AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Tourism: విశ్రాంతితో పాటు మనశ్శాంతి కావాలా.. వేసవిలో తప్పక చూడాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలివే..

విభిన్న సంస్కృతులు, పురాతన సంప్రదాయాలు, లోతైన ఆధ్యాత్మికత కలిగిన దేశం మనది. పవిత్ర గంగా నది నుండి గంభీరమైన హిమాలయాల వరకు, భారతదేశం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించే అనేక ఆధ్యాత్మిక గమ్యస్థానాలకు నిలయం. ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఇవి పర్ఫెక్ట్ డెస్టినేషన్స్. ఐకానిక్ దేవాలయాల నుంచి పవిత్ర నదుల వరకు ఎన్నో గొప్ప ప్రదేశాలను మీరూ చూసొచ్చేయండిలా..

India Tourism: విశ్రాంతితో పాటు మనశ్శాంతి కావాలా.. వేసవిలో తప్పక చూడాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలివే..
Spiritual Places India
Bhavani
|

Updated on: Feb 27, 2025 | 2:26 PM

Share

భారత్ ఆధ్యాత్మిక ప్రదేశాలకు పుట్టినిల్లు. దేశం నలుమూలలా ఎటు చూసినా ఏదో ఒక పుణ్యక్షేత్రం.. అందులో దాగున్న ఆధ్యాత్మిక మర్మం మిమ్మల్ని గొప్ప అనుభూతికి లోనుచేస్తాయి. జీవితమనే పరుగులో అలసిపోయిన మీకు ఈ ప్రదేశాలు విశ్రాంతి మార్గాలను చూపుతాయి. మీలోని మరో ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తాయి. దైవిక మాయాజాలంలో మునిగిపోయిన అనుభవాలను మీకిస్తాయి. ఈ సారి వేసవి సెలవులకు మీకు విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కావాలని కోరుకుంటే మీరు కచ్చితంగా ఈ ప్రదేశాలను సందర్శించి తీరాల్సందే. మరి ఆ పవిత్ర స్థానాలేంటి.. అందులోని ఆధ్యాత్మిక రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం..

వారణాసి.. ఉత్తర్ ప్రదేశ్

భారతదేశ ఆధ్యాత్మికతకు వారణాసి గుండెకాయలా అనిపించే ప్రదేశం. దీనినే బెనారస్ అని కూడా పిలుస్తుంటారు. 3,000 సంవత్సరాల పురాతనమైన ఈ నగరంలో ప్రజలు పవిత్ర గంగానదిలో తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి వస్తుంటారు. ఇక్కడి సాయంత్రాల్లో ఇచ్చే గంగాహారతి ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాల్సిందే. కాశీకి వెళ్తే జీవిత గమ్యం మారిపోతుందంటారు. చావు పుట్టుకల మధ్య ఊడిసలాడే ఈ దేహం ఎంత అల్పమైనదో ఇక్కడికి వెళ్లొచ్చినవారు అనుభూతి చెందుతారు. ఇక్కడి మణికర్ణికా ఘాట్ మీరు చూడాల్సిన మరో వాస్తవిక ప్రరపంచం. వేల మరణాల్ని ఒకేసారి అనుభూతి చెందినట్టుగా అనిపిస్తుందిక్కడ. అందుకే ఇక్కడి ఘాట్‌లు ఎనలేని శక్తిని కలిగి ఉన్నాయని చెప్తారు. సూర్యోదయంలో పడవ ప్రయాణాలు, నది ఒడ్డు నుంచి కనిపించే అద్భుతమైన ప్రదేశాలు మీలో తెలియని ప్రశాంతతను కలిగిస్తాయి.

అమృత్సర్, పంజాబ్

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు.. ఇది ఒక సంపూర్ణ అనుభవం. బంగారు గోపురం.. మధ్యలో మెరిసే పవిత్ర సరస్సు ఇవన్నీ మీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఇక్కడి ఎనర్జీ పాజిటివిటీని ప్రసరింపజేస్తుంది. లంగర్ (కమ్యూనిటీ భోజనం) ప్రపంచంలోని అతిపెద్ద ఉచిత వంటశాలలలో ఒకటి. మీరెవరనే దానితో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఇక్కడ వేల మందికి రుచికరమైన భోజనాన్ని అందిస్తుంటారు. మీరు తెల్లవారుజామున లేదా సాయంత్రం, అర్ధరాత్రి వెళ్లినా సరే ఇక్కడి ఆలయ ప్రకాశం అంతే సుందరంగా వెలుగుతుంటుంది. దూరంగా వినిపించే గురు కీర్తనల శబ్దం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

రిషికేశ్, ఉత్తరాఖండ్

దేవ భూమి ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ ప్రముఖ పుణ్యక్షేత్రమే కాదు.. అందమైన పర్యాటక ప్రదేశం కూడా. ఈ ఘాట్ వద్ద ప్రతిరోజూ మూడుసార్లు హారతి ఉంటుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. రిషికేశ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన వశిష్ఠ గుహ శాంతి, ధ్యానానికి మంచి ప్రదేశం. రిషికేశ్ కు వచ్చే పర్యాటకులు ధ్యానం, శాంతి కోసమే ఇక్కడకు వస్తారు. ఈ గుహను వశిష్ఠ మహర్షి పేరుతో పిలుస్తారు. యోగా మరియు ధ్యానం నేర్పడానికి మహర్షి మహేశ్ యోగి 1961లో బీటిల్స్ ఆశ్రమాన్ని నిర్మించారు. భవతిత్ ధ్యానానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన యోగా, ధ్యానం ప్రాముఖ్యతను శాస్త్రీయంగా వివరించారు. అప్పటి నుండి ఈ పట్టణం ప్రపంచ యోగా కేంద్రంగా ఉంది. మీరు ధ్యాన సెషన్‌కు సిద్ధంగా ఉన్నా లేదా ఆధ్యాత్మిక శక్తిని ఆస్వాదించాలనుకున్నా రిషికేశ్ కచ్చితంగా వెళ్లిరండి.

కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్

కేదార్‌నాథ్ కేవలం ప్రసిద్ధ శివాలయం ఒక్కటే కాదు అక్కడికి వెళ్లే చిత్ర విచిత్ర దారులు మనకు అడుగడుగునా పరీక్షపెడుతుంటాయి. 3,583 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి ట్రెక్కింగ్ తో ఆలయానికి చేరుకోవడం గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. ఇది సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది మీరు చివరకు మంచుతో కప్పబడిన శిఖరాలతో చుట్టుముట్టబడిన శతాబ్దాల పురాతన ఆలయం ముందు నిలబడినప్పుడు, మీలో ఏదో మార్పు అనుభూతి చెందకుండా ఉండలేరు.

బుద్ధ గయ, బీహార్

బుద్ధ గయలో యువరాజు సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు, కాబట్టి మీరు ఆధ్యాత్మిక చరిత్రలో మునిగిపోయిన ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడకు కచ్చితంగా విజిట్ చేయండి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన మహాబోధి ఆలయం, ఆయన జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం కూడా పక్కనే ఉంది. ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు ధ్యానం చేయడానికి, జపించడానికి లేదా నిశ్శబ్దంగా ధ్యానం చేయడానికి ఇక్కడికి వస్తారు. గాలి కూడా బరువైనదిగా అనిపించే అరుదైన ప్రదేశాలలో ఇది ఒకటి.

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

తవాంగ్ ఆశ్రమం భారతదేశంలోనే అతిపెద్దది. అద్భుతమైనది కూడా. 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఇది ఉత్కంఠభరితమైన లోయలతో నిండి ఉంటుంది. ఇప్పుడే కలలోంచి బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది. గాలిలో రెపరెపలాడే ప్రార్థన జెండాలు, తమ రోజును పరిపూర్ణం చేసుకునేందుకు వచ్చిన సన్యాసులతో ఇక్కడి ప్రదేశం ఎంతో బాగుంటుంది. ఆశ్రమం లోపల బంగారు బుద్ధ విగ్రహం చూడొచ్చు. ఇవన్నీ చూడటానికి ప్రశాంతమైన, దాదాపు ధ్యానం చేసినంత అందమైన అనుభవాన్ని ఇస్తాయి.

తిరుపతి, ఆంధ్రప్రదేశ్

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే మతపరమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి నేచర్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ ఆలయం వెంకటేశ్వరస్వామి మహిమలకు నిలయం. ఇక్కడ సందర్శన అదృష్టాన్ని తెస్తుందని భక్తుల నమ్మకం. క్యూలు పొడవుగా ఉండవచ్చు, కానీ ఇక్కడి గాలిలోని అణవణువుణా కనిపించే ఆదినారాయణుడి మహిమ సాటిలేనిది.