి తొలుత పట్టించుకోలేదు. ఈ క్రమంలో మోతీలాల్ఇంటి నుంచి బయటకు రాగానే సోదరుడు దాడికి పాల్పడ్డారు. అతని సోదరుడు మోతీలాల్‌ను రోడ్డు పక్కన పడేసి కొట్టడం ప్రారంభించాడు. కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా.. రక్తపుమడుగులో ఉన్న మోతీలాల్‌ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి విషమించడంతో డైమండ్ హార్బర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మోతీలాల్ మృతి చెందాడు. ఈ హఠాత్ పరిణామానికి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. దీనిపై కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం ఉంది. అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. అయితే పరిస్థితి ఇంతగా దిగజారుతుందని అనుకోలేదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు పోలీసులను వేడుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో మోహన్‌లాల్‌తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.