
కుటుంబంలో తల్లీ లేదా తండ్రి అకస్మాత్తుగా చనిపోతే ఆ బాధ వర్ణించలేనిది. అయితే ఇటీవల చత్తీస్ గఢ్ లో మహిళా ఠానాలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి చనిపోవడంతో స్కూల్లో యూకేజీ చదువుతున్న తన కొడుకును చైల్డ్ కానిస్టేబుల్ గా నియమించారు. వివరాల్లోకి వెళ్తే చతీస్ గఢ్ సర్గుజా లోని రాజ్ కుమార్ రాజ్వాడే అనే వ్యక్తి పోలీస్ అధికారిగా పనిచేస్తు తన భార్య కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రాజ్ కుమార్ మృతి చెందాడు. దీంతో వాళ్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆ తర్వాత రాజ్ కుమార్ కుమారుడైన నమన్ రాజ్వాడే (5) ను చైల్డ్ కానిస్టేబుల్ గా నియామకం చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్ల మార్గదర్శకాల ప్రకారం ఒక వేళ పోలీసు అధికారి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబంలో 18 ఏళ్ల లోపు ఉన్నవారికి కానిస్టేబుల్ గా అవకాశం కల్పిస్తారు. ఈ నిబంధన ప్రకారమే పాఠశాలలో యూకేజీ చదువుతున్న నమన్ ను చైల్డ్ కానిస్టేబుల్ గా నియమించారు. ఈ మేరకు సుపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ భవాని గుప్త అడ్మినిస్ట్రేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మార్గదర్శకాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాజ్ కుమార్ భార్య నీతు రాజ్వాడే తన భర్త చనిపోయినందుకు బాధగా ఉందని.. కాని తన కుమారుడు చైల్డ్ కానిస్టేబుల్ కావడంతో సంతోషంగా ఉందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..