Kids Health: పిల్లలు మట్టి, బలపం, సుద్ద తింటున్నారా! అలా ఎందుకు చేస్తారో తెలుసా
ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు చేతికి దొరికిన ప్రతి వస్తువునూ నోట్లో పెట్టుకోవడం సహజమే. కానీ కొందరు పిల్లలు మట్టి, బలపం, సుద్ద ముక్కలు, గోడ రంగు, పచ్చి బియ్యం, బొగ్గు ముక్కలు కూడా తింటుంటారు. తల్లిదండ్రులు ఎంతగా అడ్డుకున్నా ఈ అలవాటు తగ్గకపోతే ..

ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు చేతికి దొరికిన ప్రతి వస్తువునూ నోట్లో పెట్టుకోవడం సహజమే. కానీ కొందరు పిల్లలు మట్టి, బలపం, సుద్ద ముక్కలు, గోడ రంగు, పచ్చి బియ్యం, బొగ్గు ముక్కలు కూడా తింటుంటారు. తల్లిదండ్రులు ఎంతగా అడ్డుకున్నా ఈ అలవాటు తగ్గకపోతే ఆందోళన చెందాల్సిందే. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘పైకా (Pica)’ అంటారు.
నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పోషక విలువ లేని, ఆహారం కాని పదార్థాలను నిరంతరం తినే పరిస్థితినే పైకా అంటారు. బలపం, చాక్‌పీస్, మట్టి, జుట్టు, పచ్చి బియ్యం, గోడ రంగు ముక్కలు ఇలాంటివన్నీ ఈ జాబితాలోకి వస్తాయి. తీవ్రమైన మానసిక రుగ్మతల్లో మలమూత్రాలు కూడా తినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలేంటో తెలుసుకుందాం..
పిల్లల్లో ఐరన్, జింక్, కాల్షియం లోపంతో ఈ సమస్య రావచ్చు. రక్తహీనత, పొట్టలో నట్టల సమస్య, ఒత్తిడి, ఆందోళన, ఓసీడీ వంటి మానసిక స్థితుల వల్ల కూడా పైకా సమస్య ఏర్పడవచ్చు. గర్భిణీల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో ఎక్కువగా కడుపు నొప్పి, వాంతులు, మలబద్ధకం, ఉబ్బరం, పొట్టలో నట్టలు పెరగడం, రక్తంలో లెడ్ స్థాయిలు పెరగడం, పోషకాహార లోపం మరింత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
భారతదేశంలో దాదాపు 30 శాతం పిల్లలకు పైకా సమస్య ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో 75–80 శాతం మందికి కేవలం నట్టల నివారణ మందులు + ఐరన్ సప్లిమెంట్లు ఇస్తేనే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మిగిలిన 20–25 శాతం మందికి మాత్రమే మానసిక చికిత్స అవసరం పడుతుంది.

Eating Chalkpiece
ఏం చేయాలి..
- వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.
- రక్త పరీక్షల ద్వారా ఐరన్, హిమోగ్లోబిన్, జింక్, లెడ్ స్థాయిలు చెక్ చేయించాలి.
- నట్టలు ఉంటే డాక్టర్ సలహాతో డీ-వార్మింగ్ మందులు వేయించాలి.
- ఐరన్, జింక్, విటమిన్ సప్లిమెంట్లు డాక్టర్ సలహాతో వేయాలి.
- పిల్లలకు అర్థమయ్యే భాషలో ‘ఇవి తినకూడదు, ఇవి మనకు హాని చేస్తాయి’ అని రోజూ చెప్పాలి.
- ఆట వస్తువులు, రంగురంగుల పండ్లు, కూరగాయలతో వారి దృష్టిని మళ్లించాలి.
పిల్లలు బలపం, చాక్‌పీస్, మట్టి, జుట్టు, పచ్చి బియ్యం, గోడ రంగు ముక్కలు ఇలాంటివన్నీ తింటుంటే తల్లిదండ్రులు ఒత్తిడి చెందకూడదు, ఏడిపించకూడదు, కొట్టకూడదు. ఓపిగ్గా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే ఈ అలవాటు 2–3 నెలల్లోనే పూర్తిగా మాయమవుతుంది. పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, పోషకాహారం సమృద్ధిగా ఇస్తే… పైకా సమస్య ఎప్పటికీ దరి చేరదు!
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.




