AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Borra Caves: బొర్రాగుహల ప్రాంతంలో స్టోన్‌ మాఫియా, రంగురాళ్లకోసం యధేచ్చగా తవ్వకాలు, పొంచి ఉన్న ముప్పు.!

ఇదో చూడచక్కనైన ప్రాంతం.. సహజసిద్ధ అందాలు ఈ ప్రాంతం సొంతం..! అందుకే దేశ విదేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చేందుకు క్యూ కడుతుంటారు...

Borra Caves: బొర్రాగుహల ప్రాంతంలో స్టోన్‌ మాఫియా, రంగురాళ్లకోసం యధేచ్చగా తవ్వకాలు, పొంచి ఉన్న ముప్పు.!
Borra Caves
Venkata Narayana
|

Updated on: Jul 14, 2021 | 8:37 AM

Share

Stone‌ Mafia: ఇదో చూడచక్కనైన ప్రాంతం.. సహజసిద్ధ అందాలు ఈ ప్రాంతం సొంతం..! అందుకే దేశ విదేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చేందుకు క్యూ కడుతుంటారు. సూపర్ హిట్ ఫిల్మ్ ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ సినిమా షూటింగ్‌ జరిగిన ప్రాంతమిది. కానీ.. అంతటి సహజసిద్ధ అందాలున్న ఈ ప్రాంతంపై ఇప్పుడు స్టోన్‌ మాఫియా కన్నుపడింది. బొర్రా గుహలకు కూతవేటు దూరంలో విలువైన రంగురాళ్ళకోసం తవ్వేస్తున్నారు. మీటర్ల కొద్దీ గుట్టచప్పుడు కాకుండా సొరంగాలను తలపించే తవ్వకాలు చేసేస్తున్నారు.! రైల్వే ట్రాక్‌కు అతిసమీపంలోనే ఈ తవ్వకాలు యథేచ్చగా సాగిపోతుండడం ప్రమాద పరిస్థితికి అద్దం పడుతోంది.

బొర్రా గుహలును మళ్లీ మళ్లీ చూడాలన్న కుతూహలం ఎవరికి మాత్రం ఉండదు? సహజసిద్ధంగా ఏర్పడిన ఈ బొర్రాగుహల ప్రాంతం.. విశాఖ ఏజెన్సీలోని అనంతగిరి మండలంలో ఉంది. ప్రకృతిసిద్ధంగా ఉన్న ఈ బొర్రాగుహలను చూసేందుకు ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాలనుంచే కాక.. దేశ నలుమూలలు, విదేశాల నుంచి సందర్శకులు వచ్చి సహజసిద్ధ అందాలను తిలకిస్తుంటారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. బొర్రాగుహలకు ఆనుకునే రైల్వే ట్రాక్‌ కూడా ఉంటుంది. కూతవేటు దూరంలోనే బొర్రాగుహల రైల్వే స్టేషన్‌. కొత్తవలస – కిరండోల్‌ లైన్‌.. కేకే లైన్‌ గా ఉండే ఈ రైల్‌ రూట్‌లో నిత్యం పదిహేను వరకు గూడ్సు రైళ్ళు, మరో నాలుగు పాసింజర్‌ రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ ప్రాంతం. రైల్వే స్టేషన్‌కు అతిసమీపంలోనే ఈ బొర్రాగుహలు కూడా ఉండడంతో ఎప్పుడూ జనాల తాకిడి ఉంటూ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో కొవిడ్‌ కారణంగా పాసింజర్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, పర్యాటక ప్రాంతమైన బొర్రాగుహలు కూడా మూసివేయడంతో పర్యాటకులు తాకిడి పూర్తిగా తగ్గిపోయింది.

ఇదే సరైన సమయం అనుకొని.. ఇంతటి సహజసిద్ధ అందాలున్న ఈ ప్రాంతంపై స్టోన్‌ మాఫియా కన్నుపడింది. రంగురాళ్ళకోసం బొర్రాగుహల పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఏస్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయంటే.. ఏకంగా సొరంగాలకు సొరంగాలే దర్శనమిస్తున్నాయి. రైల్వే స్టేషన్‌కు అతిసమీపంలో ఇప్పుడు అగుపిస్తోన్న సొరంగాలే.. స్టోన్‌ మాఫియా ఆగడాలకు అద్దం పడుతున్నాయి. ఒకటికాదు..రెండు కాదు ఏకంగా ఇటువంటి సొరంగాలు చుట్టుపక్కల పదికిపైగా ఉన్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

పెద్దూరు గ్రామానికి వెల్ళే మార్గంతో పాటు చింతచెట్టు ప్రాంతం, రైల్వే సిబ్బంది నివాసగృహాలు, ఆంజనేయస్వామి గుడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఈ రంగురాళ్ల తవ్వకాలతో సొరంగాలు ఏర్పాడ్డాయి. తవ్వకాలకోసం ప్రత్యేకంగా దారులను ఏర్పాటు చేసుకున్నారు కేటుగాళ్ళు. చెట్లను కొట్టి దారి ఏర్పాటు చేసుకుని లోపలకు వెళ్ళి.. గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు చేసేస్తున్నారు.

రైల్వే ట్రాక్‌కు మీటర్ల దూరంలోనే ఈ సొరంగాలు బయటపడడడంతో ముప్పు పొంచి వుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అమాయక గిరిజనులను మభ్యపెట్టి మాయచేసి విలువైన సంపదను దోచుకెళ్తున్న స్టోన్‌ మాఫియా ఆగడాలను పోలీసులు అరికట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు గిరిజనులు.

Read also: Beach : హంసలదీవి బీచ్‌ దగ్గర తీవ్రంగా అలల ఉధృతి, వంద అడుగుల ముందుకు సముద్రం, కృష్ణమ్మ పాదాలు ప్లాట్‌ఫాం ధ్వంసం