Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీజేపీ భారీ స్కెచ్.. ఇక రంగంలోకి అమిత్ షా..!

దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తుఫానులా విరుచుకుపడాలని కమలనాథులు నిర్ణయించారు. డిసెంబర్ 22న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనుండగా.. అదే రోజు ఎన్నికల వ్యూహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంస్థాగత సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే హర్యానాలోని కురుక్షేత్రలో ప్రారంభమయ్యే గీతా మహోత్సవ్‌లో పాల్గొనేందుకు అమిత్ షా వెళ్లనున్నారు.

Amit Shah: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీజేపీ భారీ స్కెచ్.. ఇక రంగంలోకి అమిత్ షా..!
Home Minister Amit Shah (File Photo)
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 21, 2023 | 12:01 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియడమే ఆలస్యం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వాన్ని షురూ చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తుఫానులా విరుచుకుపడాలని కమలనాథులు నిర్ణయించారు. డిసెంబర్ 22న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనుండగా.. అదే రోజు ఎన్నికల వ్యూహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంస్థాగత సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే హర్యానాలోని కురుక్షేత్రలో ప్రారంభమయ్యే గీతా మహోత్సవ్‌లో పాల్గొనేందుకు అమిత్ షా వెళ్లనున్నారు. తొలుత ఈ మహోత్సవ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయనకు వీలుపడకపోవడంతో అమిత్ షా పాల్గొంటున్నారు.

డిసెంబర్ 23న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు జాతీయ పదాధికారులు, పార్టీ రాష్ట్ర విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో రోజంతా జరిగే కీలక సమావేశంలో అమిత్ షా ప్రసంగించి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు డిసెంబర్ 22 మధ్యాహ్నం మొదలై 23 సాయంత్రం వరకు ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార వ్యూహాలను ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. ప్రతి ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి పోరాడాల్సిందేనని కమలనాథులు పార్టీ శ్రేణులకు చెబుతున్నాయి. అధికారం సాధిస్తేనే ఏదైనా చేయగలమని, ఆ విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని హితబోధ చేయనున్నారు. అధికారం కోసం అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ప్రత్యర్థులను వ్యూహాలను తిప్పికొట్టగలిగే చతురత ప్రదర్శించాలని పిలుపునివ్వనున్నారు.

డిసెంబర్ 24న హోంమంత్రి అమిత్ షా ఒకరోజు పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనున్నారు. ఆ రోజంతా బెంగాల్ బీజేపీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. బెంగాల్‌లోని అన్ని డివిజన్‌ల నుండి బీజేపీ నాయకులను కోల్‌కతాకు పిలిపించి, క్షేత్రస్థాయి స్థితిగతులను తెలుసుకుంటారు. అలాగే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసి వారికి తదుపరి కార్యాచరణ అందజేస్తారు.

డిసెంబరు 28న షా తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలోనూ అమిత్ షా బహిరంగ సభ, బహిరంగ కార్యక్రమాలు ఏవీ ఏర్పాటు చేసుకోలేదు. కానీ హైదరాబాద్‌లో హోం మంత్రి తెలంగాణ బీజేపీ నేతలతో రోజంతా సమావేశమై అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లోతుగా విశ్లేషించి, బలాలు – బలహీనతలను అంచనా వేయనున్నారు. తద్వారా లోక్‌సభ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దూకి తెలంగాణ రాష్ట్రం నుంచి డబుల్ డిజిట్ సాధించాలని దిశానిర్దేశం చేయనున్నారు.

డిసెంబర్ 30న అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తారు. అక్కడే సంస్థాగత సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టార్గెట్ సౌత్‌లో భాగంగా ఈ రాష్ట్రంలో అమలుచేయాల్సిన వ్యూహాల గురించి షా అక్కడి పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే తమిళ ప్రజలను ఆకర్షించేందుకు కాశీ-తమిళ్ సంగమం సహా చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా బీజేపీ విస్తరణకు అవకాశాలు ఉన్నాయని కమలనాథులు భావిస్తున్నారు. సుదీర్ఘకాలంగా అక్కడి ప్రజలు జాతీయ పార్టీలను దూరం పెడుతూ వస్తున్నప్పటికీ.. ఈసారి లోక్‌సభ ఎన్నికల వరకైనా వారిని ఆకట్టుకుని బీజేపీ ప్రాతినిథ్యాన్ని ఆ రాష్ట్రం నుంచి కల్పించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఆ తర్వాత డిసెంబర్ 31న హోంమంత్రి తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లనున్నారు. అక్కడ కూడా ఎన్నికల సన్నద్ధతపై సంస్థాగత సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తన సొంత లోక్‌సభ నియోజకవర్గం గాంధీనగర్‌లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారు.

కొత్త సంవత్సరం వచ్చేలోగా అమిత్ షా రాజస్థాన్ పర్యటన కూడా చేపట్టే అవకాశం ఉంది. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ఏర్పడే అలసత్వాన్ని దూరం చేసేలా కార్యకర్తలకు కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. సాధించిన విజయం ఇచ్చిన ఊపుతో మరింత ఉత్సాహంగా లోక్‌సభ ఎన్నికల కోసం ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణులను పరుగులు పెట్టించనున్నారు. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 26 స్థానాలను బీజేపీ, తన మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఈసారి కూడా ఆ రికార్డును సమం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించడానికి హోంమంత్రి డిసెంబర్ – జనవరి నెలల్లో దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలను సందర్శించనున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు గడిపి సంస్థాగతంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆయా రాష్ట్రాల విభాగాలకు సీట్ల టార్గెట్ విధించి, ఆ దిశగా అనుక్షణం పనిచేయాలని సూచించనున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల మాదిరిగానే ఈసారి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే… అంటే ఫిబ్రవరిలోనే బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కమలనాథులు భావిస్తున్నారు. తద్వారా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి ప్రచారానికి ఎక్కువ సమయం లభిస్తుందని యోచిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ వ్యూహం ఫలించింది. అందుకే షెడ్యూల్ కంటే ముందే కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారవడం ఖాయంగా కనిపిస్తోంది.