Organ Donation: తాను మరణిస్తూ ఐదుగురి జీవితంలో వెలుగులు నింపిన ఆరేళ్ళ చిన్నారి..
నోయిడాలో రోలి ప్రజాపతి అనే 6 ఏళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. చిన్నారి తల్లిదండ్రులు, తమ కుమార్తె అవయవాలను దానం చేయడంతో ఐదుగురు ప్రాణాలను పాడగలిగారు. న్యూఢిల్లీలోని AIIMS చరిత్రలో అతి పిన్న వయస్కురాలిగా అవయవ దాతగా నిలిచింది.
Organ Donation: ప్రతి జీవికి మరణం తథ్యం.. కొందరు మాత్రం మరణించీ చిరంజీవులు.. కొందరు తాము మరణిస్తూ.. తమ అవయవాలను దానం చేసి.. మరికొందరి జీవితంలో వెలుగులు నింపుతారు. తాజాగా ఓ ఆరేళ్ళ చిన్నారి.. తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అంతేకాదు.. ఎయిమ్స్ (AIIMS)చరిత్రలో ఆర్గాన్స్ డొనేషన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా(girl organ donation) నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..
నోయిడాలో రోలి ప్రజాపతి అనే 6 ఏళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. రోలీ తలపై కాల్పులు జరపడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత కారణంగా రోలీ వెంటనే కోమాలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆ చిన్నారిని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు రిఫర్ చేశారు. చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలం కావడంతో వైద్యులు చిన్నారిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
రోలీ అనే ఆరున్నరేళ్ల బాలిక ఏప్రిల్ 27న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకుని వచ్చారని.. సీనియర్ AIIMS న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు. చిన్నారి తలకు తుపాకీ గాయం ఉంది. మెదడులో బుల్లెట్ చిక్కుకుంది. మెదడు పూర్తిగా దెబ్బతింది. ఆస్పత్రికి చేరే సమయానికి రోలీ దాదాపు బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉంది. దీంతో మేము కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు.
“రోలీ బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించిన అనంతరం వైద్యుల బృందం తల్లిదండ్రులతో కూర్చుని అవయవ దానం గురించి మాట్లాడిందని తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసామని.. అవయవదానం గురించి.. ఇతర పిల్లల ప్రాణాలను రక్షించడానికి ఉన్న అవకాశం గురించి చెప్పామని అన్నారు. రోలీ తల్లిదండ్రులకు అవయవ దానం గురించి పూర్తిగా అవగాహన లేకున్నా.. ఇతర చిన్నారుల ప్రాణాలు నిలబడతాయన్న విషయాన్ని అర్థం చేసుకున్నారని డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు.
తమ చిన్నారి అవయవాలను దానం చేసి ఐదుగురి ప్రాణాలను కాపాడిన రోలీ తల్లిదండ్రులను ఎయిమ్స్ వైద్యుడు అభినందించారు. కాలేయం, మూత్రపిండాలు, కార్నియాలు, గుండె కవాటం రెండూ విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. ఈ అవయవ దానంతో.. రోలీ ఢిల్లీలోని ఎయిమ్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన దాతగా నిలిచిందని తెలిపారు.
తమ కూతురు ఎలాగా బతికే ఛాన్స్ లేదు.. కనుక ఇతరుల ప్రాణాలను రక్షించగలదని ఆలోచించమని.. తమ చిన్నారి అవయవాలలో ఇతరుల నవ్వడానికి కారణమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తన కుమార్తె తమను విడిచిపెట్టిందని.. అయితే ఇతరుల ప్రాణాలను రక్షించగలిగిందని ఉద్వేగభరితంగా రోలీ తల్లి పూనమ్ దేవి పేర్కొన్నారు.