AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్ ప్యాకేజీ!

Hyderabad to Kashmir tour: Kashmir పేరు వినగానే మంచుకొండలు, పచ్చని లోయలు, శ్రీనగర్ అందాలు గుర్తుకొస్తాయి. అక్కడికి వెళ్లాలని చాలామంది కలలు కంటారు. కానీ ప్రయాణం, స్టే, టూరిస్ట్ ప్లేస్‌ల విషయంలో కన్ఫ్యూజన్‌తో వెనక్కి తగ్గుతుంటారు. అలాంటి వారి కోసం IRCTC అదిరిపోయే కశ్మీర్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీతో ప్రముఖ ప్రదేశాలను సులభంగా దర్శించవచ్చు.

మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్ ప్యాకేజీ!
Hyderabad To Kashmir Tour
Rajashekher G
|

Updated on: May 22, 2026 | 8:42 PM

Share

IRCTC Kashmir Tour Package: ప్రకృతి ప్రేమికుల కలల గమ్యం అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది కశ్మీర్‌. మంచుతో కప్పుకున్న పర్వతాలు, పచ్చని లోయలు, దాల్ సరస్సులో హౌస్‌బోట్ ప్రయాణం, గుల్మార్గ్ రోప్‌వే రైడ్‌.. ఇవన్నీ కలిసి కాశ్మీర్‌ను భూమిపై స్వర్గంలా నిలబెడతాయి. అయితే అక్కడికి ఎలా వెళ్లాలి? ఏయే ప్రదేశాలు చూడాలి? స్టే ఎలా ఉంటుంది? అనే సందేహాలతో చాలామంది ట్రిప్‌ను వాయిదా వేస్తుంటారు. అలాంటి ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేకంగా “మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్” పేరుతో అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ప్యాకేజీ మొత్తం 6 రోజుల పాటు కొనసాగుతుంది. హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభమయ్యే ఈ టూర్‌లో శ్రీనగర్‌, గుల్మార్గ్‌, పహల్గామ్‌, సోన్‌మార్గ్‌ వంటి కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

మొదటి రోజు

ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి శ్రీనగర్‌ చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత హోటల్‌లో చెక్‌ఇన్‌ అవుతారు. మిగిలిన సమయాన్ని విశ్రాంతికి లేదా స్థానిక మార్కెట్లలో షాపింగ్‌కు వినియోగించుకోవచ్చు. రాత్రికి శ్రీనగర్‌లోనే బస ఉంటుంది.

రెండో రోజు

ఉదయం అల్పాహారం అనంతరం సోన్‌మార్గ్‌ వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. మంచుతో కప్పుకున్న కొండలు, అందమైన రహదారులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అక్కడి ప్రధాన ఆకర్షణ తాజ్వాస్ గ్లేసియర్‌. ఈ ప్రాంత సందర్శన అనంతరం తిరిగి శ్రీనగర్‌కు చేరుకుని హోటల్‌లో బస చేస్తారు. గ్లేసియర్ సందర్శనకు అయ్యే అదనపు ఖర్చులు యాత్రికులే భరించాలి.

మూడో రోజు

ఈ రోజు గుల్మార్గ్‌ సందర్శన ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుల్‌మార్గ్ గోండోలా రోప్‌వే ప్రయాణం ఈ టూర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మంచు కొండల మధ్య సాగే ఈ ప్రయాణం మరపురాని అనుభూతిని అందిస్తుంది. రోప్‌వే టికెట్ ఖర్చు మాత్రం పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది. సాయంత్రానికి తిరిగి శ్రీనగర్‌కు చేరుకుంటారు.

నాలుగో రోజు

ఉదయం హోటల్‌ నుంచి చెక్‌అవుట్‌ చేసి పహల్గామ్‌ వైపు బయలుదేరుతారు. సముద్ర మట్టానికి సుమారు 2440 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం తన సహజ సౌందర్యంతో ఆకట్టుకుంటుంది. కుంకుమపువ్వు తోటలు, అవంతిపూర్ శిథిలాలు, బీతబ్ వ్యాలీ, అరు వ్యాలీ, చందన్‌వరి వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఆ రాత్రికి పహల్గామ్‌లోనే బస ఉంటుంది.

ఐదో రోజు

పహల్గామ్‌ నుంచి తిరిగి శ్రీనగర్‌కు చేరుకుని ఆదిశంకరాచార్య ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం దాల్ సరస్సులో సాయంత్రపు అందాలను ఆస్వాదించవచ్చు. చార్ చినార్ ఫ్లోటింగ్ గార్డెన్స్ సందర్శన కూడా ఈ టూర్‌లో భాగమే. తర్వాత హౌస్‌బోట్‌లో చెక్‌ఇన్‌ అయ్యి అక్కడే రాత్రి బస చేస్తారు.

ఆరవ రోజు

చివరి రోజు మొఘల్ గార్డెన్స్‌, బొటానికల్ గార్డెన్‌ సందర్శనతో ప్రారంభమవుతుంది. అనంతరం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని సాయంత్రానికి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. హైదరాబాద్ చేరుకోవడంతో ఈ అందమైన కశ్మీర్ యాత్ర ముగుస్తుంది.

ఈ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us