Virat Kohli Fitness Diet: 37 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా మెరిసిపోతున్న కోహ్లీ.. అతని అసలైన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మైదానంలో చూపే చిరుత వేగానికి, అతని అసాధారణ ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం అతను పాటించే కఠినమైన ఆహార నియమాలే. 37 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా ఫిట్‌గా ఉండటం కేవలం శాకాహార డైట్ ద్వారానే ఎలా సాధ్యమో కోహ్లీ నిరూపించాడు. విరాట్ కోహ్లీకి అత్యంత ఇష్టమైన, అతని ఫిట్‌నెస్ వెనుక ఉన్న 'సూపర్‌ఫుడ్ సమ్మర్ సలాడ్' రెసిపీ దాని వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

క్రికెట్ మైదానంలోనే కాకుండా ఫిట్‌నెస్ విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి విరాట్ కోహ్లీ ఒక గొప్ప రోల్ మోడల్. ఆహారం విషయంలో కోహ్లీ చాలా క్రమశిక్షణతో ఉంటాడు. అతని రోజువారీ డైట్‌లో రకరకాల సలాడ్లు, సూప్‌లు, ఎనర్జీ డ్రింక్స్ ముఖ్య భాగం. శరీరాన్ని తాజాగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కోహ్లీ ఒక ప్రత్యేకమైన సలాడ్‌ను ఎక్కువగా తీసుకుంటాడు. ఢిల్లీలోని అతని సొంత రెస్టారెంట్ ‘వన్ 8 కమ్యూన్’ మెనూలో కూడా ఈ వంటకానికి భారీ డిమాండ్ ఉంది. ఈ సూపర్ ఫుడ్ సమ్మర్ సలాడ్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో, అందులో వాడే క్వినోవా ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు
రాకెట్ ఆకులు (Rocket Leaves): 1 కప్పు
పఫ్డ్ క్వినోవా (Puffed Quinoa): 1/4 కప్పు
వేయించిన క్యాప్సికమ్ ముక్కలు: 1/4 కప్పు
తరిగిన పుచ్చకాయ ముక్కలు: 1 చిన్న గిన్నెడు
గుమ్మడి గింజలు (Pumpkin Seeds): 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు ముక్కలు: 2 టేబుల్ స్పూన్లు
సలాడ్ డ్రెస్సింగ్ కోసం: ఆలివ్ నూనె (2 టేబుల్ స్పూన్లు), వెనిగర్ (1 టేబుల్ స్పూన్), తేనె (1 టేబుల్ స్పూన్), మస్టర్డ్ సాస్ (1 టేబుల్ స్పూన్), చిల్లీ సాస్ (1/4 టేబుల్ స్పూన్), రుచికి సరిపడా ఉప్పు.
సలాడ్ తయారీ విధానం మొదటగా ఒక పెద్ద మిక్సింగ్ గిన్నెను తీసుకొని అందులో శుభ్రం చేసిన రాకెట్ ఆకులు ఉడికించిన లేదా పఫ్డ్ క్వినోవాను వేయాలి. ఆ తర్వాత క్యాప్సికమ్‌ను కాస్త వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి. వీటికి పుచ్చకాయ ముక్కలను కూడా జత చేయాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఆలివ్ నూనె, వెనిగర్, తేనె, మస్టర్డ్ సాస్, చిల్లీ సాస్ ఉప్పు వేసి బాగా కలిపి ‘సలాడ్ డ్రెస్సింగ్’ సిద్ధం చేసుకోవాలి. ఈ డ్రెస్సింగ్ మిశ్రమాన్ని గిన్నెలోని కూరగాయలు, పండ్ల ముక్కలపై పోసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేయాలి. చివరగా పైన గుమ్మడి గింజలు, నలిపిన జీడిపప్పు ముక్కలను చల్లుకుంటే ఎంతో రుచికరమైన కోహ్లీ స్పెషల్ సూపర్ ఫుడ్ సమ్మర్ సలాడ్ రెడీ అవుతుంది.
క్వినోవాను సూపర్‌ఫుడ్ అని ఎందుకు అంటారు? ఈ సలాడ్‌లో వాడే క్వినోవా (Quinoa) నిజానికి ఒక విత్తనం అయినప్పటికీ దీనిని ధాన్యాల రూపంలో తింటారు. ఇందులో శరీరానికి అవసరమైన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Amino Acids) ఉంటాయి. అందుకే దీనిని సంపూర్ణ ప్రోటీన్ (Complete Protein) అని పిలుస్తారు. మాంసాహారం ముట్టని శాకాహారులు వీగన్‌లకు ప్రోటీన్ అందడానికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. క్వినోవాలో గ్లూటెన్ ఉండదు కాబట్టి, గ్లూటెన్ పడని వారు లేదా సెలియాక్ వ్యాధి ఉన్నవారు గోధుమలకు బదులుగా దీనిని ధైర్యంగా తీసుకోవచ్చు.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఈ సలాడ్‌లో పీచుపదార్థం (ఫైబర్), విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఇనుము (ఐరన్), పొటాషియం, ఫాస్ఫరస్ జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు నిండి ఉన్నాయి. క్వినోవాలో ఉండే బి విటమిన్లు శరీర జీవక్రియను (Metabolism) వేగవంతం చేసి రోజంతా అపారమైన శక్తిని అందిస్తాయి. పుచ్చకాయ ముక్కలు శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి.
