పాము కాటు వేస్తే భయపడొద్దు.. వెంటనే ఇలా చేయండి..! ఎవరికీ తెలియని నిజాలివి..!
వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయట కనిపించడంతోపాటు ఇంటి పరిసరాల్లోకి కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు పాము కాటు ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అప్పుడు భయపడకుండా వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంతో కీలకం. పాము కాటు సమయంలో చేయాల్సిన అత్యవసర చర్యల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

పాము కాటు వేస్తే వెంటనే ఏం చేయాలి..? వర్షాకాలంలో పాములు ఇంట్లోకి రావడం, పొలాల్లో కనిపించడం కామనే. అయితే పాము కాటేస్తే ఏం చేయాలి..? అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ప్రాణాలను కాపాడే ముఖ్యమైన సూచనల గురించి తెలుసుకోవడం అవసరం.
భయపడకుండా ఉండటం
పాము కాటేయగానే చాలా మంది కంగారు పడతారు. అయితే భయం వల్ల గుండె వేగంగా కొట్టుకొని.. విషం శరీరంలో త్వరగా పాకే అవకాశం ఉంటుంది. బాధితుడు ఎంత ప్రశాంతంగా ఉంటే.. అంత మంచిది. కాబట్టి ముందు బాధితుడిని కూల్ గా ఉండేలా ప్రయత్నించండి. వీలైతే కాటేసిన పామును గుర్తుపట్టండి.. దాని రంగు, సైజు, తల ఆకారం లాంటివి గమనిస్తే డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇచ్చేటప్పుడు అది ఉపయోగపడుతుంది.
కదలకుండా ఉండటం
విషం శరీరంలో వేగంగా పాకకుండా ఉండాలంటే కాటు వేసిన భాగాన్ని స్థిరంగా ఉంచాలి. చేతికి లేదా కాలికి పాము కాటు వేసినట్లయితే.. ఆ భాగాన్ని గుండె స్థాయికి కొద్దిగా క్రింద ఉంచాలి. కాటు వేసిన చోట మెత్తని బట్టతో కట్టి ఆ భాగాన్ని కదలకుండా చూసుకోవాలి.
కాటు వేసిన భాగాన్ని కడగకండి
చాలా మంది కాటు వేసిన చోట నీళ్లతో కడగడం లేదా సబ్బుతో రుద్దడం చేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. ఇలా చేయడం వల్ల డాక్టర్లు పాము రకం గుర్తించడంలో ఇబ్బంది పడతారు. అంతేకాకుండా విషం చర్మంపై ఎలా ఉన్నదీ వారికి తెలిసే అవకాశం పోతుంది.
గట్టిగా కట్టడం మంచిది కాదు
కాటు మీద గట్టిగా కట్టడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇది కణజాలాలకు నష్టం కలిగించి.. ఆ అవయవాన్ని కోల్పోయే పరిస్థితికి దారి తీస్తుంది. అందుకే తేలికగా మాత్రమే కట్టి ఉంచాలి.
విషాన్ని పీల్చడం చాలా ప్రమాదకరం
చాలా మంది పాత నమ్మకాన్ని నమ్మి విషాన్ని నోటితో పీల్చే ప్రయత్నం చేస్తారు. ఇది పూర్తిగా తప్పు. దీని వల్ల పీల్చే వ్యక్తికి ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా నోట్లో గాయాలు ఉన్నా.. విషం అతని శరీరంలోకి చేరే అవకాశం ఉంది.
ఆస్పత్రికి వెంటనే వెళ్లాల్సిందే..
పాము కాటు ట్రీట్ మెంట్ లో లేట్ చేయడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే బాధితుడిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించాలి. ప్రయాణ సమయంలో బాధితుడిని కదలకుండా ఉంచడానికి ప్రయత్నించండి.
ఆ చిట్కాలను నమ్మకండి
పాముకాటుకు కొన్ని దేశీ చికిత్సలు అని ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇవి శాస్త్రీయ ఆధారాలు లేనివి కావడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీస్తాయి. పాము కాటేయగానే ఒక్కటే సరైన పరిష్కారం.. డాక్టర్ దగ్గర యాంటీ వెనమ్ టీకా తీసుకోవడం.
పాము కాటు అనేది నిజంగా అత్యవసర పరిస్థితి. ముందుగా భయం పక్కన పెట్టేయాలి. కాటు వేసిన స్థితిని సరిగ్గా నిర్వహించి.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడమే ప్రాణాలు కాపాడే మార్గం. మీరు గ్రామ ప్రాంతాల్లో ఉంటే ముందుగానే జాగ్రత్తగా ఉండటం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు షూస్ వేసుకోవడం.. పొలాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోని నడవడం లాంటి అలవాట్లు పాటించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




