బాబోయ్.. బబుల్‌గమ్ నమిలితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఎగిరి గంతేస్తారండోయ్..
చాలా మందికి ఎప్పుడూ చూయింగ్ గమ్ నమలడం అలవాటుగా ఉంటుంది. కొందరు ఈ అలవాటు మంచిదేనని భావిస్తారు. మరికొందరు తప్పుగా భావిస్తారు. ముఖ్యంగా వ్యాయామాల సమయంలో ఎక్కువ మంది చూయింగ్ గమ్ నములుతారు. అయితే, చూయింగ్ గమ్ నమలటం మంచిదేనా..?వ్యాయామాల సమయంలో చూయింగ్ గమ్ నమలాలా వద్దా..? అది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

గమ్ నమలడం వల్ల ఏమవుతుంది…?1 రూపాయి చూయింగ్ గమ్ మీ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చూయింగ్ గమ్ నమలడం ఎంతవరకు సరైనదో, వ్యాయామం చేసేటప్పుడు మీరు గమ్ నమలాలా వద్దా..? అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఆరోగ్య నిపుణుడు వివరిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే…
నిపుణులు ఏమంటున్నారు?
ఇక్కడ వీడియోలో పోషకాహార నిపుణుడు హీరవ్ మెహతా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఇక్కడ కేవలం 1 రూపాయి చూయింగ్ గమ్ నమలడం వల్ల మీ దృష్టి, ఒత్తిడి స్థాయి, వ్యాయామ నాణ్యతపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు.
ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే…
మనం చూయింగ్ గమ్ నమిలినప్పుడు మన మెదడు, మనం రిలాక్సేషన్ మోడ్‌లో లేదా తినే మోడ్‌లో ఉన్నామని భావిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ చిన్న చర్య ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. ఫోకస్ హార్మోన్లను లేదా మంచి మూడ్ కెమికల్స్‌ను పెంచుతుంది. తత్ఫలితంగా ఎక్కువసేపు చేసే వ్యాయామాలు కూడా సులభంగా అనిపిస్తాయి. చూయింగ్ గమ్ కూడా వారి ఆందోళనను తగ్గిస్తుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు.
కొన్నిసార్లు వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు అకస్మాత్తుగా ఆకలిగా అనిపించవచ్చు.. లేదా ఏదైనా తీపి తినాలని అనిపించవచ్చు. అలాంటి సమయంలో చూయింగ్ గమ్ మీ నోటిని బిజీగా ఉంచుతుంది. ఈ యాదృచ్ఛిక కోరికలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది మీ వ్యాయామంపై దృష్టి పెట్టడానికి, మధ్యలో అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా ఉండటానికి మీకు సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఇంకా చూయింగ్ గమ్ నోట్లో బ్యాక్టీరియాను పెరగకుండా చేసి.. దంతాలను రక్షిస్తుందని తెలిపారు.
View this post on Instagram
నోరు పొడిబార కుండా ఉంచుతుంది..
చాలా మందికి ఎక్కువసేపు వ్యాయామం చేస్తున్నప్పుడు నోరు పొడిబారుతుంది. వారికి తరచుగా దాహం వేస్తుంది. కానీ, నీళ్లు తాగడం వల్ల కడుపులో భారం ఏర్పడుతుంది. చూయింగ్ గమ్ నమలడం వల్ల లాలాజల ఉత్పత్తిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. ఇది నోరు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. వ్యాయామాల సమయంలో అసౌకర్యాన్ని నివారిస్తుంది.
మనసు చురుకుగా ఉంటుంది…
వీటన్నింటితో పాటు చూయింగ్ గమ్ మిమ్మల్ని అలర్ట్‌గా ఉంచుతుంది. సోమరితనం, బద్ధకాన్ని తగ్గిస్తుంది. భయం, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటన్నింటికి కారణమైన అర్డినలిన్ హార్మోన్‌ను అడ్డుకుంటుందని , బబుల్ గమ్ నమలడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ జరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడా చెబుతున్నారు. అయితే, మీరు రోజూ గమ్ తినాలనుకుంటే.. చక్కెర లేని గమ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఎక్కువసేపు చూయింగ్ గమ్ నమలడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ దవడ కండరాలను ఒత్తిడికి గురి చేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




