PCOS Awareness: పిసిఓఎస్ అంటే ఏంటి? మహిళల్లో పురుష హార్మోన్లు ఎందుకు పెరుగుతాయి?
మహిళల ముఖంపై అప్పుడప్పుడు ఒకటి రెండు వెంట్రుకలు కనిపించడం వేరు, కానీ గడ్డం, మీసం భాగాల్లో పురుషులలాగా దట్టంగా వెంట్రుకలు రావడం మానసికంగా ఎంతో ఆందోళన కలిగిస్తుంది. దీనిని దాచడానికి తరచూ వ్యాక్సింగ్, థ్రెడింగ్ వంటి పద్ధతులు వాడుతుంటారు. అయితే, ఈ సమస్యకు మూలం చర్మం పైన లేదు, శరీరం లోపల ఉంది. వైద్య పరిభాషలో దీనిని 'హిర్సుటిజం' అంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? డాక్టర్లు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.

అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంపై నల్లటి మొండి వెంట్రుకలు కనిపిస్తున్నాయా? పీరియడ్స్ సరిగ్గా రావడం లేదా? అయితే ఇవి కేవలం చర్మ సమస్యలు మాత్రమే కావు. మీ శరీరంలో హార్మోన్ల యుద్ధం జరుగుతోందని అర్థం. ముఖ్యంగా పిసిఓఎస్ (PCOS) వంటి సమస్యలు ఉన్నప్పుడు మహిళల్లో మగ హార్మోన్లు పెరిగి, ముఖంపై అవాంఛిత రోమాలు వస్తాయి. ఈ సమస్యను వేర్లతో సహా ఎలా తొలగించాలో తెలిపే ప్రత్యేక కథనం ఇది.
హిర్సుటిజం అంటే ఏమిటి? మహిళల్లో అండ్రోజెన్ (Androgen) అనే మగ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు, ముఖం, ఛాతీ, పొత్తికడుపుపై దట్టమైన, నల్లని వెంట్రుకలు పెరుగుతాయి. దీనినే వైద్య భాషలో హిర్సుటిజం అంటారు.
ప్రధాన కారణాలు:
PCOS/PCOD: ఇది నేడు 20-30 శాతం మహిళల్లో కనిపిస్తోంది. దీనివల్ల హార్మోన్లు అస్తవ్యస్తమై పురుష తరహాలో వెంట్రుకలు పెరుగుతాయి.
జన్యుపరమైన కారణాలు: కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వచ్చే అవకాశం ఉంది.
జీవనశైలి: సక్రమంగా లేని నిద్ర, జంక్ ఫుడ్, ఊబకాయం మరియు అధిక ఒత్తిడి.
ఇతర కారణాలు: కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు.
లక్షణాలు: కేవలం వెంట్రుకలు పెరగడమే కాకుండా.. క్రమం తప్పని రుతుచక్రం, మొటిమలు, జుట్టు రాలడం, మరియు బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స మార్గాలు:
హార్మోనల్ ఎవాల్యుయేషన్: ముందుగా రక్త పరీక్షల ద్వారా ఏ హార్మోన్ ఇబ్బందిగా ఉందో తెలుసుకోవాలి.
జీవనశైలి మార్పులు: పౌష్టికాహారం, వ్యాయామం ద్వారా బరువు తగ్గించుకోవాలి.
లేజర్ హెయిర్ రిడక్షన్: ఉన్న వెంట్రుకలను తొలగించడానికి లేజర్ ట్రీట్మెంట్ ఉత్తమమైనది. 6 నుండి 8 సెషన్లలో 70-80% వరకు ఫలితం ఉంటుంది.
డాక్టర్ సలహాతో హార్మోన్లను బ్యాలెన్స్ చేసే మందులు వాడాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు చర్మ రోగ నిపుణులను (Dermatologist) లేదా ఎండోక్రినాలజిస్టును సంప్రదించడం మంచిది.
