IAS Ashok Khemka: 34 ఏళ్లలో 57 సార్లు బదిలీలతో సంచలనం.. సీనియర్ IAS అశోక్ ఖేమ్కా పదవీ విరమణ నేడే!
34 యేళ్ల తన సర్వీస్‌లో 57 బదిలీలతో విశేష గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా దేశవాసులందరికీ సుచరిచితమే. ప్రస్తుతం హరియాణా రవాణా శాఖ విభాగం అడిషన్ చీఫ్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న అశోక్ ఖేమ్కా.. ఎట్టకేలకు తన కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. ఆయన బుధవారం (ఏప్రిల్ 30) పదవీ విరమణ పొందుతున్నారు..

దాదాపు 34 సంవత్సరాల తన సర్వీస్‌లో 57 బదిలీలతో విశేష గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా దేశవాసులందరికీ సుచరిచితమే. అశోక్ ఖేమ్కా ఎట్టకేలకు తన కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. ప్రస్తుతం హరియాణా రవాణా శాఖ విభాగం అడిషన్ చీఫ్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఖేమ్కా బుధవారం (ఏప్రిల్ 30) పదవీ విరమణ పొందనున్నారు. ఆయన 2024 డిసెంబర్‌లో ఈ పదవిలో చేరారు. ఈ పదవిలో ఆయన 4 నెలలు మాత్రమే ఉన్నారు. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఖేమ్కా హర్యానా కేడర్ అధికారి. తన 34 ఏళ్ల కెరీర్‌లో ఏకంగా 57 సార్లు బదిలీ అయ్యారు. సగటున ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆయన బదిలీ అవుతుండటం విశేషం. బహుశా హర్యానాలో ఏ అధికారికీ చేయని అత్యధిక బదిలీలు ఇదే.
2012లో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన గురుగ్రామ్ భూ ఒప్పందం మ్యుటేషన్‌ను రద్దుతో జాతీయ స్థాయిలో ఖేమ్కా పేరు ఒక్కసారిగా మోగిపోయింది. తన సర్వీస్‌లో తొలిసారి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రవాణా కమిషనర్‌గా ఉన్న ఖేమ్కాని కేవలం నాలుగు నెలలకే బదిలీ చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత గత డిసెంబర్‌లో రవాణా శాఖకు తిరిగి అధికారిగా వచ్చారు. గత 12 సంవత్సరాలలో ఖేమ్కాను ఎక్కువగా ‘లో-ప్రొఫైల్’ గా పరిగణించబడే విభాగాలకు అధికంగా కేటాయించారు. ఒక్క ఆర్కైవ్స్ విభాగానికే 2013లో ఒకసారి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు, బీజేపీ పాలనలో నాలుగుసార్లు పోస్టింగ్ పొందారు. అందులో మొదట డైరెక్టర్ జనరల్‌గా, తరువాత ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.
2023లో ఖేమ్కా రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి తనను బదిలీ చేయాలని కోరుతూ ఖట్టర్‌కు లేఖ రాశారు. అందులో అవినీతిని నిర్మూలించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. జనవరి 23, 2023 నాటి తన లేఖలో బ్యూరోక్రసీలో పక్షపాత పని పంపిణీని ఆయన దయ్యబట్టారు. కొంతమంది అధికారులపై అధిక భారం ఉందని, తనతో సహా ఇతర అధికారులకు ఆర్కైవ్స్ వంటి పెద్దగా పనిలేని విభాగాలలో కేటాయించడాన్ని తప్పుబట్టారు. కనీసం తన సర్వీస్ చివరి రోజుల్లోనైనా అవినీతిని రూపుమాపాలనే తన కలను నెరవేర్చుకోవడానికి విజిలెన్స్ విభాగానికి తనను బదిలీ చేయాలని కోరారు. తనకు అవకాశం ఇస్తే, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని, ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తానని అన్నారు. అయితే రెండేళ్ల క్రితం ఐఏఎస్ అధికారుల పదోన్నతుల తర్వాత ఖేమ్కా ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో..’భారత ప్రభుత్వానికి కొత్తగా కార్యదర్శులుగా నియమితులైన నా బ్యాచ్‌మేట్‌లకు అభినందనలు! ఇది ఆనందించవల్సిన సందర్భమే అయినప్పటికీ, మనలో ఒకరు వెనుకబడిపోయారనే నిరాశను కూడా మిగిల్చింది’అని పేర్కొన్నారు. నిటారుగా ఉన్న చెట్లనే ముందు నరికివేస్తారు. ఎటువంటి విచారం లేదు. కొత్త సంకల్పంతో పట్టుదలతో ఉంటాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా 1965లో కోల్‌కతాలో జన్మించిన ఖేమ్కా.. ఐఐటీ ఖరగ్‌పూర్ (1988)లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) నుండి కంప్యూటర్ సైన్స్‌లో PhD, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లతో MBA పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి LLB కూడా పూర్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




