Eye Health: మీరూ చీకట్లో మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. దీని మాయలో పడి పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి ఫోన్ చూస్తున్నారు. కొందరు చీకట్లో కూడా ఫోన్ వినియోగిస్తుంటారు. ఇది కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చీకట్లో ఫోన్ తదేకంగా చూడటం వల్ల వీటి నుంచి వెలువడే..
చాలా మంది ఉదయం నిద్రలేవగానే చేసే మొదటిపని, రాత్రి నిద్రకు ముందు చేసే చివరి పని మొబైల్ ఫోన్ చూడటం. నేటి కాలంలో ఈ చర్య సర్వసాధారణమై పోయింది. చీకట్లో మొబైల్ ఫోన్లను వాడే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. రోజువారీ పనులు ముగిశాక, మొబైల్ ఫోన్ మీద కన్ను వేయకపోతే చాలా మందికి నిద్ర పట్టదు. నిజానికి, ఇలా రాత్రిపూట చీకట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందట.
రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం, ఈమెయిల్ చెక్ చేయడం, మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడడం దాదాపు సర్వసాధారణమైపోయింది. చీకటిలో ఫోన్‌ని ఉపయోగించడం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. చీకటిలో ఫోన్ చూస్తున్నప్పుడు, ప్రకాశవంతమైన కాంతి కళ్లపై పడుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మెదడు, నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది.
చీకట్లో మొబైల్ ఫోన్ వాడటం వల్ల కలిగే నష్టాలు ఇవే..
బ్లూ లైట్ వల్ల చెడు ప్రభావాలు
ఫోన్ వంటి ఇతర డిజిటల్ పరికరాల ద్వారా వెలువడే నీలి కాంతి కళ్ల రెటీనాపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కంటి అలసట, డ్రై ఐ సిండ్రోమ్, దృష్టి క్షీణతకు దారితీస్తుంది. కాబట్టి రాత్రిపూట లైట్లు లేకుండా చీకటిలో కూర్చొని ఫోన్ ఉపయోగించడం సరికాదు.
కంటి చూపు మందగించడం
చీకట్లో ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు వాడటం వల్ల కంటి చూపు మందగించే అవకాశాలు ఎక్కువ. ఇది కాకుండా తలనొప్పి, కంటి చికాకు కూడా సంభవించవచ్చు. ఇది కళ్ళకు అస్సలు మంచిది కాదు. ఫలితంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
నిద్రపై ప్రభావం
ఫోన్ నుంచి వెలువడే నీలి కాంతి నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. నిద్రలేమికి దారి తీస్తుంది.
డిజిటల్ ఐ స్ట్రెయిన్
ఫోన్ స్క్రీన్‌ని నిరంతరం చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. దీనిని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. చూపు మందగించడం, కళ్లలో నీళ్లు కారడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే రాత్రి చీకటిలో ఫోన్ వాడటం మానేయాలి. ఏదైనా ముఖ్యమైన పని అయితే ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించవచ్చు. లేదంటే స్క్రీన్‌పై బ్లూ లైట్ ఫిల్టర్‌ను ఆన్ చేయవచ్చు. అంతేకాకుండా, ప్రతి వ్యక్తి 20-20-20 సూత్రాన్ని అనుసరించాలి. అంటే ప్రతి 20 నిమిషాల తర్వాత కంటికి 20 సెకన్ల పాటు విరామం ఇస్తూ 20 అడుగుల దూరాన ఉండే వస్తువులను చూసే ప్రయత్నం చేయాలి. అలాగే నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందు ఫోన్ ఉపయోగించడం మానేయాలి. కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి రెగ్యులర్‌గా చెకప్ చేసుకోవాలి.