ఎండకాలంలో తులసి మొక్క పచ్చగా ఉండాలంటే ఇదొక్కటి వేస్తే చాలు.. గుబురుగా పెరిగే రహస్యం ఇదే..
తులసి మొక్కను సంరక్షించడానికి ముఖ్యమైన చిట్కాలు, సేంద్రీయ ఎరువుల పట్ల అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం.. ముఖ్యంగా ఎండాకాలంలో ఎండిపోయిన తులసిని పుంజుకోవడానికి, ఆకులను పెద్దవిగా, పచ్చగా పెంచడానికి కొన్ని పద్దతులను అనుసరించాలి.. ప్రూనింగ్, నీటి పిచికారీ, సరైన ఎండ, మట్టి నిర్వహణ, ఇంట్లో తయారుచేసే కొన్ని ఎరువులను ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

తులసి, భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. అందుకే.. చాలా మంది ఇళ్లల్లో్ తులసి మొక్కలను పెంచుతారు. పూజలు చేస్తారు. అయితే.. ఎండాకాలంలో తులసి మొక్కలు తరచుగా ఎండిన ఆకులు, కొమ్మలతో బలహీనంగా కనిపిస్తాయి. ఓ వైపు ఆకులు రాలడం, మరో వైపు ఎండ తీవ్రతతో ఎండిపోయే అవకాశం ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలను పునరుజ్జీవింపజేయడానికి, పచ్చగా, గుబురుగా మార్చడానికి కొన్ని పద్దతులను అనుసరించాలి.. సరైన సంరక్షణ, ఎరువులు అందించడం ద్వారా తులసి మొక్కలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు.
ఎండాకాలంలో తులసి మొక్కకు చేయవలసిన ఆరు ముఖ్యమైన పనులు:
ప్రూనింగ్ – శుభ్రపరచడం: మొదట, మొక్కలోని పాడైన, ఎండిన లేదా సగం మాడిపోయిన ఆకులను, కొమ్మలను పూర్తిగా తొలగించండి. ఇది మొక్కను శుభ్రపరచడమే కాకుండా, కొత్త చిగుర్లు రావడానికి, మొక్కకు మంచి ఆకారం రావడానికి సహాయపడుతుంది. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కూడా తొలగించి, మొక్కకు అందమైన ఆకారాన్ని ఇవ్వండి.
నీటి పిచికారీ: ప్రతి రోజూ ఉదయం తులసి మొక్క ఆకులపై నీటిని స్ప్రే చేయండి. ఇది ఆకులను తాజాగా ఉంచి, ఎండను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఎండిన కొమ్మలపై నీటిని పిచికారీ చేయడం వల్ల కొత్త కొమ్మలు వేగంగా పెరుగుతాయి. అయితే, ఈ స్ప్రే ఉదయం పూట మాత్రమే చేయాలి.
సరైన సూర్యరశ్మి: ఎండాకాలంలో తులసి మొక్కకు ఎక్కువ ఎండ అవసరం లేదు. ఉదయం పూట రెండు లేదా మూడు గంటలు, లేదా సాయంత్రం పూట రెండు మూడు గంటల ఎండ తగిలే ప్రదేశంలో మొక్కను ఉంచండి. మిట్ట మధ్యాహ్నపు తీవ్రమైన ఎండను పూర్తిగా నివారించాలి. ఒకవేళ తులసి కోట శాశ్వతంగా స్థిరపరచబడి ఉంటే, ఎండ తీవ్రత పెరిగినప్పుడు మొక్కపై కాటన్ వస్త్రాన్ని కప్పి, ప్రత్యక్ష సూర్యరశ్మి నుండి రక్షించవచ్చు. కుండీలలో పెంచుకునే మొక్కలను సులభంగా మార్చుకోవచ్చు. పూర్తి ఎండలో ఉన్న మొక్కల ఆకులు చిన్నవిగా వస్తాయి. అయితే పాక్షికంగా ఎండ తగిలే మొక్కలు పచ్చగా, బుషీగా, పెద్ద ఆకులతో ఉంటాయి.
మట్టి నిర్వహణ: తులసి మొక్క ఉన్న మట్టిని క్రమం తప్పకుండా తవ్వాలి లేదా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల వేర్లకు ఆక్సిజన్ బాగా అంది. అవి వేగంగా పెరుగుతాయి. వేర్లు ఆరోగ్యంగా ఉంటే, మొక్క మొత్తం వేగంగా పెరిగి కొత్త చిగుర్లు వస్తాయి.
మట్టిలో తేమ: వేసవిలో తులసి మొక్క మట్టిని ఎప్పుడూ తేమగా ఉంచాలి. మట్టి పూర్తిగా ఎండిపోకూడదు. మట్టి ఎండిపోవడం వల్ల ఆకులు చిన్నవిగా రావటం, కొమ్మలు తక్కువగా రావటం వంటి చెడు ప్రభావాలు మొక్కపై పడతాయి. మట్టిలో తేలికపాటి తేమ ఉండేలా చూసుకుంటే తులసి గుబురుగా, పచ్చగా ఉంటుంది.
కొత్త మొక్కల పెంపకం: మే, జూన్ కొత్త తులసి మొక్కలను నాటడానికి లేదా పెంచడానికి సరైన సమయం. నర్సరీ నుండి కొత్త మొక్కలను తీసుకురావచ్చు.. లేదా విత్తనాల ద్వారా లేదా కొమ్మల ద్వారా కొత్త మొక్కలను తయారు చేసుకోవచ్చు. కొమ్మలను నాటితే 20-25 రోజుల్లో అవి జీవం పోసుకుంటాయి.
తులసి మొక్కకు సేంద్రీయ ఎరువులు:
ఈ చిట్కాలతో పాటు సరైన ఎరువులు అందించడం వల్ల తులసి మొక్క అద్భుతమైన ఎదుగుదలను చూపిస్తుంది.
1. ఆవు పేడ/కంపోస్ట్: బాగా మగ్గిన, ఒక సంవత్సరం కన్నా పాతదైన ఆవు పేడ లేదా కంపోస్ట్ ను ఉపయోగించండి. పచ్చి పేడ మొక్కకు నష్టం కలిగిస్తుంది. చిన్న మొక్కలకు రెండు స్పూన్లు, పెద్ద మొక్కలకు నాలుగు స్పూన్ల ఈ ఎరువును మట్టి మొదట్లో కలిపి, బాగా లోపలికి వెళ్లేలా చూడండి. ఇది మొక్కకు నైట్రోజన్ అందించి ఆకుపచ్చగా, గుబురుగా పెరిగేందుకు సహాయపడుతుంది.
2. మజ్జిగ ద్రావణం: ఒక కప్పు మజ్జిగకు ఐదు కప్పుల నీళ్లు కలిపి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ను తయారు చేసుకోవచ్చు. ఇది ఇంట్లో సులభంగా తయారుచేసుకోగలిగే సమర్థవంతమైన ఎరువు.
3. అరటి తొక్కల ద్రావణం: అరటి తొక్కలను ఒక లీటర్ నీటిలో రెండు రోజుల పాటు నానబెట్టి, ఆ ద్రావణాన్ని ఉపయోగించండి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్క ఆకులను బలంగా ఉంచి, పసుపు రంగులోకి మారకుండా రాలిపోకుండా కాపాడుతుంది.
ఈ మజ్జిగ, అరటి తొక్కల ద్రావణాలను ప్రతి 10-15 రోజులకు ఒకసారి మార్చి మార్చి ఇవ్వడం ద్వారా తులసి మొక్కలో అద్భుతమైన ఎదుగుదలను చూడవచ్చు.
ఇతర ముఖ్యమైన సూచనలు:
నీమ్ కేక్ పౌడర్: అప్పుడప్పుడు నీమ్ కేక్ పౌడర్ ను మట్టిలో కలపడం వల్ల మొక్కలకు తెగుళ్ల బెడద తగ్గుతుంది. కుండీ సైజును బట్టి (10-12 అంగుళాల కుండీకి ఒక స్పూన్, చిన్నదానికి అర స్పూన్) ఇవ్వండి.
ఎరువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు:
ఎరువులు ఇచ్చేటప్పుడు మట్టిలో తేలికపాటి తేమ ఉండేలా చూసుకోండి. పొడి మట్టిపై ఎరువులు ఇవ్వకూడదు.
ఎక్కువ ఎండ ఉన్నప్పుడు లేదా సూర్యకాంతి తీవ్రంగా ఉన్నప్పుడు ఎరువులు ఇవ్వడం మానుకోండి. సాయంత్రం చల్లబడిన తర్వాత లేదా ఉదయం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఎరువులు ఇవ్వాలి.
ఒకసారి ఎరువులు ఇచ్చిన తర్వాత, 15 రోజుల వరకు తులసి మొక్కకు ఇతర ఎరువులు ఇవ్వకండి.
వేసవి సంరక్షణ చిట్కాలు, సేంద్రీయ ఎరువుల వినియోగం ద్వారా మీ తులసి మొక్క శీతాకాలపు ప్రభావాన్ని అధిగమించి, మళ్లీ పచ్చగా, ఆరోగ్యంగా, గుబురుగా పెరుగుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
