IRCTC Food: రోజుకి 16 లక్షల రైలు ప్రయాణికులకు నాణ్యత కలిగిన భోజనాలు పంపిణీ చేస్తున్నాం.. రైల్వే మంత్రి వైష్ణవ్
రైల్వే నెట్‌వర్స్‌లో నిత్యం రైలు ప్రయాణికులకు సగటున 16 లక్షల నాణ్యత కలిగిన భోజనాలు సక్రమంగా అందిస్తున్నామని, నాణ్యతలో ఎలాంటి రాజీ లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు..

న్యూఢిల్లీ, మార్చి 27: దేశ వ్యాప్తంగా రైల్వే నెట్‌వర్స్‌లో రైలు ప్రయాణికులకు రోజుకు సగటున 16 లక్షల భోజనాలు సక్రమంగా అందిస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఆయన వెల్లడించారు. ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందన్న వదంతులపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు దాఖలు చేసిన ఫిర్యాదులపై పార్లమెంటు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రైల్వే మంత్రి వైష్ణవ్ సమాధానం చెబుతూ.. ‘రైల్వే నెట్‌వర్క్‌లో రోజుకు సగటున 16 లక్షల భోజనాలు అందిస్తున్నాం. ప్రయాణీకులకు ఇంత పెద్ద మొత్తంలో భోజనాలు ఎలాంటి అంతరాయం లేకుండా అందించడానికి భారతీయ రైల్వే నిత్యం కృషి చేస్తుంది. ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రి వివరించారు.
రైళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను మెరుగుపరచాలనే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ నియమించబడిన బేస్ కిచెన్ల నుంచి మాత్రమే రైళ్లలో భోజనం సరఫరా చేయాలనే నిబంధనకు అనుగుణంగా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. రైళ్ల సర్వీస్ లొకేషన్‌లను మ్యాపింగ్ చేయడానికి, బేస్ కిచెన్‌లను ప్రారంభించడం కోసం గుర్తించబడిన ప్రదేశాలతో పాటు రూట్ వారీగా రైళ్ల క్లస్టర్‌లను ఏర్పాటు చేయడానికి, తగినంత లాజిస్టిక్స్, సర్వీస్ మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన వర్కర్లను నియమించాలని నిబంధనల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఆ మేరకే రైళ్ల క్లస్టర్‌లకు కాంట్రాక్టులను ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆహార పంపిణీ, ఎండ్-టు-ఎండ్ జవాబుదారీతనం ఆన్‌బోర్డ్‌లో అందిచడం తమ ప్రాధాన్యతని వైష్ణవ్ అన్నారు.
ప్రస్తుత విధాన మార్గదర్శకాల ప్రకారంగానే IRCTC రైళ్ల క్లస్టర్ల టెండర్లను చేపట్టిందని అన్నారు. మొత్తం 653 బిడ్‌లు రాగా, అందులో క్లస్టర్లు రెండు గ్రూపులుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రీమియం ప్రీపెయిడ్ రైళ్లు, ప్యాంట్రీ కార్లతో కూడిన మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను ‘క్లస్టర్ A’, ప్యాంట్రీ కార్లతో కూడిన మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ట్రైన్ సైడ్ వెండింగ్ (TSV) ఉన్న రైళ్లు కలిగిన ‘క్లస్టర్ B’గా పేర్కొన్నారు. వీటిల్లో బేస్ కిచెన్‌లోని ఒకే పాయింట్ సోర్స్ నుంచి రైలు ప్యాసింజర్లకు భోజన సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అధిక-నాణ్యత కలిగిన ఆహారం, ప్యాకేజింగ్ మెటీరియల్ కలిగిన ప్రామాణిక వంటగది పరికరాలు వీటిల్లో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఇలా మార్చి 15 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 717 బేస్ కిచెన్‌లు ప్రారంభించామన్నారు. రైల్వే సర్వీసులపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు జరిపి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి వైష్ణవ్ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.